బాబు పాలనలో ‘మందు’మాగధుల దాష్టీకాలు | Chandrababu Failure Government In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో ‘మందు’మాగధుల దాష్టీకాలు

Oct 28 2026 6:33 AM | Updated on Oct 28 2026 6:33 AM

Chandrababu Failure Government In Andhra Pradesh

మద్యాంధ్రప్రదేశే సర్కారు విజన్‌

అనర్థాలు, అకృత్యాలకు  దారితీస్తున్న మద్యం పాలసీ

మత్తులో చెలరేగుతున్న పచ్చ కూటమి మూకలు 

ప్రకాశం జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జనసేన కార్యకర్త లైంగికదాడి, హత్య

అనంతపురం జిల్లా పామిడిలో చిన్నారిపై టీడీపీ కార్యకర్త అత్యాచారయత్నం  

రెండు ఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం

సర్కారు తీరుతో బానిసలుగా మారుతున్న యువత, సామాన్యులు  

మద్యం తాగిన మదంతోనే హత్యలు.. ప్రమాదాలు.. దాడులు

ఇవన్నీ మద్యాన్ని ఏరులైపారిస్తున్న  చంద్రబాబు సర్కారు పాపాలే

ఒక వైపు స్థానిక ఎన్నికల్లో మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న పచ్చ మూకలు

మరోవైపు విచ్చలవిడిగా బెల్ట్‌షాపుల్లో మద్యం అమ్మకాలు, గంజాయి మూకల అరాచకాలు

పసిపాపలు, మహిళలపై అఘాయిత్యాలను కట్టడి చేయడంలో సర్కారు ఘోర వైఫల్యం

డ్రగ్స్‌ కేసుల్లో నిందితులుగా కూటమి కీలక నేతలు, వారి కుటుంబ సభ్యులు

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వానికి మద్యంపై ఆదాయం తప్ప ప్రజల మానప్రాణాలు గురించి పట్టడం లేదు. లైసెన్స్‌ మద్యం షాపులతోపాటు విచ్చలవిడిగా బెల్ట్‌షాపులను ప్రోత్సహిస్తోంది., గంజాయి, మత్తు పదార్థాలు యథేచ్ఛగా రవాణా అవుతున్నా.. చేష్టలుడిగి చోద్యం చూస్తోంది. ఫలితంగా మత్తుపదార్థాలు సేవించిన కామాంధులు రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ]

అయినా సర్కారులో చలనం లేదు. తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. బాలికలు, మహిళలకు రక్షణ కవచంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో తెచ్చిన దిశ బిల్లునూ రద్దు చేసిన  బాధ్యాతరాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఆడపిల్ల జోలికి వస్తే అదే ఆఖరి రోజని మాటలు చెప్పిన చంద్రబాబు  ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు.  
ఒకవైపు స్థానిక ఎన్నికల్లో మహిళలపై పచ్చ మూకలు అసభ్యంగా ప్రవర్తిస్తుంటే.. చూస్తూ పైశాచికానందం పొందుతున్నారు. మరోవైపు విచ్చలవిడి మద్యం అమ్మకాలతో జనం ప్రాణాలు తీస్తున్నారు.

బాబు మార్క్‌ సిండికేట్‌ బరితెగింపు
చంద్రబాబు ప్రభుత్వం తన ట్రేడ్‌ మార్క్‌ మద్యం దోపిడీకి మరోసారి బరితెగించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలు చేసిన దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. మద్యం మాఫియాకు తలుపులు బార్లా తెరిచింది. ప్రైవేట్‌ మద్యం దుకాణాల వ్యవస్థను తీసుకువచ్చింది. 4,336 మద్యం దుకాణాలను ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. బార్లను కూడా టీడీపీ సిండికేటే ఏకపక్షంగా దక్కించుకుంది. వాటికి అనుసంధానంగా దాదాపు 75వేల అనధికార బెల్ట్‌ దుకాణాలు ఏర్పాటుకు పరోక్ష సహకారం అందించింది. 

  2014–19నాటి మద్యం దోపిడీకి మించి మహాదోపిడీకి సర్కారు తెగబడుతోంది. ప్రివిలేజ్‌ ఫీజు రద్దు, ఎమ్మార్పీ కంటే 20శాతం అధిక ధరలతో 2014–19లో రూ.25వేలు కోట్లు కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు.. 2024–29లో అంతకు రెట్టింపు అంటే రూ.50వేల కోట్ల దోపిడీకి తెరతీశారు. అందుకోసం లాభాల మార్జిన్‌ పెంపు, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాల ద్వారా దాదాపు రూ.లక్ష  కోట్ల భారీ దోపిడీకి మద్యం సిండికేట్‌ బరితెగించిందని సమాచారం. ప్రజలతో మద్యం తాగించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వం రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగిస్తోంది. ఎక్సైజ్‌ అధికారులను వెంటపడి వేధించి మరీ మద్యాన్ని ఏరులైపారిస్తోంది.  2024–25 సంవత్సరంలో రూ.29,440 కోట్ల మద్యం విక్రయించగా, ఇవి  2025–26లో రూ.31,237 కోట్లకు చేరాయి. దీంతో గత ఏడాది కంటే 6.11శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి.  

మద్యానికి తోడు గంజాయి, డ్రగ్స్‌ దందా
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ మాఫియా రాజ్యమేలుతోంది. గంజాయి దందాను అరికడతామంటూ చంద్రబాబు మాటలు కోటలు దాటినా.. చేతలు మాత్రం గడప దాటడం లేదు. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన  చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్రం గంజాయి దందాకు గేట్‌ వేగా మారినా చోద్యం చూస్తున్నారు. టీడీపీ కూటమి నేతలే రింగ్‌ మాస్టర్లుగా మత్తు మాఫియా రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. టీడీపీ కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను పర్యవేక్షిస్తుండటంతో పోలీసు శాఖ చోద్యం చూస్తుండిపోవాల్సి వస్తోంది. 

ఏవోబీలో యథేచ్ఛగా గంజాయి సాగు 
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అల్లూరి సీతారామరాజు(ఏఎస్‌ఆర్‌) జిల్లా కేంద్రంగా గంజాయి మాఫియా చెలరేగింది.  మొత్తం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో గంజాయి సాగు చేయిస్తుండటంతోపాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ల నుంచి భారీగా గంజాయి కొని ఏపీ పరిధిలోనే అక్రమార్కులు నిల్వ చేస్తున్నారు. కుటీర పరిశ్రమ తరహాలో లిక్విడ్‌ గంజాయి యూనిట్లను ఏర్పాటు చేశారు. ఏజెంట్ల వ్యవస్థను నెలకొల్పి భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్‌ సాగిస్తున్నారు. దక్షిణ, ఉత్తర భారత రాష్ట్రాలకు దర్జాగా తరలిస్తున్నారు. 

డ్రగ్స్‌ దందాలో టీడీపీ ఎంపీ 
దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దందా బయటపడినా వాటి మూలాలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఉంటున్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్‌ పార్టీని పోలీసులు ఛేదించినా టీడీపీ కూటమి పెద్దలే చిక్కుతున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ డ్రగ్స్‌ సేవిస్తూ హైదరాబాద్‌ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి డ్రగ్స్‌ దందాలో అడ్డంగా దొరకడం గమనార్హం.  

మద్యాసుర పాలనలో మగువ నలిగిపోతోంది. మానవతుల శీలం మంటగలిసిపోతోంది. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ మద్యాంధ్రప్రదేశై ఆర్తనాదం చేస్తోంది. హత్యలు, దాడులతో అట్టుడుకుతోంది. మత్తెక్కిన మగ పశువులు తలవిసిరి రంకెలేస్తున్నాయి. అసహాయుల దీనఘోషతో దిశలు మార్మోగుతున్నాయి. ధనమైకంలో సర్కారు ‘మత్తు’నిద్రపోతోంది. మద్యం అమ్మకాలతో కాసులు పిండిస్తూ.. వందిమాగధుల దాష్టీకాలను చూస్తూ రాక్షసానందం పొందుతోంది. అఘాయిత్యాల కట్టడిలో ఘోరంగా విఫలమవుతోంది. మహిళలపై జరిగిన నేరాల్లో 17మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టీడీపీ వారేనని, ఈ నేరాల్లో ఆ పార్టీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌(ఏడీఆర్‌)’ తాజా నివేదిక సంచలన నిజాలు వెల్లడించింది. దీంతో ఏపీ ప్రభుత్వం జాతీయస్థాయిలోనూ అభాసుపాలైంది.  

టీడీపీ కార్యకర్త అఘాయిత్యం 
అనంతపురం జిల్లా పామిడిలో ఐదేళ్ల చిన్నారిపై టీడీపీ కార్యకర్త షెక్షావలి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మద్యం తాగిన మత్తులో షెక్షావలి ఆ చిన్నారికి చాక్లెట్‌ కొని ఇస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి కాలనీలోని ఒక ఇంటి మిద్దెపైకి తీసుకెళ్లాడు. లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆ చిన్నారి కేకలు వేసింది. దీంతో స్థానికులు గుర్తించి గట్టిగా కేకలు వేయడంతో పరుగుతీశాడు. అయినా స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతన్ని కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్‌ చేసే ధైర్యం చంద్రబాబు చేయలేకపోయారు.  

మత్తు పాశవికానికి వైద్యవిద్యార్థిని బలి 
ఈ ఏడాది ఆగస్టు  3న రాజమహేంద్రవరంలోని ప్రసాద్‌ ఆదిత్యా మాల్‌ వద్ద మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు (సురవరపు దుష్యంత్, ఆండ్రూ జోసెఫ్‌ ఎడ్వర్డ్స్‌) కారుతో పీజీ మెడికల్‌ విద్యార్థి కె.ప్రియాంక స్కూటీని ఢీకొట్టారు. ఈ దాడిలో ప్రియాంక తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అవడంతో ఆరు రోజులపాటు మృత్యువుతో పోరాడింది. చివరకు చికిత్స పొందుతూ మరణించింది. అప్పటి వరకు పంటి బిగువున భరించిన ఆమె తండ్రి వేదన ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. మానవత్వంలేని ప్రభుత్వం అని ఆక్రోశించారు.  డాక్టర్‌గా సమాజానికి వైద్య సేవలు అందించాల్సిన మెడికో ప్రియాంక మందుబాబుల చేతిలో హత్యకు గురైన ఘటన దేశ వ్యాప్తంగా ప్రజలను కదిలించినా చంద్రబాబు మనసు మాత్రం కరిగించలేకపోయింది.

బాబు పాలనలో గుండెలను పిండేసే మద్యం ఘోరాలివీ..    
⇒ కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటే కూరు వద్ద గత ఏడాది అక్టోబర్‌ 24న మద్యం సేవించిన యువకుడు బైక్‌ నడుపుతూ వెళ్లి ఢీకొట్టడంతో ఓ బస్సు అగ్నిప్రమాదానికి గురై మరో 20 మంది సజీవ దహనమైన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదానికి కారణమైన బైకర్‌ మద్యం సేవించినట్టు ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లోనూ తేలింది
⇒  విజయవాడలో ఈ ఏడాది జూన్‌లో మద్యం మ­తు­్తలో అన్నదమ్ములు పోలీసులపై దాడి చేశా­రు. 
⇒ కడప జిల్లాలో ఒక వ్యక్తి మద్యం మత్తులో మూడే­ళ్ల బాలికపై లైంగిక దాడి చేసి ఆపై హత్య చేశాడు

⇒ కృష్ణా జిల్లాలో మద్యం మత్తులో ఓ తండ్రి తన కొడుకును హత్య చేశాడు
⇒ అనంతపురంలో మద్యం మత్తులో ఒక వ్యక్తి బీర్‌ బాటిళ్లు, సిమెంట్‌ ఇటుకలతో 17 ఏళ్ల మైనర్‌ను హత్య చేశాడు.
⇒ అన్నమయ్య జిల్లాలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు బీర్‌ తాగి మరణించారు.

⇒   గతేడాది నవంబర్‌ 7న గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మద్యం మత్తులో నిందితులు కన్నతల్లి ముందే కొడుకుని పాశవికంగా హత్య చేశారు.  
⇒  గుంటూరులో గతేడాది ఏప్రిల్‌ 8న ఫుల్లుగా మద్యం సేవించిన కొందరు  హర్షద్‌ అనే వ్యక్తి ఇంటిపై బ్లేడ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో హర్షద్‌ నాయనమ్మ పఠాన్‌ ఖాజాబీ (70) తీవ్రంగా గాయపడి మతి చెందారు. 
⇒   గుంటూరులో విద్యార్థినికి మద్య­ం అలవాటు చేసి పలువురు లైంగిక దాడికి పా­ల్ప­­డ్డారు.  
⇒   వైఎస్సార్‌ జిల్లా కడపలో వెంకటేశ్‌ అనే వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి మద్యం బాటిల్‌ పగలగొట్టి కడుపులో పొడిచి హత్యచేశాడు.  

⇒   ప్రొద్దుటూరులోని ఒక లాడ్జిలో ముగ్గురు స్నేహితులు రాఘవేంద్రకుమార్‌(పప్పి)ని మద్యం సీసాలతో పొడిచి హత్య చేశారు. 
⇒  రామేశ్వరంరోడ్డులోని ఓ మద్యం షాపు వద్ద జరిగిన గొడవలో షేక్‌ అర్షద్‌ అనే ఆటోడ్రైవర్‌ను అతని స్నేహితుడే బండరాయితో కొట్టిచంపాడు.  
⇒  అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లి గ్రామం మేకలవారిపల్లిలో భార్య రమణమ్మను ఆమె భర్త లక్ష్మిరెడ్డి కొడవలితో దారుణంగా హత్య చేశాడు. కోళ్లు చనిపోయిన విషయం తనకు చెప్పలేదన్న కారణంగా తాగిన మైకంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
⇒   నిమ్మనపల్లె మండలంలోని కొండయ్యగారి పల్లెలో బోయకొండ అనే వ్యక్తి మద్యం మత్తులో  తన కుమార్తెపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

⇒   కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన గిరిని అతడి స్నేహితులే మద్యం మత్తులో కత్తితో పొడిచి చంపారు.  
⇒    రాజమహేంద్రవరంలో ఎర్ర గణేష్‌ అనే రౌడీషీటర్‌ను అతని వ్యాపార భాగస్తులు మద్యం తాగి హత్యచేశారు.  
⇒ రాజమండ్రిలో ఆటోడ్రైవర్‌ బుజ్జిబాబును ముగ్గు­రు మద్యం మత్తులో రాడ్డుతో కొట్టి చంపారు.  
⇒ కడప జిల్లా అలంఖాన్‌పల్లె సమీపంలో గంజాయి గ్యాంగ్‌ పెద్ద దస్తగిరిని నరికి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement