ప్రతి ఒక్కరికీ తమకు అవసరమైన మెగ్నీషియమ్ ఆహారంతోనే దొరుకుతుందనేది చాలావరకు వాస్తవం. అందుకే మెగ్నీషియమ్ సప్లిమెంట్ల కంటే స్వాభావికంగానే మెగ్నీషియమ్ అందేలా చూడటం ముఖ్యం.
సప్లిమెంట్ల ద్వారా తీసుకునే మెగ్నీషియం విషయంలో రోజుకు 350 మిల్లీగ్రాముల పరిమితిని మించకూడదన్నది నిపుణుల సూచన. అయితే, ఇది ఆహారం ద్వారా లభించే మెగ్నీషియానికి వర్తించే పరిమితి కాదు. ఎందుకంటే ఆహార పదార్థాల నుంచి స్వాభావికంగా దొరికే మెగ్నీషియానికి పరిమితి విధించడం సాధ్యం కాదు. అది వ్యక్తి వయసు, ఆరోగ్య పరిస్థితులను బట్టి అవసరాలు మారవచ్చు.
వేర్వేరు మెగ్నీషియం కాంపౌండ్లు
వేర్వేరు కార్యకలాపాలకు ఎలా ఉపయోగపడతాయంటే... మెగ్నీషియం వివిధ పదార్థాలతో కలిపి అనేక రకాల కాంపౌడ్ల రూపాల్లో దొరుకుతుంది. వాటిని వేర్వేరు అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు...
మెగ్నీషియం గ్లైసినేట్ : నిద్ర, శారీరకంగా కోలుకోవడం కోసం, కండరాలు పట్టేయడం వంటి సమస్యల కోసం.
మెగ్నీషియం సిట్రేట్ : మలబద్ధకం తగ్గించేందుకు; క్రీడాకారులు తమ శరీరంలో ఎలక్ట్రోలైట్లను త్వరగా భర్తీ చేసుకోవడానికి. (అయితే, మోతాదు ఎక్కువైతే జీర్ణ సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది).
మెగ్నీషియం మాలేట్ : కొందరు క్రీడాకారుల దేహాల్లో శక్తి త్వరగా భర్తీ అవ్వడం కోసం.
మెగ్నీషియం థ్రియోనేట్ : తలనొప్పి వంటి సమస్యల కోసం.
మెగ్నీషియం ఆక్సైడ్ : మలబద్ధకం తగ్గించేందుకు,
(ఎక్కువ మోతాదులో తీసుకుంటే విరేచనాలు, కడుపు కండరాలు బిగుసుకోవడం / పట్టేయడం (క్రాంప్స్) దేహంలో నీరు తగ్గడం (డీ హైడ్రేషన్) కోసం.
మెగ్నీషియం నిజంగా ఎంత అవసరం?
మెగ్నీషియం జీవానికి అవసరమైన పోషకమని 1923లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే ప్రచార ఆర్భాటం చూస్తే మెగ్నీషియం సప్లిమెంట్లు అందరికీ తప్పనిసరేమో అన్న భావన కలుగుతోంది.
నిజంగా మన శరీరానికి సప్లిమెంట్ల రూపంలో ఎంత మెగ్నీషియం అవసరమంటే... చాలామందికి దీన్ని అదనంగా సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాల్సిన అవసరమే లేదనేది చాలామంది నిపుణుల భావన. సహజంగా ఆహారం నుంచే తగినంత మెగ్నీషియం దొరుకుతుందనీ, సాధారణంగా చాలామందికి అది సరిపోతుందని వారు పేర్కొంటున్నారు.
ఎవరికి సప్లిమెంట్లు అవసరమంటే...
కొన్ని వ్యాధులు, ఆరోగ్య సమస్యలు లేదా మందుల వల్ల మెగ్నీషియం శరీరానికి సరిగా అందక΄ోవచ్చు. లేదా దేహం నుంచి ఎక్కువగా బయటకు వెళ్లిపోతుండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మెగ్నీషియమ్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. వారికి సప్లిమెంట్లు అవసరం కావచ్చు. అదీ కూడా డాక్టర్లు నిర్ణయించడమే మంచిది.
గతంతో పోలిస్తే ఇప్పుడు ఆహారంతో అంత మెగ్నీషియమ్ అందడం లేదా?
అయితే, గతంతో పోలిస్తే ఆహార పదార్థాల్లో ఖనిజాల పరిమాణం తగ్గిందనే వాదన కూడా ఉంది. 2022లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ న్యూట్రిషన్ అనే జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం... బ్రిటన్లో 1940, 1991, 2019 సంవత్సరాల్లో లభించిన పండ్లు, కూరగాయల్లోని ఖనిజాలను పోల్చింది.
1991 నుంచి 2019 మధ్య వాటిలో మెగ్నీషియం లభ్యత 10 శాతం తగ్గినట్లు గుర్తించింది. అయినప్పటికీ, ఆహారంలో ఖనిజాల పరిమాణం తగ్గిందనే కారణంతో అందరూ సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం ఇప్పటికీ లేదనేది పలువురు నిపుణుల అభిప్రాయం.
శరీరంలోని మెగ్నీషియంలో కేవలం ఒక శాతం మాత్రమే రక్తంలో ఉంటుంది. మిగతాది ఎముకలు, ఇతర శరీర కణజాలాల్లో నిల్వ ఉంటుంది. అందువల్ల సాధారణ రక్త పరీక్ష ఆధారంగా మాత్రమే శరీరంలో మెగ్నీషియం లోపం ఉందో లేదో నిర్ధారణ చేయడం కష్టమనేది పలువురు వైద్య నిపుణుల భావన.
సొంతంగా సప్లిమెంట్లు వాడితే సమస్యలే!
ఒకరికి ఉపయోగపడిన సప్లిమెంట్ మరొకరికి కూడా అంతే ఉపయోగపడుతుందని చెప్పలేమనేది నిపుణుల మాట. ఇలా అవసరం లేక΄ోయినప్పటికీ ఆ సప్లిమెంట్లు వాడటం వల్ల దీర్ఘకాలంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కండరాలు పట్టేయడం, నిద్ర సరిగా లేకపోవడం, ఎముకలు నొప్పిగా ఉండటం, మల విసర్జనలో క్రమం తప్పడం, కళ్లు అదరడం (ఐ ట్విచ్చింగ్), ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్), విరేచనాలు వంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులు మెగ్నీషియం లోపం ఉందేమోనని పరీక్షిస్తారు. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన అందుకు మెగ్నీషియం లోపమే కారణమని భావించకూడదు.
మెగ్నీషియం కంటే అది దేనితో కలిసి ఉందనేదే ముఖ్యం!
మెగ్నీషియం సప్లిమెంట్ కంటే ఆది ఏ పదార్థంతో కలిపి ఉందన్నది కూడా ముఖ్యమనేది నిపుణులు చెబుతున్నమాట. ఉదాహరణకు, నిద్ర మెరుగుపడేందుకు మెగ్నీషియం గ్లైసినేట్ను సిఫారసు చేస్తుంటారు. అయితే, ఇందులో నిద్రకు తోడ్పడే ప్రభావం మెగ్నీషియం వల్లే కాకుండా, దానితో కలిపిన గ్లైసిన్ అనే అమైనో యాసిడ్ వల్ల కూడా అయి ఉండవచ్చనేది వారి భావన. గ్లైసిన్ దేహ ఉష్ణోగ్రతను తగ్గించి, ప్రశాంతతకు తోడ్పడుతుంది.
మెగ్నీషియం గ్లైసినేట్ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు ఈ రెండు పదార్థాలూ శరీరంలోకి చేరుతాయి. అందువల్ల, మెగ్నీషియం సప్లిమెంట్లను అందరూ నిద్ర కోసం లేదా ఇతర సమస్యల కోసం సొంతంగా వాడటం కంటే, ఆహారం ద్వారా తగినంత మెగ్నీషియం ΄పొందుతున్నారో లేదో తెలుసుకోవడం, అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం మేలు.
చివరగా... పై కారణాల రీత్యా... సోషల్ మీడియా మాయలో పడి ఎవరికివారు మెగ్నీషియమ్ సప్లిమెంట్లు వాడటం కంటే.. వాటిని నేచురల్ ఆహారపదార్థాల ద్వారా దేహానికి అందేలా చూడటం ముఖ్యం. నిజంగా ఎవరిలోనైనా మెగ్నీషియమ్ తగ్గినట్లు డాక్టర్లకు అనిపిస్తే... అప్పుడు లక్షణాలను బట్టి డాక్టర్లు ఆ వ్యక్తికి నిర్దిష్టంగా మెగ్నీషియమ్ తాలూకు ఏ పదార్థం / లవణం (మెగ్నీషియమ్ కాంపౌండ్) అవసరమో దాన్నే సూచిస్తారు.
మెగ్నీషియం అనేది జీవక్రియల్లో చాలా కీలకమైన ఖనిజం. శరీరంలో శక్తి ఉత్పత్తి, కండరాలు, నరాల పనితీరు, రక్తపోటు నియంత్రణ, గుండె, ఎముకల ఆరోగ్యం వంటి 300కు పైగా జీవరసాయన ప్రక్రియల్లో ఈ ఖనిజం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం నిద్ర బాగా పట్టేందుకు కూడా చాలామంది మెగ్నీషియం సప్లిమెంట్లు వాడుతున్నారు.
వీటిలో మెగ్నీషియం గ్లైసినేట్ బాగా ప్రాచుర్యం పొందింది. అయితే, చాలామందికి ఆహారం ద్వారానే తగినంత మెగ్నీషియం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఖనిజం ఎంత కీలకమైనదో తెలుసుకోవడంతో పాటు... నేటి సోషల్ మీడియా ప్రచారాల్లో పడి ఆ ఖనిజాన్ని మాటిమాటికీ వాడాల్సిన అవసరం లేదనీ, ఒకవేళ నిజంగానే అవసరమైతే... వారికి వైద్య నిపుణులు సూచిస్తారనే అంశాన్ని తెలియజెప్పే కథనమిది...
డాక్టర్ శివరాజు, సీనియర్ ఫిజీషియన్
ఇదీ చదవండి: దోసె ఇలా దొరికితే..శాండ్విచ్ ఎవరికి కావాలి? ఐడియా అదుర్స్


