కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష | Kolkata durga puja stampede live updates | Sakshi
Sakshi News home page

కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష

Oct 18 2026 1:26 PM | Updated on Oct 18 2026 1:28 PM

Kolkata durga puja stampede live updates

కోల్‌కతా: కోల్‌కతాలోని చోర్‌బాగన్ దుర్గాపూజా మండపం వద్ద జరిగిన తొక్కిసలాటలో 19 మంది మరణించగా, 25 మంది గాయపడిన ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి భవానీ భవన్‌లో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , హోం కార్యదర్శి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌తో పాటు వివిధ శాఖల ప్రతినిధులు హాజరయ్యారు. అంతకుముందు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కలకత్తా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి చేరుకున్నారు.

ఈ తొక్కిసలాటకు సంబంధించి చోర్‌బాగన్ దుర్గాపూజ కమిటీ నిర్వాహకులతో సహా ఏడుగురిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. గిరీష్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్లు 105, 110, 3(5) కింద సుమోటో కేసు నమోదైంది. విచారణ కోసం తొలుత 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.
సంఘటనా స్థలంలో ఉన్న ఏసీపీ ప్రాథమిక సమాచారం ప్రకారం, ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసిన అనౌన్స్‌మెంట్, ఈలలు వేయడం వల్లే ఈ తొక్కిసలాట మొదలైందని ముఖ్యమంత్రి అధికారి మీడియాకు తెలిపారు. పూజా కమిటీ సభ్యులు, భద్రతా ఏజెన్సీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఘటన తర్వాత పోలీసులు చోర్‌బాగన్ పండాల్‌లోకి సందర్శకుల ప్రవేశాన్ని నిలిపివేశారు. శాంతిభద్రతల దృష్ట్యా అక్టోబర్ 18 నుంచి 20 వరకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. ముందుజాగ్రత్త చర్యగా సురుచి సంఘ, చేత్లా అగ్రణి, తాలా ప్రత్యయ్ వంటి ప్రముఖ పూజా పండాల్‌లను కూడా  మూసివేశారు.

‘అధికారుల నిర్లక్ష్యమే కారణం’
ఈ ఘటనలో మరణించిన 26 ఏళ్ల నర్స్ శ్రీపర్ణ పొద్దార్ కుటుంబ సభ్యులు అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. మెరుగైన ఏర్పాట్లు చేసి ఉంటే ఈ ఘోరాన్ని నివారించవచ్చని మృతురాలి సోదరి రీపా దాస్ అన్నారు. కాగా ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, అలాగే గాయపడిన వారికి రూ. 5 లక్షల సాయం ప్రకటించింది. మరోవైపు శనివారం సాయంత్రం చోర్‌బాగన్ మండపం వద్ద మృతి చెందిన 19 మంది పేర్లు, వయస్సు, చిరునామాలతో కూడిన పూర్తి జాబితాను పోలీసులు అధికారికంగా విడుదల చేశారు.కాగా కోల్‌కతా ఘటన దరిమిలా ఉత్తరప్రదేశ్ అంతటా ఉన్న పూజా మండపాల్లో ఫైర్ సేఫ్టీ, ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు, ఎమర్జెన్సీ దారులు, విద్యుత్ వ్యవస్థలపై క్షేత్రస్థాయి పరిశీలనలు జరపాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement