హమ్మయ్య... పెద్ద గండం తప్పింది!  | World leaders warn of security flaws found in PHP programming language | Sakshi
Sakshi News home page

హమ్మయ్య... పెద్ద గండం తప్పింది! 

Oct 23 2026 1:32 AM | Updated on Oct 23 2026 1:32 AM

World leaders warn of security flaws found in PHP programming language

పీహెచ్‌పీ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో భద్రతా లోపాలు 

70% వెబ్‌సైట్లకు పీహెచ్‌పీనే కీలకం 

గుర్తించిన కృత్రిమ మేధ ఏజెంట్లు 

ప్యాచ్‌ తయారీలో ప్రభుత్వాలు, కంపెనీలు 

పీహెచ్‌పీ ఫౌండేషన్‌ ప్యాచ్‌ విడుదల 

వాషింగ్టన్‌: మానవాళికి ముప్పు కాగలదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో కృత్రిమ మేధ ఓ గొప్ప సాయమే చేసింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 శాతం వెబ్‌సైట్లను నడిపించే కీలక ప్రోగ్రామింగ్‌ భాష పీహెచ్‌పీలోని భద్రతలోపాలను గుర్తించింది. దీంతో అటు ప్రభుత్వాలు, ఇటు ఐటీ కంపెనీలు ఈ లోపాలను సరిదిద్దే సాఫ్ట్‌వేర్‌ (ప్యాచ్‌) తయారీకి పరుగులు పెడుతున్నాయి. 

చాలావరకూ ప్రభుత్వ వెబ్‌సైట్లు గురువారం మామూలుగానే పనిచేశాయి కానీ.. ప్యాచ్‌ను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో కొన్ని రకాల నెట్‌ సేవలకు అంతరాయం కలిగినట్లు సమాచారం. పీహెచ్‌పీ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లోని భద్రతా లోపాలపై అమెరికా సంస్థ ఎఫ్‌బీఐ మొట్టమొదట బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ లోపాల సాయంతో హ్యాకర్లు పీహెచ్‌పీ ఆధారంగా పనిచేసే సిస్టమ్స్‌లోకి దూరం నుంచే కోడ్‌ను ప్రవేశపెట్టి రన్‌ చేయగలరని తెలిసింది. 

దీనివల్ల సున్నితమైన డేటాతోపాటు నెట్‌వర్క్‌ వ్యవస్థలు సైతం ముప్పును ఎదుర్కొవాల్సి రావచ్చు. లోపాలను సరిదిద్దే ప్యాచ్‌ను వెంటనే సిద్ధం చేయడం వీలు కాని నేపథ్యంలో వెబ్‌సైట్లను తాత్కాలికంగా ఆఫ్‌లైన్‌ మోడ్‌లో ఉంచాలని ఎఫ్‌బీఐ సూచించింది.  ఇదిలా ఉంటే పీహెచ్‌పీ భద్రత లోపాలకు సంబంధించి ప్యాచ్‌ను అభివృద్ధి చేస్తున్నందున బ్రిటన్‌లో కొన్ని ప్రభుత్వ సేవలు తాత్కాలికంగా నిలిపేయవచ్చునని ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఓపెన్‌ ఏఐ వంటి సంస్థలతో కలిసి పరిష్కార మార్గాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. 

ఫిన్లాండ్, జపాన్‌లు ఇప్పటికే ప్యాచ్‌ను విడుదల చేసి అందరూ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ప్రకటించాయి. ఒకవేళ ప్యాచ్‌ను ఇన్‌స్టాల్‌ చేయడం కష్టమైతే వెబ్‌సైట్లను తాత్కాలికంగా నిలిపివేసే అంశాన్ని ఆయా దేశాలు పరిశీలిస్తున్నాయి. మరోవైపు క్లౌడ్‌ఫ్లేర్‌ సీఈవో మాథ్యూ ప్రిన్స్‌ సోషల్‌ మీడియాలో ఒక పోస్టు చేస్తూ పీహెచ్‌పీలోని లోపాల గురించి తెలిసిన వెంటనే దాన్ని దురి్వనియోగం చేసేందుకు లక్షల ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. పీహెచ్‌పీ ఫౌండేషన్‌ కూడా భద్రత లోపాలను సరిదిద్దే ప్యాచ్‌ను బుధవారం రాత్రే విడుదల చేయడంతోపాటు, అప్‌డేషన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.  

కృత్రిమ మేధ పాత్ర... 
పీహెచ్‌పీలోని భద్రత లోపాలను గుర్తించడంలో కృత్రిమ మేధస్సు ఏజెంట్లు కీలక పాత్ర పోషించాయి. రెండు నెలలుగా తమ ఏఐ ఏజెంట్లు ఈ లోపాలను గుర్తించేందుకు, పరిష్కార మార్గాలను సిద్ధం చేసేందుకు పనిచేశాయని ఓపెన్‌ఏఐ తన బ్లాగ్‌లో వివరించింది. ఈ పనిలో ఐటీ నిపుణులతోపాటు భద్రతా సంస్థలు ఇతర భాగస్వాములు కూడా పాలుపంచుకున్నట్లు తెలిపింది. మరోవైపు యూరోపియన్‌ యూనియన్‌ సైబర్‌ భద్రత సంస్థ ఎనిసా కూడా కంపెనీలు ఈ లోపాల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement