నీలేకని సలహాలో చిక్కులు | Widespread discussion on Nandan Nilekanis recent suggestion | Sakshi
Sakshi News home page

నీలేకని సలహాలో చిక్కులు

Oct 16 2026 3:44 AM | Updated on Oct 16 2026 3:44 AM

Widespread discussion on Nandan Nilekanis recent suggestion

గత కొన్నేళ్లుగా విద్యార్థుల పాలిట పెను సమస్యగా మారిన ప్రశ్నపత్రాల లీక్‌ను అరికట్టడానికి ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని ఇటీవల చేసిన సూచనపై సహజంగానే విస్తృత చర్చ నడుస్తోంది. ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రశ్నపత్రం రూపొందిన మరుక్షణం అది ఆర్థిక లబ్ధి కలిగించేదిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. దాని బదులు డిజిటల్‌గా ప్రశ్నల నిధి రూపొందించి అవసరమైన సాంకేతికత ద్వారా ఆ నిధినుంచి పరీక్షకు కొన్ని గంటలముందు ప్రశ్నపత్రం రూపొందిస్తే లీక్‌ల సమస్య ఉండదన్నది ఆయన మాట. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకూ, అంతకుముందు దేశవ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమానికీ దారితీసిన నీట్, ఇతర పోటీ పరీక్షల తాలూకు ప్రశ్నపత్రాల లీక్‌లను అరికట్టేందుకూ, పరీక్షల సంస్కరణలకూ నీలేకని నేతృత్వాన మొన్న జూలైలో ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ ఇంకా నివేదిక సమర్పించాల్సివుంది. 

నీలేకని మాత్రమే కాదు... ఇటీవల కేంద్ర విద్యాశాఖకు అనుబంధంగా వుండే పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ఇలాంటి సూచనే చేసింది. ఒకే మాదిరి ప్రశ్నలు తరచు పునరావృతంచేసే విధానమైనా, నిపుణులతో ప్రశ్నపత్రాల రూపకల్పనైనా పరీక్షకుండే విశ్వసనీయతకు విఘాతం కలిగిస్తున్నదని అభిప్రాయపడింది. ఇందుకు బదులు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజñ న్సీ (ఎన్‌టీఏ) భారీస్థాయిలో, విస్తృతంగా ప్రశ్నల నిధిని ఏర్పాటుచేసుకుని, దాన్ని ఎప్పటికప్పుడు నవీకరించటం వంటి కసరత్తు చేయాలని సూచించింది. 

డిజిటల్‌ ఉపకరణాల సాయంతో ప్రశ్నల నిధినుంచి అప్పటికప్పుడు ప్రశ్నపత్రం రూపొందించి, నిపుణులు పరిశీలించాక పరీక్ష కేంద్రాల్లోని కంప్యూటర్లకు విడుదలచేస్తే సరిపోతుందని సంఘం సూచించింది. ఆ నిపుణుల్ని పరీక్ష సమయం పూర్తయ్యేవరకూ బయటికెళ్లకుండా చూస్తే సరిపోతుందని సలహా ఇచ్చింది. ప్రశ్నల నిధి ఏర్పాటుకు సాయంచేసినవారికి సైతం పరీక్షలో అవి వస్తాయో రావో తెలియవు గనుక లీక్‌ సమస్యే ఉండదని, ప్రశ్నపత్రాల రూపకల్పన, వాటి ముద్రణ, పరీక్ష కేంద్రాలకు పంపిణీ వంటి ప్రక్రియలో ఎక్కడో ఒకచోట లీక్‌లకు ఆస్కారం ఉంటుందన్నది దాని అభిప్రాయం. 

ఇదంతా వినడానికి బాగానే అనిపిస్తుంది. కాకపోతే బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ, నమ్మకంగా పనిచేసే వ్యక్తులు ఏ స్థాయిలోనూ లేరని నీలేకని అయినా, స్థాయీ సంఘమైనా నిర్ధారణకు రావటం మన అధికార యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోంది. అసలు ముద్రణకెళ్లినప్పటినుంచి దాని బాధ్యతలు చూసేవారిలో ‘ఎవరో’ ఈ స్కాంకు పాల్పడుతున్నారన్న అభిప్రాయం నిజం కాదు. కోట్లాది రూపాయల రాబడి తెచ్చే ఈ లీకుల వెనక మాఫియా ఉంది. వాటితో కోచింగ్‌ సంస్థల సంబంధాలు, దీనంతటికీ రాజకీయ నేతల అండదండలు రహస్యం కాదు. లేనట్టయితే నిందితులు సులభంగా కేసుల్నించి ఎలా తప్పించుకుంటున్నారు? ప్రభుత్వం అనే అతి పెద్ద వ్యవస్థ గుప్పెడు మాఫియా ముఠాలను అదుపు చేయలేని నిస్సహాయస్థితిలో ఉందంటే... అందుకోసం కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో అప్పటికప్పుడు ప్రశ్నపత్రాల రూపకల్పనే దిక్కని భావిస్తే అది మన పాలనావ్యవస్థ తీరుకు అద్దం పడుతుంది. 

మనకు దేశవ్యాప్తంగా లక్షన్నర పోటీ పరీక్ష కేంద్రాలున్నాయి. మహానగరాల్లో తప్ప ఎక్కడా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన ఇంటర్నెట్, విద్యుత్‌ సరఫరా సహా ఇతర ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని వర్తమాన స్థితిలో గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులు కంప్యూటర్‌ వాడకంలో నైపుణ్యం సాధించగలుగుతారా? అంతంతమాత్రం ఆదాయాలతో బతికే బడుగు వర్గాల కుటుంబాలనుంచి వచ్చే పిల్లలకు ఈనాటికీ కంప్యూటర్లు అందుబాటులో లేవు. ఇలాంటి స్థితిలో పోటీ పరీక్షనాడు కొత్తగా కంప్యూటర్‌తో కుస్తీపట్టడం వారికి సౌకర్యంగా అనిపిస్తుందా? విద్యతోసహా అన్నిచోట్లా తీవ్ర అసమానతలు వర్థిల్లేచోట మహానగరాల్లో సంపన్నుల పిల్లలు మాత్రమే ఈ పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. ఇలాంటి విధానం అమల్లోకి తీసుకురావాలంటే దేశవ్యాప్తంగా మెరుగైన బ్యాండ్‌విడ్త్‌తో అన్ని విద్యాసంస్థలకూ ఇంటర్నెట్, ప్రతి విద్యార్థికీ కంప్యూటర్‌ సౌకర్యం లభించేలా చూడటం ముఖ్యం. వారికి పటిష్టమైన శిక్షణ అవసరం. ఆ సంగతి కేంద్రం గుర్తించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement