మంచిర్యాల: దండేపల్లి మండలం తాళ్లపేటలో సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంబరాలు జరుపుకోవాల్సిన పండుగ పూట కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు పరస్పరం బాహాబాహీకి దిగడం స్థానికంగా కలకలం రేపింది. ఇరువర్గాల మధ్య చెలరేగిన వివాదం పెద్ద కొట్లాటకు దారితీసింది.
ఎలా జరిగిందంటే?
తాళ్లపేటలో ఘనంగా జరుగుతున్న సద్దుల బతుకమ్మ వేడుకల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ వర్గం, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయుల మధ్య ఏదో విషయమై మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ మాటామాటా పెరిగి చివరకు ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు పరస్పరం రగిలిపోయారు.
కర్రలతో దాడులు..
పరిస్థితి అదుపు తప్పడంతో ఇరువర్గాల వారు కర్రలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పండుగ వేళ రోడ్డుపైనే రెండు వర్గాలు కొట్లాడుకోవడంతో అక్కడ తీవ్ర గందరగోళం, భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ దాడిలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
రంగప్రవేశం చేసిన పోలీసులు
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు భారీగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి మరింత చేయి దాటకుండా ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలీసుల జోక్యంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.


