సరికొత్త ప్రమాదాలను తెచ్చి పెడుతున్న ఏఐ సాంకేతికత
వ్యక్తిగత, సామాజిక, డిజిటల్ భద్రతకు సవాల్
నిజమేదో, అబద్ధమేదో కనిపెట్టలేని డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియోలు
సైబర్ నేరాల్లో డీప్‌ఫేక్ వాటా 5–10 శాతం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చెలామణిలో 80 లక్షలకుపైగా ఫైళ్లు
రెండేళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 5 లక్షలు మాత్రమే
సాక్షి, హైదరాబాద్: సాంకేతికత మానవ జీవితాన్ని ఎంతగా సులభతరం చేస్తోందో అంతకంటే వేగంగా సరికొత్త ప్రమాదాలను తెచ్చిపెడుతోంది. వినోద సాధనంగా ప్రారంభమైన ఏఐ టెక్నాలజీ నేడు నేరగాళ్ల చేతుల్లో అస్త్రంగా మారింది. ఏఐతో సృష్టిస్తున్న డీప్‌ఫేక్ (అచ్చు అసలైన వాటి మాదిరిగానే ఉండే నకిలీ ఫొటోలు, వీడియోలు, ఆడియోలు) ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ భద్రతకు అతిపెద్ద సవాలుగా మారింది. సామాజిక విలువలను, వ్యక్తిగత భద్రతను దెబ్బతీస్తోంది. భారత్‌లో నమోదవుతున్న సైబర్ నేరాల్లో డీప్‌ఫేక్ వాటా 5–10 శాతం ఉండటం గమనార్హం.
సైబర్ భద్రతా నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 లక్షల డీప్‌ఫేక్ ఫైళ్లు చెలామణిలో ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 5 లక్షలు మాత్రమే. అంటే అతి తక్కువ కాలంలోనే ఈ నకిలీ సమాచారం 1,500 శాతం కంటే ఎక్కువ పెరగడం ఆందోళనకరం కాగా, దీని ఆధారంగా వ్యక్తిగత వేధింపులే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా రోజుకు కనీసం ఏడుకు పైగా భారీ స్థాయి ఆర్థిక మోసపూరిత దాడులు అధికారికంగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశం.
దక్షిణాదిలోనే ఎక్కువ..
దేశంలో మహిళలను లక్ష్యంగా చేసుకుని నమోదైన సైబర్ ఫిర్యాదుల సంఖ్య 50 వేల నుంచి రెండేళ్లలో 80 వేలకు పెరిగింది. ఇందులో అత్యధిక శాతం డీప్‌ఫేక్, మారి్ఫంగ్ వీడియోలకు సంబంధించినవే. సైబర్ వేధింపుల పరంగా దేశంలో బెంగళూరు 30 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ 14 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై (13 శాతం), చెన్నై, కోల్‌కతా (5 శాతం), ఢిల్లీ (3 శాతం) ఉన్నాయి.
ప్రముఖులు, మహిళలే బాధితులు
సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖ క్రీడాకారులు తమ ప్రతిష్ట, ముఖం, గొంతు పైనే ఆధారపడి జీవిస్తారు కాబట్టి ఈ సాంకేతికత నేరుగా వారి అస్తిత్వాన్నే దెబ్బతీస్తోంది. ప్రధాని మోదీ మొదలుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరకు పలువురి నకిలీ వీడియోలను సృష్టించి ఆర్థిక మోసాలకు, ఎన్నికల అవకతవకలకు నేరగాళ్లు ప్రయత్నించారు.
నటీనటుల ముఖాలను అశ్లీల వీడియోలకు తగిలించి సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తుండటంపై చిత్ర పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. ఇంటర్నెట్లోని మొత్తం డీప్‌ఫేక్ సమాచారంలో 96–98 శాతం ’సమ్మతి లేని అశ్లీల సమాచారమే’ ఉంది. ఈ అశ్లీల వీడియోలలో 99–100 శాతం మంది బాధితులు మహిళలే కావడం గమనార్హం. సెలబ్రిటీలే కాకుండా, సాధారణ కాలేజీ యువతులు, గృహిణుల ఫోటోలను కూడా మారి్ఫంగ్ చేస్తూ సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
⇒ డీప్‌ఫేక్ చూడగానే నమ్మదగినదిగా ఉంటుంది. డీప్‌ఫేక్ ఆధారిత ఆర్థిక మోసాలలో నేరగాళ్లు నమ్మకస్థులైన వ్యక్తుల్లా నటించడానికి ఏఐ ద్వారా సృష్టించిన లేదా మార్చిన ఆడియో, వీడియోలను ఉపయోగిస్తారు. మనం..మనకు బాగా తెలిసిన వ్యక్తే కదా అని నమ్మితే మోసపోతాం. అందువల్ల కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.
⇒ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్‌గా ఉంచండి. అధిక రిజల్యూషన్ ఉన్న వ్యక్తిగత ఫోటోలు, కుటుంబ వీడియోలు, గుర్తింపు పత్రాలు, సున్నిత రికార్డింగ్‌లను బహిరంగంగా పంచుకోవడం నివారించండి.
⇒ బంధువులు, సీనియర్ అధికారులు, సహోద్యోగులు వాయిస్ లేదా వీడియో కాల్ ద్వారా డబ్బు లేదా రహస్య సమాచారాన్ని అభ్యరి్థస్తే.. నేరుగా వారిని సంప్రదించండి. కేవలం పరిచయమున్న వ్యక్తి వాయిస్ లేదా నమ్మశక్యమైన వీడియో కాల్‌పై మాత్రమే ఆధారపడకూడదు.
⇒ ఆన్లైన్ ఖాతాలకు బలమైన, ప్రత్యేక పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. మల్టీ–ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఎనేబుల్ చేయాలి. పరికరాలను అప్డేట్గా ఉంచాలి. ఓటీపీలు, పిన్ నంబర్స్, పాస్వర్డ్లు లేదా బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
⇒ అనుమానాస్పద కాల్స్‌పై పోలీసులను లేదా సైబర్ క్రైమ్ అధికారులను సంప్రదించాలి. ఆర్థిక సైబర్ మోసం కేసులలో వెంటనే 1930కి కాల్ చేయాలి. లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
గుర్తించడం అసాధ్యం..
డీప్‌ఫేక్ అని గుర్తించడం అవగాహన లేనివారికి సామాన్యులకు చాలా కష్టం. పరిశోధనల ప్రకారం కేవలం 0.1 శాతం మంది మాత్రమే డీప్‌ఫేక్ కంటెంట్‌ను గుర్తించగలుగుతున్నారు. అయితే డీప్‌ఫేక్‌ను అడ్డుకోవడానికి సాంకేతిక సంస్థలు కొన్ని అధునాతన సాధనాలను అందుబాటులోకి తేవడం కొంత ఊరటనిచ్చే అంశం. వీడియోలలోని ముఖ పిక్సెల్స్‌లో వ్యత్యాసాలను పసిగట్టే అంతర్జాతీయ సాఫ్ట్వేర్లతో పాటు, భారతదేశంలో సైబర్ దాడులను అడ్డుకోవడానికి నిపుణులు ’పై–అథెంటిఫై’, ’నమోకవచ్’ అనే స్వదేశీ గుర్తింపు వ్యవస్థలను రంగంలోకి దించారు. గూగుల్, మెటా వంటి ప్రముఖ సంస్థలు కృత్రిమ మేధస్సు ద్వారా తయారైన ప్రతి వీడియోపై కనిపించే, కనిపించని డిజిటల్ గుర్తులను (వాటర్ మార్కులు), బ్లాక్‌చైన్ సాంకేతికతను తప్పనిసరి చేస్తున్నాయి.
వ్యవస్థకు సవాళ్లు..
వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులతో సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పదేపదే షేర్ అవుతున్న కంటెంట్‌ను గుర్తించడం, ట్రాక్ చేయడం ఆషామాషీ కాదు. ఒకే కంటెంట్‌ను వేర్వేరు శీర్షికలు, క్యాప్షన్లు, ఖాతాలు, యూఆర్ఎల్స్ను ఉపయోగించి మళ్లీ పోస్ట్ చేయవచ్చు. దీనివల్ల అసలు మూలాన్ని కనుగొనడం, ఆ తర్వాత జరిగిన వ్యాప్తిని ట్రాక్ చేయడం కష్టమవుతోంది. ప్రైవేట్ గ్రూపులు, క్లోజ్డ్ మెసేజింగ్ ఛానెళ్ల ద్వారా కంటెంట్ వేగంగా వ్యాపించడం వల్ల ఆధారాల సేకరణ, నేరస్థులను గుర్తించడం మరింత క్లిష్టంగా మారుతోంది.
క్రాస్ చెక్ చేసుకోవడం కీలకం
ఇలాంటి వీడియోలు, ఆడియోల విషయంలో నమ్మదగిన, విశ్వసనీయమైన సోర్స్‌ల ద్వారా అంశాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ గోప్యత, వ్యక్తిగత, సున్నిత, అ«దీకృత సమాచారాన్ని పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌లో అప్లోడ్ చేయకూడదు. ఎదుటి వాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క ఏఐ అప్లికేషన్‌కు ప్రైవసీ పాలసీ ఉంటుంది. దానిలోని టరమ్స్ అండ్ కండిషన్స్‌ను పూర్తిగా చదవాలి. దీన్ని ఓ సహాయకారిగా వాడుకోవాలి తప్ప దాని పైనే ఆధారపడద్దు. సహచరులు, మిత్రులు, ప్రముఖుల్ని ఇమిటేట్ చేస్తూ మోసగాళ్లు డబ్బు, సమాచారం తదితరాలు కోరే ప్రమాదం ఉంది. ప్రతి చర్యకు ముందు మల్టీ ఫ్యాక్టర్ అథంటికేషన్ చేసుకోవాలి. –ఆర్జీ శివమారుతి, ఏసీపీ, హైదరాబాద్ సైబర్ ఠాణా
ప్రత్యేక చట్టం అవసరం..
డీప్‌ఫేక్‌లకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చి, ఉల్లంఘనల తీవ్రతను బట్టి వివిధ స్థాయిల్లో నేరాలను నిర్ధారించే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. లైంగిక స్వభావంగల డీప్‌ఫేక్‌లను రూపొందించడం, ప్రచారం చేయడం, మోసం, ఎన్నికల ప్రక్రియను తారుమారు చేయడం వంటి నేరాలకు విడివిడిగా శిక్షలను నిర్దేశించాలి. వ్యక్తు స్వరం, ముఖచిత్రం, రూపురేఖలు వంటి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అంశాలపై చట్టబద్ధ హక్కులను గుర్తించాలి. డీప్‌ఫేక్ బాధితులకు తగిన పరిహారం పొందే హక్కు కల్పించాలి. సమగ్ర ఫిర్యాదు పోర్టల్ ఏర్పాటు చేయాలి.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది.


