న్యూఢిల్లీ:ప్రస్తుతం సౌదీ అరేబియా హౌతీల దాడులతో అట్టుడుకుతుంది. నిన్న( బుధవారం) పౌర, ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులలో ఓ భారతీయుడు మరణించగా, మరో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. తాజాగా ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. పౌరులు సంచరించే ప్రాంతాలతో పాటు వాణిజ్య ప్రాంతాలలో దాడులు చేయడం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని ప్రకటన విడుదల చేసింది.
ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. "పౌరులు, కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదు. వాటిని వెంటనే నిలిపివేయాలి. సౌదీ అరేబియా సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ తన సంఘీభావం ఉంటుది. ఈ ప్రాంతంలో శాంతి నెలకొని, సాధారణ పరిస్థితులు తిరిగి రావాలి" అని ప్రకటన విడుదల చేసింది.
అదే విధంగా డ్రోన్ల దాడిలో మరణించిన భారతీయుడి కుటుంబానికి భారత విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని, బాధిత భారతీయులకు అవసరమైన అన్ని విధాలా సహాయం అందిస్తుందని పేర్కొంది. ఈ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా, బుధవారం రాత్రి దమ్మాం విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఇద్దరు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడినట్లు సౌదీ అరేబియా పౌర విమానయాన సంస్థ గురువారం వెల్లడించింది. ఈ దాడిలో మరణించిన వారిలో ఒక సౌదీ పౌరుడు, ఒక భారతీయుడు ఉన్నట్లు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. దాడి కారణంగా విమానాశ్రయానికి జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలు, పౌర మౌలిక సదుపాయాలపై హూతీ తిరుగుబాటుదారుల దాడులు ఇటీవలి వారాల్లో తీవ్రంగా పెరిగాయని నివేదిక పేర్కొంది. ఈ దాడులు గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకున్నాయని తెలిపింది. భద్రతా పరిస్థితులు దిగజారడంతో రియాద్ తన ప్రధాన విమానాశ్రయాన్ని మూసివేయాల్సి వచ్చిందని, అలాగే కీలకమైన పెట్టుబడిదారుల సదస్సును వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడించింది.
ఇదీ చదవండి: డ్రోన్ దాడిలో ఇద్దరు మృతి


