ఈదురు గాలుల ధాటికి విశాఖలోని సత్యం జంక్షన్ వద్ద విరిగిపడిన చెట్లు
భీకర గాలులు.. కుండపోత వర్షం
నేలకొరిగిన వృక్షాలు.. విరిగిన విద్యుత్ స్తంభాలు
జలదిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు.. అంధకారంలో నగరం
ముందస్తు చర్యల్లో అధికారుల వైఫల్యంపై విమర్శలు
సాక్షి, విశాఖపట్నం/ సాక్షి, అమరావతి: అర్నబ్ తుపాను విశాఖ నగరాన్ని వణికించింది. సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలతో బీచ్ ప్రాంతం భీతావహంగా కనిపించింది. భీకర గాలులు, కుండపోత వర్షం నగరవాసులను బెంబేలెత్తించాయి. ఎప్పుడు ఏ చెట్టు కూలుతుందో.. ఏ విద్యుత్ స్తంభం నేలకొరుగుతుందోనన్న భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో పలు ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి. వాహనాలపై చెట్లు కూలిపోవడంతో నష్టం వాటిల్లింది. మరోవైపు భారీ వర్షాలతో రహదారులు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నేలకొరిగిన మహా వృక్షాలు
భీకర గాలుల ధాటికి అంగడిదిబ్బ, సీతంపేట, గురుద్వార, సీతమ్మధార, అక్కిరెడ్డిపాలెం, అక్కయ్యపాలెం, ఆరిలోవ, పెదగంట్యాడ, గాజువాక, మల్కాపురం, పెదగదిలి, పెదవాల్తేరు, శివాజీపాలెం, మద్దిలపాలెం, సత్యం జంక్షన్ తదితర ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. చెట్లు వాహనాలపై పడటంతో బైక్‌లు, ఆటోలు, కార్లు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు గంటల తరబడి చీకట్లోనే గడపాల్సి వచ్చింది. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో తీవ్ర జాప్యం జరగడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను నేపథ్యంలో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి విశాఖ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. విశాఖ రూరల్ మండలం పీఎం పాలెం వద్ద అత్యధికంగా 18.5 సెంటమీటర్లు.. ఉత్తరాంధ్రలోని 100కు పైగా ప్రాంతాల్లో 10 సెం.మీ.కు పైగా వర్షం కురిసింది. విజయనగరం జిల్లాలో కొత్తవలస, భోగాపురం, డెంకాడ, వేపాడ.. శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాళి, జలుమూరు, కోటబొమ్మాళి, ఆమదాలవలస ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి.


