ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌కి చెక్‌ పెట్టొచ్చు..! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు.. | Health Tips: Pancreatic Cancer: Symptoms Causes And Treatment | Sakshi
Sakshi News home page

Pancreatic Cancer: ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌కి చెక్‌ పెట్టొచ్చు..! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు..

Oct 18 2026 12:30 PM | Updated on Oct 18 2026 12:52 PM

Health Tips: Pancreatic Cancer: Symptoms Causes And Treatment

క్యాన్సర్‌ కణాల చుట్టూ ఏర్పడే రక్షణ కవచాన్ని బలహీనపరిచి, చికిత్స మరింత సమర్థంగా పనిచేసేలా చేసే అవకాశాన్ని ఒక సరికొత్త క్లినికల్‌ ట్రయల్‌ చూపించింది. ప్యాంక్రియాస్‌ (క్లోమం) క్యాన్సర్‌కు చికిత్స చేయడం చాలా కష్టం. దీనికి ఒక ముఖ్యమైన కారణం.. క్యాన్సర్‌ కణాల చుట్టూ కనెక్టివ్‌ టిష్యూ దట్టంగా ఏర్పడటం! ఇది క్యాన్సర్‌ కణానికి  రక్షణ కవచంలా పనిచేస్తూ... ఒక పట్టాన చికిత్సకు లొంగదు. 

అందుకే ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌కు చికిత్స చాలా కష్టంగా మారుతుంది. ఈ కవచంలో ఫైబ్రోబ్లాస్ట్‌లు అనే కణాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి ఏర్పరచే కణజాలం వల్ల కీమోథెరపీ మందులు క్యాన్సర్‌ కణాల దగ్గరకు చేరడం కష్టమవుతుంది. అంతేకాదు, క్యాన్సర్‌తో పోరాడే శరీర వ్యాధినిరోధక వ్యవస్థ పనితీరు కూడా అణచివేతకు గురవుతుంది. 

ఈ సమస్యను అధిగమించేందుకు అమెరికాలోని డానా–ఫార్బర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నేతృత్వంలో ఒక క్లినికల్‌ ట్రయల్‌ నిర్వహించారు. ఈ ట్రయల్‌కు సాల్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రయోగశాల్లో జరిగిన పరిశోధనలు ఒక పునాదిగానూ నిలిచాయనుకోవచ్చు. ఈ అధ్యయనంలో పారికాల్సిటాల్‌ అనే ఔషధాన్ని పరీక్షించారు. ఇది విటమిన్‌డి తరహాలోనే పనిచేసే ఒక ఔషధం. ఇది క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌కి సంబంధించిన కొన్ని సమస్యల చికిత్సలో ఇప్పటికే ఉపయోగిస్తున్నారు.

ఇంతకుముందు చికిత్స పొందని, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిన ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న 36 మంది ఈ ట్రయల్‌లో పాల్గొన్నారు. వారికి సాధారణ కీమోథెరపీతో పాటు పారికాల్సిటాల్‌ ఇచ్చినప్పుడు, క్యాన్సర్‌ చుట్టూ ఉన్న కణజాలంలో మార్పులు వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. ఫైబ్రోబ్లాస్ట్‌ల క్రియాశీలత తగ్గడంతో, క్యాన్సర్‌తో పోరాడే టీ సెల్స్‌ కణితి లోపలి భాగాల్లోకి చొచ్చుకెళ్లే అవకాశాలు పెరిగాయి. అంటే, ఈ ఫలితాలు క్యాన్సర్‌ కణాలను నేరుగా లక్ష్యంగా చేసుకోవడంతోపాటు, వాటి చుట్టూ ఉన్న కణజాలాన్ని కూడా లక్ష్యంగా చేసుకునే చికిత్సా ప్రక్రియకు ఉన్న అవకాశాన్ని సూచిస్తున్నాయి. 

‘నేచర్‌ క్యాన్సర్‌’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో ప్రాథమికంగా ఆశాజనక ఫలితాలు నమోదయ్యాయి. పారికాల్సిటాల్‌తో పాటు కీమోథెరపీ తీసుకున్న 24 మందిలో 10 మందికి క్యాన్సర్‌ కణితి గణనీయంగా చిన్నదైంది. దీన్ని పార్షియల్‌ రెస్పాన్స్‌ అంటారు. పారికాల్సిటాల్‌ ఇవ్వకుండా సాధారణ కీమోథెరపీ మాత్రమే తీసుకున్న 12 మందిలో ఒక్కరికే ఈతరహా ఫలితం కనిపించింది. 

అయితే, కొందరిలో రక్తంలో కాల్షియం స్థాయులు పెరిగాయి. దీంతో ఔషధ మోతాదును తగ్గించాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఈ ఔషధాల కలయిక సాధారణంగా సురక్షితంగా ఉన్నట్లు పరిశోధకులు నివేదించారు. అయితే... ఈ పరిశోధనలో కనిపించిన ఫలితాలు ఇప్పటికి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఈ తొలి దశ క్లినికల్‌ ట్రయల్‌ ద్వారా బాధితుల జీవితకాలం పెరుగుతుందని ఇంకాపూర్తిగా నిరూపితం కాలేదు. క్యాన్సర్‌ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం కాకుండా, వాటి చుట్టూ ఏర్పడే రక్షణ కవచాన్ని బలహీనపరచడం ద్వారా కూడా చికిత్సను మెరుగుపరచవచ్చని మాత్రమే ఇప్పటికి ఈ పరిశోధన సూచిస్తోంది.

ప్రాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ వంటి చికిత్స చేయడం కష్టమైన వ్యాధిలో ఇది ఒక ఆసక్తికరమైన పరిశోధనా మార్గం. అయితే, దీని ప్రయోజనాలు, దీర్ఘకాలిక భద్రత, బాధితుల జీవితకాలంపై ప్రభావం వంటి అంశాలను నిర్ధారణ చేసేందుకు మరిన్ని అధ్యయనాలు అవసరం. అందుకే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే...పారికాల్సిటాల్‌ అనేది సాధారణంగా దొరికే విటమిన్‌. ఇది సప్లిమెంట్‌ కాదు. క్యాన్సర్‌ చికిత్స కోసం వైద్యుల సలహా లేకుండా దీన్ని ఉపయోగించడం ఎంతమాత్రమూ సరికాదు.
డా. ఏవీఎస్‌ సురేశ్‌, సీనియర్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ 

నిర్వహణ: యాసీన్‌

ఇదీ చదవండి: మెగ్నీషియం సప్లిమెంట్‌ని డాక్టర్లు చెప్పకుండా ఎడాపెడా వాడొద్దు!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement