పత్తి పంటకు ఈసారి మస్త్ డిమాండ్
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
క్వింటాల్‌కు రూ.9,300 నుంచి రూ.10,600 వరకు చెల్లింపులు
ఆదిలాబాద్‌లో మాత్రం మద్దతు ధర కంటే తక్కువే
రాష్ట్రంలో 48 లక్షల ఎకరాల్లో సాగు.. దిగుబడులపై వర్షాభావం, తెగుళ్ల దెబ్బ.. ఈ నెల 21 నుంచి సీసీఐ కొనుగోళ్లు..
131 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: తెల్ల బంగారానికి ఈసారి డిమాండ్ పెరిగింది. పత్తి ఏరుడు మొదలు కావడంతో మార్కెట్లలో సందడి నెలకొంది. మరోవైపు పత్తి కొనుగోళ్ల కోసం పక్క రాష్ట్రాల వ్యాపారులు తెలంగాణకు క్యూ కడుతున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ నుంచి వస్తున్న వ్యాపారులు కొన్ని ప్రాంతాల్లో క్వింటాల్‌కు రూ.9,300 నుంచి రూ.10,600 వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా ధర లభిస్తుండటంతో రైతులు ప్రైవేటు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ ధరలు అన్ని మార్కెట్లలోనూ ఒకేవిధంగా లేవు. కొన్నిచోట్ల మద్దతు ధర కంటే తక్కువకు కూడా పత్తి అమ్ముకోవాల్సి వస్తోంది.
2026–27 సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం మీడియం స్టేపుల్ పత్తికి క్వింటాల్‌కు రూ.8,267, పొడవు పింజ పత్తికి రూ.8,667 మద్దతు ధర ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే రెండు రకాలకూ రూ.557 పెంచింది. మార్కెట్లో వ్యాపారులు చెల్లించే ధర మద్దతు ధర కంటే ఎక్కువగా ఉంటే రైతులకు కొంత ఊరట లభిస్తుంది. అదే నాణ్యత, తేమ కారణాలతో ధర తగ్గితే పెట్టుబడి కూడా తిరిగి రాని ప్రమాదం ఉంది. కాగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారికంగా పత్తి కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ప్రస్తుతం రైతులు ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు.
జూలూరుపాడులో రికార్డు ధర
⇒ వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఇతర రాష్ట్రాల వ్యాపారులు క్వింటాల్‌కు రూ.9,300–రూ.9,600 వరకు చెల్లిస్తున్నారు.
⇒ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో రూ.10,600 వరకు ధర పలుకుతున్నట్టు రైతు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. అయితే మార్కెట్ ధరలు పత్తి రకం, నాణ్యత, తేమ శాతాన్ని బట్టి మారుతున్నాయి.
⇒ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో ఈ నెల 15న క్వింటాల్‌కు సగటు ధర రూ.8,700 కాగా, కనిష్టంగా రూ.8,000, గరిష్టంగా రూ.9,100 నమోదైంది. ఈ నెల 1న ఇక్కడ సగటు ధర రూ.7,600 మాత్రమే. అంటే రెండు వారాల్లోనే క్వింటాల్‌కు రూ.1,100 పెరిగింది.
⇒ ఆదిలాబాద్ మార్కెట్లో మాత్రం శనివారం సగటు ధర రూ.8,160 మాత్రమే పలికింది. కనిష్ట ధర రూ.7,650కి పడిపోయింది. అంటే పొడవు పింజ పత్తి మద్దతు ధర కంటే క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.1,000 వరకు తక్కువ. మంచి ధర పలుకుతున్న ప్రాంతాలతో పోలిస్తే .. ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు నష్టపోతున్నారు.
21 నుంచి సీసీఐ కొనుగోళ్లు
రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 48.21 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. సుమారు 25.85 లక్షల టన్నుల ఉత్పత్తి (జిన్నింగ్ తర్వాత 50.68 లక్షల బేళ్లు) వస్తుందని అంచనా వేస్తున్నా, వర్షాభావం కారణంగా వాస్తవ దిగుబడి తగ్గే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 131 కేంద్రాల్లో ఒకేసారి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
గత సీజన్లో 122 కేంద్రాలు ఉండగా, ఈసారి మరో 9 కేంద్రాలను పెంచుతున్నారు. ఎల్–1, ఎల్–2, ఎల్–3 కేటగిరీల వారీగా జిన్నింగ్ మిల్లులకు పత్తిని కేటాయించే విధానాన్ని ఈసారి కూడా కొనసాగించనున్నారు. అయితే జిన్నింగ్ మిల్లుల యజమానులు దశలవారీగా కాకుండా, రాష్ట్రంలోని మొత్తం 353 జిన్నింగ్ మిల్లులకు ఒకేసారి పత్తిని కేటాయించాలని కోరుతున్నారు. కాగా గతంలో అక్రమాలకు పాల్పడిన కొందరు మార్కెట్ కార్యదర్శులు, సిబ్బంది సస్పెండ్ అయిన నేపథ్యంలో ఈసారి పూర్తి పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని రైతులు కోరుతున్నారు.
కపాస్ కిసాన్ యాప్ ద్వారానే విక్రయం
సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకోవాలంటే రైతులు తప్పనిసరిగా ‘కపాస్ కిసాన్’యాప్‌లో పేరు నమోదు చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంకు ఖాతా వివరాలతో ఈ యాప్‌ను వినియోగించాల్సి ఉంటుంది. రైతు భూమి, సాగు విస్తీర్ణం ఆధారంగా ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీతో అనుసంధానించి స్లాట్లు కేటాయిస్తారు. ఈసారి స్లాట్ బుకింగ్ గడువును 7 రోజుల నుంచి 14 రోజులకు పెంచారు. రైతు రోజుకు 100 క్వింటాళ్ల వరకు విక్రయించుకోవచ్చు. ప్రతి లావాదేవీకి ఆధార్, ఓటీపీ ధ్రువీకరణ తప్పనిసరి. పత్తి నాణ్యత, తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాతే కొనుగోలు ధర నిర్ణయిస్తారు. అందువల్ల రైతులు పత్తిని బాగా ఆరబెట్టి, కేటాయించిన తేదీనే కేంద్రాలకు తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
కొన్ని జిల్లాల్లో తగ్గనున్న దిగుబడి
గతంలో ఎకరాకు సగటున 7 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిన చోట్ల ఈసారి 4 క్వింటాళ్లకే పరిమితమవుతోందని రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల పత్తిపై గులాబీ రంగు కాయతొలుచు పురుగు, తామర పురుగు, పచ్చదోమ దాడి చేస్తున్నాయి. కాయలు పగిలే దశలో పురుగు సోకడంతో దూది నాణ్యత, దిగుబడి రెండూ పడిపోతున్నాయి.
సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో సొంత భూమి ఉన్న రైతుకు ఎకరాకు సుమారు రూ.40 వేలు, కౌలు రైతుకు రూ.60 వేల వరకు పెట్టుబడి అవుతోందని అంచనా. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి వచి్చ, క్వింటాల్ రూ.10 వేల చొప్పున అమ్మినా మొత్తం ఆదాయం రూ.40 వేలే. ఇందులో కౌలు, సాగు ఖర్చులు, ఏరుడు ఖర్చులు పోను కౌలు రైతుకు నష్టం మిగిలే ప్రమాదం ఉంది.


