కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల కింద యాసంగిలో ప్రకటించే అవకాశం
తీవ్ర వర్షాభావంతో ప్రధాన ప్రాజెక్టుల్లో వేగంగా తగ్గుతున్న నీటి నిల్వలు
ఎగువ నుంచి చుక్క నీరు కూడా రాని వైనం
వేసవికి ముందే రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు
ఉన్న నిల్వలు తాగునీటి అవసరాలకు సంరక్షించాలని నిర్ణయం
64,88,981 ఎకరాల స్థిరీకృత ఆయకట్టుకు నీటిని సరఫరా చేయలేని పరిస్థితి
రైతులు వరి సాగుకు విరామం ఇవ్వాలని ఇప్పటికే చెప్పిన సీఎం రేవంత్
క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదని స్పష్టం చేస్తున్న నీటిపారుదల శాఖ వర్గాలు
త్వరలో స్కివం కమిటీ సమావేశమై సర్కారుకు సిఫారసు చేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: వర్షాలు లేక కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నిల్వలు వేగంగా అడుగంటిపోతున్నాయి. వేసవి రాకముందే తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి. జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను వేసవి ముగిసే వరకు తాగునీటి అవసరాలకు సంరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా, చిన్న సాగునీటి ప్రాజెక్టుల కింద ఉన్న 64,88,981 ఎకరాల స్థిరీకృత ఆయకట్టుకు వచ్చే యాసంగి సీజన్లో సాగు నీటిని సరఫరా చేసే అవకాశం కన్సించడం లేదు. యాసంగిలో ఈ మేరకు క్రాప్‌హాలిడే ప్రకటించక తప్పదని రాష్ట్ర నీటిపారుదల శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రబీలో వరి, ఇతర నీటి ఆధారిత పంటలకు విరామం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే రాష్ట్ర రైతాంగానికి సూచించడం గమనార్హం.
గత ఏడాదితో పోలిస్తే అతితక్కువ నిల్వలు
కృష్ణా, గోదావరి నదులపై కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణలో ఉన్న 15 ప్రధాన జలాశయాలు మొత్తం 740.98 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగి ఉండగా, ఆదివారం ఉదయం 6 గంటల నాటికి 380.88 టీఎంసీలే ఉన్నాయి. గతేడాది సరిగ్గా ఇదే సమయానికి ఈ 15 ప్రాజెక్టుల్లో 722.24 టీఎంసీల నిల్వలుండగా, ఎగువ నుంచి భారీ వరదలు కొనసాగాయి. దీంతో గతేడాది రెండు పంటలకూ సమృద్ధిగా సాగునీరు సరఫరా చేశారు. ఇక రాష్ట్రం పరిధిలోని వివిధ జలాశయాల్లో గతేడాది ఇదే సమయానికి 460 టీఎంసీల నీళ్లు ఉండగా, ప్రస్తుతం సగం కంటే కూడా తక్కువగా 200 టీఎంసీలే ఉన్నాయి. గత నెల రోజులుగా ఎగువ నుంచి చుక్క వరద రావడం లేదు.
త్వరలో స్కివం కమిటీ సమావేశం!
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కింద గతేడాది (2025) వానాకాలంలో 37,32,878 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయగా, వాతావరణ అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది (2026–27) వానాకాలంలో 7,01,063 ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు సరఫరా చేయగలని గత జూలైలోనే రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశమై నిర్ణయం తీసుకుంది.
ఇందులో గోదావరి పరీవాహకంలోని 21 ప్రాజెక్టుల కింద 6,05,955 ఎకరాలు, కృష్ణా పరీవాహకంలోని 7 ప్రాజెక్టుల కింద 95,108 ఎకరాలున్నాయి. అయితే రైతులు మరింత ఎక్కువ సంఖ్యలోనే పంటలు వేశారు. అయితే వర్షాలు లేకపోవడంతో వానాకాలంలో వేసిన పంటల్లో దాదాపుగా 10 లక్షల ఎకరాలు నీళ్లు లేక ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. దీంతో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. కాగా త్వరలో స్కివం కమిటీ సమావేశమై ప్రస్తుత పరిస్థితిలో వచ్చే యాసంగిలో పూర్తిగా క్రాప్‌హాలిడే ప్రకటించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎగువ నుంచి వరద బంద్..
తీవ్ర వర్షాభావంతో రాష్ట్రంలో కృష్ణా పరీవాహకంలో ఉన్న ప్రాజెక్టులకు గత నెల రోజులుగా చుక్క నీరు కూడా రావడం లేదు. గోదావరి ప్రధాన పాయపై సింగూరు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఉన్న ప్రాజెక్టులూ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఎల్లంపల్లి దిగువన ఉన్న మేడిగడ్డ బరాజ్‌కు ప్రాణహిత నది నుంచి కొంత వరద వస్తున్నా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎత్తిపోసేందుకు అవకాశం లేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు మరమ్మతులు అనివార్యం కావడంతో వాటిలో గత మూడేళ్లుగా నీళ్లను నిల్వ చేయడం లేదు.
ప్రధాన జలాశయాల పరిస్థితి చూస్తే.. శ్రీశైలంజలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలుండగా, ప్రస్తుతం 60 టీఎంసీలకు నిల్వలు పడిపోయాయి. నాగార్జునసాగర్ జలాశయం నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 188.54 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. జూరాలలో 9.66 టీఎంసీలకు 7.39 టీఎంసీలు ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి ఈ మూడు జలాశయాలకు ఏమాత్రం వరద రావడం లేదు.
గోదావరి పరీవాహకంలోని నిజాంసాగర్‌లో 17.80 టీఎంసీలకుగాను 10.31 టీఎంసీలు, శ్రీరామ్‌సాగర్‌లో 80.5 టీఎంసీలకు గాను 38.67 టీఎంసీలు, మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో 27.55 టీఎంసీలకు గాను 23.37 టీఎంసీలు, దిగువ మానేరులో 24.03 టీఎంసీలకు గాను 15.42 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 20.18 టీఎంసీలకు గాను 18 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఉండనున్న తాగునీటి అవసరాల కోసం ఈ జలాశయాల్లోని నిల్వలను సంరక్షించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వీటి కింద ఉన్న 64 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకృత ఆయకట్టుకు వచ్చే యాసంగిలో సాగునీటి సరఫరా చేసే పరిస్థితి లేకుండా పోయింది.
కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల నిల్వ సామర్థ్యం, ప్రస్తుత నిల్వలు, గతేడాది ఇదే సమయానికి ఉన్న నిల్వలను (టీఎంసీల్లో) ఈ కింది పట్టికలో చూడవచ్చు.


