ఫెళఫెళ గాలులు.. కుండపోత వానలు | Cyclone Arnab: Heavy rainfall hit Konaseema district | Sakshi
Sakshi News home page

ఫెళఫెళ గాలులు.. కుండపోత వానలు

Oct 28 2026 6:11 AM | Updated on Oct 28 2026 6:11 AM

 Cyclone Arnab: Heavy rainfall hit Konaseema district

అర్నబ్‌ బీభత్సం.. కోనసీమ అతలాకుతలం

సాక్షి, అమలాపురం/ సాక్షి, రాజమహేంద్రవరం: అర్నబ్‌.. 1996 నాటి పెను తుపానును గుర్తు చేస్తోంది. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అప్పటి కాళరాత్రిని అర్నబ్‌ తిరిగి కళ్ల ముందుకు తీసుకొచి్చంది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి ప్రచండ గాలుల హోరు తీవ్రమైంది. అతి భారీ వర్షం కురుస్తోంది. సముద్రం ఉగ్రరూపం దాల్చగా అర్నబ్‌ తుపాను కోనసీమను వణికిస్తోంది.

తీరప్రాంతంలో గాలులు ప్రళయ భయంకరంగా వీస్తుండటంతో కొబ్బరి చెట్లు, భారీ వృక్షాలు, ఇంటి పైకప్పులు, హోర్డింగ్‌లు, నేలకొరుగుతున్నాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడుతున్నాయి. సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ తీరంలోని సరుగుడు తోటల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. కుండపోత వర్షాలు, గాలుల తీవ్రతతో తీరప్రాంత మండలాలు అల్లకల్లోలంగా మారాయి. ఎప్పుడు ఏ చెట్టు కూలుతుందో.. ఎక్కడ ఏ విద్యుత్‌ స్తంభం నేలకొరుగుతుందోనన్న భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. 

భయం గుప్పిట్లో కోనసీమ
పెను తుపాను తీర ప్రాంత మండలాలపై విరుచుకుపడుతోంది. ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో గాలుల తీవ్రత అధికంగా ఉంది. ఉదయం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. సముద్ర అలలు గోదావరి నదీ పాయల ద్వారా చొచ్చుకుని వస్తున్నాయి. అలలు రావడంతో మురుగునీటి డ్రెయిన్లలో ముంపు నీరు గట్లు దాటుతోంది. గాలుల తీవ్రత చూస్తుంటే 1996 పెను తుపాను సమయంలో వచ్చినట్టుగా ఉప్పెన రానుందని మత్స్యకారులు భయపడుతున్నారు. కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లోని మత్స్యకార గ్రామాలు భయంతో వణికిపోతున్నాయి. కాట్రేనికోన మండలం చిర్ర యానాం లేదా అల్లవరం–మావిుడికుదురు మండలాల సరిహద్దులోని వైనతేయ నది సముద్ర సంగమ ప్రాంతం వద్ద తుపాను తీరం దాటే అవకాశాలపై ఉత్కంఠ నెలకొంది.

రొయ్యల పట్టుబడుల్లో హడావుడి
జిల్లాలో సుమారు 18 వేల ఎకరాల్లో వనామీ రొయ్యల సాగు జరుగుతుండగా, ప్రస్తుతం 10,800 ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నట్టు అంచనా. తుపాను ముప్పుతో రైతులు ముందుగానే పట్టుబడులు పడుతున్నారు. ముఖ్యంగా 40 నుంచి 100 కౌంట్‌ మధ్యలో ఉన్న రొయ్యలను వేగంగా విక్రయిస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొనుగోలుదారులు ధరలు తగ్గించడంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది.

 వారం క్రితం రూ.470 ఉన్న 30 కౌంట్‌ ధర ప్రస్తుతం రూ.430కి, రూ.340 ఉన్న 60 కౌంట్‌ ధర రూ.310కి, రూ.250 ఉన్న 100 కౌంట్‌ ధర రూ.220కి పడిపోయింది. కౌంట్‌ను బట్టి కేజీకి రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గడంతో ఆక్వా రైతులపై అదనపు భారం పడుతోంది. తుపాను గాలు­లకు చెట్లు నేలకొరిగే ప్రమాదం ఉండటంతో కొబ్బరి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 1996 తుపాను నాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ చెట్లపై బరువు తగ్గించేందుకు కాయల దింపులు తీయిస్తున్నారు. తోటల్లోని కొబ్బరి రాశులను ఇళ్లకు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు
అర్నబ్‌ తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా ఎప్పటికప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిపేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చేతికి అందొచి్చన పంట ఏమవుతుందోనని అన్నదాతలు బిక్కుబిక్కుమంటున్నారు.

కోనసీమ జిల్లా అమలాపురం నల్ల వంతెన వద్ద కలెక్టర్‌ ఆఫీస్‌ రోడ్డులో విరిగిపడిన విద్యుత్‌ స్తంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement