అక్కడ 75 రోజుల పాటు దసరా వేడుకలు..! విచిత్రంగా విజయదశమి రోజు నుంచే.. | Devotion: Different Dussehra Traditions From Across India That Sound Like | Sakshi
Sakshi News home page

అక్కడ 75 రోజుల పాటు దసరా వేడుకలు..! విచిత్రంగా విజయదశమి రోజు నుంచే..

Oct 18 2026 9:25 AM | Updated on Oct 18 2026 9:25 AM

Devotion: Different Dussehra Traditions From Across India That Sound Like

కొన్ని శక్తిపీఠాల్లో దసరా నవరాత్రుల సందర్భంగా అరుదైన ఆచారాలను పాటిస్తారు. దసరా సందర్భంగా వివిధ ప్రాంతాల్లో కొన్ని విలక్షణమైన ఆచారాలను పాటిస్తారు. అలాంటి కొన్ని అరుదైన దసరా ఆచారాలు...

అన్ని ప్రాంతాల్లోనూ దసరా వేడుకలను పదిరోజులు జరుపుకొంటారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో మాత్రం దసరా వేడుకలను ఏకంగా డెబ్బయి ఐదు రోజుల పాటు జరుపుకొంటారు. ‘బస్తర్‌ దసరా’ అత్యంత సుదీర్ఘ దసరా వేడుకగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆచారం పదిహేనో శతాబ్ది తొలినాళ్ల నుంచి ఇక్కడ కొనసాగుతోంది. కాకతీయ వంశానికి చెందిన పురుషోత్తమ దేవుడి కాలంలో 1408 నుంచి ఇక్కడ డెబ్బయి ఐదు రోజుల దసరా వేడుకలు మొదలయ్యాయని చెబుతారు. 

ఈ రోజుల్లో ఇక్కడ ఉన్న దంతేశ్వరీ ఆలయం వద్దకు చుట్టుపక్కల ఉన్న గ్రామదేవతలను ఊరేగింపుగా తీసుకువస్తారు. ఈ సందర్భంగా స్థానిక రాజవంశీకులతో గిరిజన నాయకులు, స్థానిక ప్రజలు సమావేశమవుతారు. ఈ సమావేశాన్ని ‘మురియా దర్బార్‌’ అంటారు. నవరాత్రుల చివరి రోజుల్లో భారీ కలపతో తయారుచేసిన రథాన్ని అడవిలో ఊరేగించడం ఇక్కడి ప్రత్యేకత. తమిళనాడు కులశేఖరపట్నంలో ఉన్న ముత్తారమ్మ ఆలయంలో దసరా నవరాత్రులలో ప్రత్యేక పూజలు జరపడమే కాకుండా, భక్తులు రకరకాల వేషాలు ధరిస్తారు. 

వేషాలతో వీథుల్లో సంచరిస్తూ భిక్షాటన చేసి, వచ్చిన డబ్బును అమ్మవారికి సమర్పిస్తారు. ఒడిశాలోని పూరీలో దసరా నవరాత్రుల సందర్భంగా ‘గొసాని’ జాతర జరుపుతారు. ఈ జాతరలో భాగంగా వీథుల్లో మహిషాసురమర్దని రూపంలో అమ్మవారి భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ముగింపు రోజున ఈ విగ్రహాలను జగన్నాథ ఆలయ సింహద్వారం వద్దకు తీసుకువచ్చి, పూజలు జరిపిన తర్వాత సముద్రంలో నిమజ్జనం చేస్తారు. కోల్‌కతాలో నవరాత్రి వేడుకలు ముగిశాక అమ్మవారి విగ్రహాలను నిమజ్జనానికి తరలించే ఊరేగింపులో మహిళలు ‘సిందూర్‌ ఖెళా’ ఆడతారు. 

ఈ వేడుక హోలీ పండుగను తలపిస్తుంది. ఊరేగింపులో పాల్గొనే మహిళలు ఒకరికొకరు ముఖాలకు సిందూరం పూసుకుంటారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులులో దసరా వేడుకలు విభిన్నంగా జరుగుతాయి. మిగిలిన ప్రాంతాల్లో దసరా వేడుకలు విజయదశమితో ముగుస్తాయి. ఇక్కడ మాత్రం విజయదశమి రోజు నుంచే అసలు వేడుకలు మొదలవుతాయి. ఈ వేడుకలు ‘కులు దసరా’గా పేరు పొందాయి. కులు ప్రజలు ‘రఘునాథ్‌ జీ’గా శ్రీరాముడిని ప్రధానదైవంగా ఆరాధిస్తారు. 

దసరా రోజు నుంచి వారం రోజుల పాటు స్థానిక దేవతలను కులుమైదానంలో కొలువుదీర్చిన రఘునాథ్‌జీ వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి జాతర జరుపుతారు. భారత ఉపఖండ ప్రాంతంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా దసరా వేడుకలను హిందువులు ఘనంగా జరుపుకొంటారు. ఒక్కో ప్రాంతంలో వేడుకలు ఒక్కో తీరులో జరుగుతాయి. ఒక్కో ఆలయంలో ఒక్కోరకమైన వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కో శక్తిపీఠంలో ఒక్కో రకమైన విలక్షణ ఆచారాలను పాటిస్తారు. ఆచార భేదాలు ఎన్ని ఉన్నా, అందరూ జగన్మాతను శక్తి స్వరూపంగానే ఆరాధిస్తారు. దసరావేడుకల్లో సర్వం శక్తిమయంగా కనిపిస్తుంది.

ఇదీ చదవండి: అలా మొదలైంది..!∙ 1757... ఓ కార్నివాల్‌..
   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement