బెర్లిన్: ఒకవైపు దేశంలో తీవ్రస్థాయికి చేరిన నిరసనలు, మరోవైపు ప్రాణాంతక వైరస్ రూపంలో ఊహించని పరిణామాలు ఫ్రాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పదికిపైగా యూరోపియన్ దేశాల్లో పశువుల ఫారాలను వణికించిన షమోండా వైరస్ తాజాగా ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. ప్రపంచంలోనే మనుషుల్లో ఈ వైరస్ సోకి మరణం సంభవించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఫ్రాన్స్‌లో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోవడం, నిత్యావసరాల ధరలు చుక్కలనంటడం, పాఠశాలల్లో క్షీణిస్తున్న వసతులు, ప్రభుత్వ సేవలు సక్రమంగా అందకపోవడం వంటి సమస్యలపై విద్యార్థులు, కార్మిక సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. 2018 నాటి ఎల్లో వెస్ట్ ఉద్యమం స్ఫూర్తితో చేపట్టిన ఈ ఆందోళనలు తారాస్థాయికి చేరుకోవడంతో దేశంలోని పలు ప్రాంతాలు యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, నిత్యావసర సముదాయాలపై దాడులు జరగడంతో పాటు భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.
ప్రపంచంలోనే తొలి మానవ మరణం
ఈ అల్లర్లు, ఉద్రిక్తతల నడుమ ఆరోగ్య రంగంలో ఒక అసాధారణ ఘటన వెలుగు చూసింది. ఫ్రాన్స్‌లోని లియోన్ నగరానికి చెందిన హాస్పిసెస్ సివిల్స్ డి లియోన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి, ఈ నెల ప్రారంభంలో తీవ్రమైన అనారోగ్యం, రోగనిరోధక శక్తి లోపించడం వల్ల మరణించారు. అయితే ఆయన మరణానికి షమోండా వైరస్ కారణమని ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ తాజాగా అధికారికంగా ధృవీకరించింది. మరణానికి ముందు బాధితుడిలో కనిపించిన మెదడు సంబంధిత సమస్యలు ఈ వైరస్ వల్లనే తలెత్తినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈసీడీసీ అప్రమత్తం
ఇప్పటివరకు షమోండా వైరస్ మనుషుల్లోకి వ్యాపించేది కాదని, కేవలం జంతువులకు మాత్రమే పరిమితమని శాస్త్రవేత్తలు భావించారు. అయితే, అనూహ్యంగా ఓ మనిషి ప్రాణాలు కోల్పోవడంతో యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ఈసీడీసీ) అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తి తీరుపై ఫ్రెంచ్ అధికారులతో, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి ఉన్నతస్థాయి సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు, ఈ ఘటనపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వైరస్ కాదని, సాధారణ జనాభాకు ఎలాంటి ముప్పు లేదని రాయటర్స్ తన కథనంలో స్పష్టం చేసింది.
1960లలో షమోండా వైరస్ వ్యాప్తి
దోమల జాతికి చెందిన రక్తాన్ని పీల్చే క్యులికోయిడ్స్ అనే చిన్న కీటకాలు కుట్టడం వల్ల ఈ వైరస్ పశువులకు, జీవులకు సోకుతుంది. ఈ వైరస్‌ను మొట్టమొదటగా 1960లలో నైజీరియాలో పశువుల నుంచి వేరు చేశారు. నాటి నుంచి ఇది ఆఫ్రికా దేశాలతో పాటు జపాన్‌లో అప్పుడప్పుడు పశువుల్లో కనిపిస్తూ వచ్చింది. ఈ వేసవిలో ఫ్రాన్స్‌లోని పశువుల ఫారాలతో పాటు ఐరోపా అంతటా ఈ వైరస్ కలకలం రేపింది. ఫ్రాన్స్‌లో చిన్న నెమరువేసే జంతువులు, గుర్రాలలో దీని ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఆస్ట్రియా, బెల్జియం, ఐర్లాండ్, ఇటలీ, లీచెన్‌స్టైన్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్లోవేనియా, స్పెయిన్, యూకేలోని జెర్సీ తదితర 10కి పైగా దేశాల్లో పశువులలో ఈ వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. తాజాగా పశువుల నుంచి సోకే ఈ వైరస్ మనిషి ప్రాణాలు తీయడం వైద్య నిపుణులను సైతం విస్మయానికి గురిచేసింది.
ఇదీ చదవండి : సుందర్ పిచాయ్ ముందు ట్రంప్ పప్పులుడకవ్!


