పులివెందులలో జరిగిన కార్యకర్తలు, నేతల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
పచ్చ నేతల అరాచకాలపై దునుమాడుతుంటే..
అభిమానుల్లో కసి రెండింతలైంది..
ఖాకీల కుతంత్రాలపై నిప్పులు చెరుగుతుంటే..
పార్టీ నేతల కళ్లల్లో ఎరుపొచ్చింది...
‘మీకు తోడుగా ఈ అన్న ఉన్నాడ’న్నప్పుడు..
కార్యకర్తల ఒంటి నిండా ధైర్యం వచ్చింది...
‘మీ మీద చేయి వేస్తే..నా మీద వేసినట్లే..’ అన్నప్పుడు
అభిమానుల గుండె ఉప్పొంగింది..
‘పోలింగ్ రోజు నేనుంటా.. ఎవరొస్తారో..ఎంతమంది వస్తారో
అన్యాయం చేస్తారా... రాండి’ అని సవాల్ విసురుతుంటే..
అభిమానగణంలో ఉత్సాహం ఉరకలెత్తింది..
‘కష్టకాలంలో తోడుగా ఉన్న మీకు రుణపడి ఉంటా’ అన్నప్పుడు..
పులివెందుల నేల భావోద్వేగంతో తడిసి ముద్దయ్యింది..
‘మా జగన్.. మా నాయకుడు’ అని
ఈలలతో.. చప్పట్లతో ఆ ప్రాంతం మార్మోగింది.
పులివెందుల పర్యటనలో భాగంగా మంగళవారం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన తీరును వివరిస్తుంటే...ప్రతి ఒక్కరి మనసుల్లో ఆలోచన కలిగించింది. పార్టీ కార్యకర్తలకు నిండు భరోసా కలిగింది. జననాయకుడిగా పులివెందుల గడ్డ నుంచే ‘పోరు’కు సై అంటూ సవాల్ విసరడంతో అభిమానగణం మురిసిపోయింది.

కుట్రలు తిప్పికొడదాం
సాక్షి కడప : ‘స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు అంతేలేదు. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం....రౌడీయిజం, గుండాయిజం చేస్తూ వైఎస్సార్ సీపీ అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్ పత్రాలు చించివేస్తూ వికృత చేష్టలు చేశారు.. నామినేషన్ కేంద్రం వద్ద బారికేడ్లు దాటుకుని ముందుకు వెళితే పోలీసులు అడుగడుగునా ఇబ్బందులు సృష్టించారు. చివరికి కేంద్రాలకు వెళ్లినా లోపల రిటర్నింగ్ అధికారులు కూడా నామినేషన్ విషయంలో తేడాలు చూపించారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఎన్నికల సందర్భంగా అక్కడో, ఎక్కడో పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ చేసుకున్నట్లు విన్నాం.
కానీ, నామినేషన్లే వేయనీయకుండా అడ్డుపడటం ఇప్పుడు చూస్తున్నాం.. నామినేషన్ కాకుండా సెలెక్షన్ అని పెట్టుకుంటే బాగుండేది. అప్పుడు ఎవరిని కావాలంటే వారిని సెలెక్ట్ చేసుకోవచ్చు.. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోతోంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన పులివెందులలో మాట్లాడుతూ నామినేషన్స్ వేయనీయకుండా అడ్డుకునే బదులు నేరుగా నామినేట్ చేసుకుంటే పోతుంది కదా అని సీఎం చంద్రబాబు తీరును ఎద్దేవా చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల ఆస్తిపాస్తులకు రక్షణ ఉండదని ఇప్పటికైనా ప్రజలు ఏకతాటిపై నిలిచి హక్కుల కోసం పోరాటం చేసేందుకు కలిసి రావాలని జగన్ పిలుపునిచ్చారు.
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించండి..
జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారీ్టతో గెలిపించాలని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను కోరారు. అందుకు సంబంధించి మంగళవారం పులివెందులలోని వైఎస్సార్ ఆడిటోరియంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మున్సిపల్ ఇన్‌ఛార్జిలు చవ్యా దుష్యంత్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ, తొండూరు మండల ఇన్‌ఛార్జి వైఎస్ మధురెడ్డిలతో కలిసి తొలుత పులివెందుల మున్సిపల్ వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోటీ లో ఉన్న అభ్యర్థులతోపాటు వైఎస్సార్ సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ, కడప మేయర్ అభ్యర్థి బండి దీప్తిరెడ్డితోపాటు కార్పొరేటర్ అభ్యర్థులు, జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు బరిలో ఉన్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. నామినేషన్లు వేయడం కోసం అభ్యర్థులు పడిన కష్టాలు తెలుసు... ఎన్నికలతోపాటు కౌంటింగ్ సందర్భంలోనూ టీడీపీ నేతలు ఇబ్బందులు పెడతారని తెలిసినా పోరాటం చేస్తున్న అందరికీ అభినందనలు తెలిపారు. గుండె ధైర్యంతో అడుగు ముందుకు వేయడమే మన కర్తవ్యమని హితబోధ చేశారు.
కార్యకర్తలతో మమేకం
వైఎస్ జగన్ జిల్లా పర్యటనలో భాగంగా తొలిరోజు బిజీబిజీగా గడిపారు. బెంగళూరు నుంచి నేరుగా పులివెందులకు చేరుకున్నప్పటి నుంచి ఆడిటోరియం మొదలుకొని క్యాంపు కార్యాలయం వరకు రోజంతా ప్రజలతోనే గడిపారు. ఆడిటోరియంలో పులివెందుల మున్సిపల్ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులతోపాటు అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత మధ్యాహ్నం వరకు కార్యాలయంలో ఉన్న వైఎస్ జగన్ సాయంత్రం కడప కార్పొరేషన్‌కు చెందిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులతో మాట్లాడారు.
∙ఎన్నికల సందర్భంగా టీడీపీ గుండాల దాడిలో గాయపడిన కార్యకర్తలతోనూ మాట్లాడి ధైర్యం నింపారు.
నేతలతో ఆత్మీయ పలకరింపు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం పలువురు వైఎస్సార్ సీపీ నేతలు కలిసి చర్చించారు. పులివెందులలోని హెలిప్యాడ్, వైఎస్సార్ ఆడిటోరియం, క్యాంపు కార్యాలయంలో అనేక మంది పార్టీ నాయకులు వచ్చి కలిశారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి, సీఈసీ సభ్యుడు కె.సురేష్‌బాబు, మాజీ మేయర్ పాకా సురేష్‌కుమార్, కడప మేయర్ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీలు ఎంవీ రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, పి.రామసుబ్బారెడ్డి, పులివెందుల మున్సిపల్ మాజీ చైర్మన్లు రుక్మిణిదేవి, వరప్రసాద్, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ
పులివెందులలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ సందర్భంలో జరిగిన పోలీసుల దాడుల్లో గాయపడిన పులివెందుల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ హఫీజ్‌ను మంగళవారం ఫోన్‌లో వైఎస్ జగన్ పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు.


