సాక్షి, విజయవాడ: ఆర్నబ్ తుఫాను ప్రభావంతో కృష్ణా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయి పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి.
కోనసీమ జిల్లాలోని 19 మండలాల పరిధిలో వందలాది చెట్లు కూలినట్లు సమాచారం. రహదారులపై చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
కాకినాడ జిల్లాలోని మహాలక్ష్మీనగర్, ముత్తానగర్, ఉప్పాడ, సుబ్బంపేట, సూరాడపేట ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చినట్లు సమాచారం. పలు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విశాఖలో అర్నబ్ బీభత్సం
- పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
- బీకర గాలులలకు నేలకొరిగిన భారీ వృక్షాలు
- అనకాపల్లి జిల్లా కన్నూరు పాలెంలో 25 సెంమి వర్షపాతం నమోదు
- విశాఖ నగరంలో 24,సింహాచలం లో 22 సెంమి వర్షపాతం నమోదు
- గడచిన 24 గంటలగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం
తొలుత బుధవారం ఉదయం తీరం దాటుతుందని అంచనా వేసినప్పటికీ ఇది వేగంగా కదిలి మంగళవారం రాత్రి 11.30 గంటలకు యానాం వద్ద తీరాన్ని తాకింది. ఈ ప్రక్రియ బుధవారం తెల్లవారుజాము 4 గంటల వరకు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు వీస్తాయని పేర్కొంది. తీరం దాటడానికి ముందు తుపాను గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ–వాయవ్య దిశగా కదిలింది.
తీరం దాటే సమయంలో సాధారణ ఆటుపోట్ల కంటే 1.5 నుంచి 2.5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాకినాడ, యానాం వద్ద ఉప్పెన తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. యానాం వద్ద రెండు మీటర్లు, కాకినాడ మండలం పోలేకుర్రు వద్ద 1.8 మీటర్లు, ముమ్మిడివరం మండలం జి.వేమవరం వద్ద 1.1 మీటర్లు, పిఠాపురం మండలం పొన్నాడ వద్ద ఒక మీటరు ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. 
యానాంలో అర కిలోమీటరు వరకు, కాకినాడ, అమలాపురం, పిఠాపురం, నరసాపురం, రాజోలు ప్రాంతాల్లో 200–250 మీటర్ల వరకు సముద్రపు నీరు లోపలికి చొచ్చుకువచ్చింది. విశాఖ రూరల్ మండలం పీఎం పాలెం వద్ద అత్యధికంగా 18.5 సెంటమీటర్లు.. ఉత్తరాంధ్రలోని 100కు పైగా ప్రాంతాల్లో 10 సెం.మీ.కు పైగా వర్షం కురిసింది. ఇందులో సగం ప్రాంతాలు విశాఖ జిల్లాలోనే ఉన్నాయి.


