హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC)పై చేసిన ఆరోపణలకు యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. పండుగల సమయంలో బస్సు టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక బస్సుల రద్దుకు సంబంధించి హరీశ్ రావు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని సంస్థ స్పష్టం చేస్తోంది. పండుగల సమయాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టికెట్ ధరల నియంత్రణ, నిర్ణయాలు 2003వ సంవత్సరానికి చెందిన GO ఆధారంగా, నిబంధనల ప్రకారం జరుగుతున్నాయని సంస్థ తెలిపింది. సంస్థలో ఎలాంటి అదనపు భారం మోపకుండా నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వివరించింది.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "మహాలక్ష్మి" ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోందని, ఆడపడుచులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. అదే విధంగా, దసరా పండుగ వేళ బస్సు సర్వీసులను తగ్గించలేదని తెలిపింది.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పండుగవేళ ఊర్లకెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఈసారి ప్రత్యేకంగా 7,000 అదనపు బస్సులను ఏర్పాటు చేశామని, ఈ నెల 10వ తేదీ నుండి ఇప్పటివరకు కేటాయించిన అదనపు బస్సుల్లో 97 శాతం సర్వీసులను విజయవంతంగా నడిపించి ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చామని తెలిపింది. అదేవిధంగా సంస్థ ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు చేస్తూ ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) యాజమాన్యం నిరంతరం శ్రమిస్తోందని తెలిపింది.


