మనం స్వాతంత్య్రం తెచ్చుకుని ఎనిమిది దశాబ్దాలు నిండుతున్నాయి; ‘భారత ప్రజల మైన మనము’, మనదైన స్వతంత్ర భారతాన్ని మనమే ఎలా తీర్చిదిద్దుకోవాలో నిర్దే శించుకుంటూ రాజ్యాంగాన్ని వెలువరించుకుని, మూడేళ్లు తక్కువగా అంతకాలమూ అయింది. అంటే, స్వాతంత్య్రమూ, స్వతంత్ర భారత రాజ్యాంగమూ కూడా శతజయంతికి శరవేగంతో చేరువవుతున్నాయి. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు, మొన్నరాజ్యాంగ దినోత్సవం రోజున కర్ణాటక ప్రభుత్వం చేసిన ఒక ప్రకటన సంతోషం
నింపుతూనే, కొన్ని ప్రశ్నలనూ రేపుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రాజ్యాంగమూ, దాని విలువలూ, ఆదర్శాల గురించిన పాఠాలను ప్రవేశపెట్టబోతున్నట్టూ, పాఠాల రూపకల్పనకొక కమిటీని ఏర్పాటుచేయ బోతున్నట్టూ ఆ ప్రకటన సారాంశం.
తాజావార్త కనుక దీనిని ఉదహరించుకున్నాం కానీ, మిగతా రాష్ట్రాల పరిస్థితీ ఏమంత భిన్నంగా లేదు. సామాజిక, రాజనీతి శాస్త్రాలలో భాగంగా రాజ్యాంగం గురించి వివిధ స్థాయిలలోని విద్యార్థులకు బోధించడం ముందునుంచీ ఉన్నా; ప్రత్యేకించి రాజ్యాంగం గురించే బోధించడం అనేక రాష్ట్రాలలో ఇటీవలే మొదలైనట్టు వివరాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, కేరళాన్నే తీసుకుంటే, రెండేళ్ల క్రితం, పాఠ్యప్రణాళికా సంస్కరణలలో భాగంగా, 1 నుంచి, 10వ తరగతి వరకూ పాఠ్యపుస్తకాలలో రాజ్యాంగ పీఠికను చేర్చాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సామాజిక శాస్త్రాల్లో భాగంగా రాజ్యాంగం గురించి బోధించడం ఉన్నా, ప్రత్యేకించి రాజ్యాంగం గురించి బోధించడమూ, రాజ్యాంగ స్ఫూర్తినీ, చైతన్యాన్ని విద్యార్థులలో పెంపొందించే ప్రయత్నమూ ఇటీవలి సంవత్సరాలలోనే మొదలవడం చూస్తున్నాం.
ఇలా విడివిడిగా రాష్ట్రాల మేరకు చూస్తే, ఇప్పటికైనా ఏదో జరుగుతోందిలే అనిపించవచ్చు కానీ, దేశం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాత్రం ఆ దృశ్యం నిరాశా పూరితంగానూ, మన తీరు గురించి మనకే ఎన్నో నిష్ఠుర సత్యాలను ‘బోధించే’దిగానూ కనిపిస్తుంది. ఉదాహరణకు, రాజ్యాంగమూ; అది ప్రతిపాదించే అన్ని రకాల సమాన త్వంతో కూడిన సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యపు విలువలూ యావద్దేశానికీ చెందినవి కనుక, రాజ్యాంగ విలువలను భావితరా లకు నూరిపోయడం, రాజ్యాంగ చైతన్యాన్నీ, స్ఫూర్తినీ వారిలో రంగరించడమనేవి జాతీయ స్థాయిలో అమలు చేయవలసిన విధానం కిందికి వస్తాయి.
కనుక ప్రత్యేకించి రాజ్యాంగ పాఠాలను పాఠ్యపుస్తకాలలో చేర్చే ప్రక్రియకు దిశానిర్దేశం చేయవలసిన బాధ్యత జాతీయ స్థాయి విధానాల కిందికే వస్తుంది. రాజ్యాంగం ప్రకారం విద్య కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి జాబితా కిందికి వస్తుంది కనుక, తమ పాఠశాలల్లో అమలు చేసే పాఠ్యప్రణాళికను రూపొందించుకునే అధికారం రాష్ట్రాలకే ఉంటుందన్న చట్టపరమైన, ఇంకా చెప్పాలంటే, సాంకేతికమైన కారణాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగం గురించిన అవగాహనను, స్ఫూర్తిని భావి భారత పౌరులకు అలవరచడంలో ఇన్నేళ్లలోనూ జాతీయ స్థాయి విధానకర్తలు దారుణంగా విఫలురయ్యారనే కచ్చితంగా అనిపించి తీరుతుంది.
ఎప్పుడో 1949లో, భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26వ తేదీని ‘రాజ్యాంగ దివస్’గా గుర్తించి ఏటా ఉత్సవం జరుపుకోవాలని (2015లో) అధికారికంగా నిర్ణయం తీసుకోడానికి కూడా ఏకంగా 66 సంవత్సరాలు పట్టిందంటే, పిల్లల సంగతలా ఉంచి, రాజ్యాంగ స్పృహా, చైతన్యమూ పెద్దలలో సైతం ఏ మేరకున్నాయో అర్థమవుతుంది.
పురాణ కాలానికి వెడితే, ప్రజాస్వామికం కాని ఆనాటి రాచరిక వ్యవస్థలోనూ రాముడు, కృష్ణుడు, ధర్మరాజు వంటి పౌరాణిక ప్రముఖులు కూడా ప్రజాపాలనకూ, సామాజిక నియతికీ, ఇతరేతర విలువలకూ సంబంధించిన వేద, శాస్త్రసంబంధమైన పాఠాలను గురువులవద్ద అభ్యసించినట్టు ఇతిహాస, పురాణాలే చెబుతున్నాయి. చరిత్ర కాలం నాటి రాజులు కూడా కౌటిల్యుని అర్థశాస్త్రం వంటివాటినీ, ఇతర రాజనీతి పాఠాలనూ గురుముఖతా అభ్యసించిన దృష్టాంతాలూ కనిపిస్తాయి. అటువంటిది, రాచరికానికి భిన్నంగా ప్రజలే రాజులైన ప్రజాస్వామ్యంలో ప్రజలకు రాజ్యాంగ పాఠాల బోధనలో ఇన్నేళ్ల అలసత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?! ఈ విషయంలో కనీసం ఇప్పటికైనా వేగం పుంజుకుంటుందని ఆశించవచ్చునా!?


