‘అర్నబ్‌’ బీభత్సం.. అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన భారీ నౌక | Cyclone Arnab Batters Konaseema: Singapore Ship Drifts Ashore at Antarvedi | Sakshi
Sakshi News home page

‘అర్నబ్‌’ బీభత్సం.. అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన భారీ నౌక

Oct 28 2026 3:09 PM | Updated on Oct 28 2026 4:04 PM

Cyclone Arnab Batters Konaseema: Singapore Ship Drifts Ashore at Antarvedi

సాక్షి, కోనసీమ: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీభత్సం సృష్టిస్తున్న ‘అర్నబ్’ తుపాను దెబ్బకు సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుపాను తీరం దాటే సమయంలో ఏర్పడిన తీవ్రమైన అలల తాకిడికి సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ భారీ నౌక మార్గం తప్పి డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చింది.

వైజాగ్‌ పోర్టులో సరుకు అన్‌లోడ్ చేసుకుని కాకినాడ మీదుగా సింగపూర్ వెళుతున్న మార్షల్ ఐలాండ్స్‌కు చెందిన ‘సిగ్మా పేరల్’ కార్గో నౌక గాలివానలో చిక్కుకుంది. తుపాను తీరం దాటే సమయంలో ఇంజిన్ ఫెయిల్ కావడంతో పాటు తీవ్రమైన సముద్ర ప్రవాహాలు, ఈదురుగాలుల తాకిడికి నౌక అదుపుతప్పి కేజీ బేసిన్ సమీపంలో సుమారు 130 నాటికల్ మైళ్ల దూరం కొట్టుకుపోయి చివరికి అంతర్వేది తీర ప్రాంతానికి చేరింది.

తుపాను తీరం దాటే సమయంలో సముద్రంలో జరిగిన ఈ ఘటనతో కోనసీమ తీర ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న మెరైన్ అధికారులు, పోర్టు అథారిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై నౌక పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తుపాను తీవ్రత తగ్గిన తర్వాత నౌకను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చ‌ద‌వండి: యానాం-నరసాపురం మధ్య తీరం దాటిన ‘అర్నబ్‌’

మ‌త్స్య‌కారుల‌కు తీవ్ర న‌ష్టం
అర్న‌బ్ తుపాను మ‌త్స్య‌కారుల‌కు తీవ్ర న‌ష్టం క‌లిగించింది. తుపాను తీవ్ర‌త‌కు  ఓడలరేవు తీరంలో మినీ హార్బర్‌లో లంగర్ వేసిన సుమారు 200 బోట్లు ధ్వంసం అయ్యాయి. ఉప్పాడ, నక్కపల్లి గ్రామాలకు చెందిన మత్స్యకారుల ప‌డ‌వ‌ల‌తో పాటు స్థానిక బోట్లు దెబ్బ‌తిన్నాయి. మంగ‌ళ‌వారం రాత్రి వీచిన తుపాను గాలికి ఒక దానికి ఒకటి ఢీకొని ప‌డ‌వ‌లు ధ్వంసమైనట్టు స్థానికులు తెలిపారు. తుపానుకు దెబ్బతిన్న బోట్లను వైఎస్సార్‌సీపీ అమలాపురం నియోజక‌వర్గం ఇంచార్జ్ శ్రీకాంత్ పరిశీలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement