కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవలు, అంత ర్జాతీయ డేటా నిల్వ అవసరాలు పెరు గుతున్న నేపథ్యంలో డేటా సెంటర్లు ఆధునిక ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మౌలిక సదుపాయాలుగా ఆవిర్భ విస్తు న్నాయి. అయితే వీటిని ప్రోత్సహించే ముందు కొన్ని ప్రాథమిక పర్యావరణహిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటయ్యే డేటా సెంటర్లు మన యువతకు ఎంత మేరకు ఉపాధిని కల్పిస్తాయి? వాటి నిర్వహణ కోసం ఎంత విద్యుత్తు, నీరు అవసరమవుతుంది? ఆ వనరుల వినియోగం వలన భవిష్యత్తులో ఏర్పడబోయే దుష్పరి ణామాలు ఏమైనా ఉన్నాయా? దీనిని కేవలం పారిశ్రామిక పెట్టుబడుల అంశంగా కాకుండా విద్యుత్ భవిష్యత్తు, తాగునీటి భద్రత, భూముల వినియోగం, ప్రభుత్వ రాయితీలు, ప్రజలకు లభించే ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉంది.
డేటా సెంటర్లను ఏకపక్షంగా వ్యతిరేకించడం కాకుండా వాటి వలన ఒనగూరే ఆర్థిక, ఉద్యోగ అవకాశాలను గుర్తిస్తూనే, మన సహజ వనరులపై పడే భారాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా వాటిని నియంత్రించడం అవసరం. డేటా సెంటర్ల ప్రత్యేకత ఏమిటంటే అవి మిగతా పరిశ్రమల మాదిరిగా కాకుండా నిరంతరాయంగా పనిచేస్తూ 24 గంటలూ విద్యుత్తును భారీ మొత్తంలో వినియోగించుకుంటాయి.
ఉదాహరణకు 100 మెగావాట్ల డేటా సెంటర్ రోజుకు 2.4 మిలియన్ యూనిట్ల కరెంటును వాడుకుంటుంది. ఏడాదికి 876 మిలియన్ యూనిట్లు అన్నమాట. 100 మెగావాట్ల ఐటీ లోడ్ మాత్రమే అయితే శీతలీకరణ, యంపీయన్, ఇతర సహాయక వ్యవస్థలతో కలిపి గ్రిడ్ నుండి తీసుకునే కరెంటు అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు. డేటా సెంటర్లకు విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడులను సంబంధిత డేటా సెంటర్ల ద్వారా పెట్టించినప్పుడే ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది.
డేటా సెంటర్లలో విద్యుత్నే కాకుండా భారీ ఎత్తున నీటిని కూడా వినియోగించుకుంటాయి. డేటా సెంటర్ల శీతలీకరణకు తాగునీటిని వినియోగించకుండా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించాలి. ఇందుకు అవసరమైన పైపులైన్లు, నీటిశుద్ధి కేంద్రాలు, నిల్వసదుపాయాల పెట్టు బడులను పరిశ్రమల నుంచి వసూలు చేసే విధంగా మార్గదర్శకాలు తయారు చేసుకోవాలి. డేటా సెంటర్లు భూగర్భ జలాలను వినియోగించడాన్ని అనుమతించరాదు. డేటా సెంటర్ల ఏర్పాటు వలన వేలాది మందికి శాశ్వత ఉద్యోగాలు వస్తాయన్న హామీ లేని వాస్తవ పరిస్థితుల్లో ప్రభుత్వ రాయితీలకు తగిన ప్రతిఫలం లభిస్తున్నదా అన్న కోణంలో ఆలోచన చేయాలి.
– తుల్జారాం సింగ్ ఠాకూర్, తెలంగాణ విద్యుత్శాఖ విశ్రాంత అధికారి
ఇదీ చదవండి: నీలేకని సలహాలో చిక్కులు


