తక్కువ ఖర్చుతో ఎక్కువ స్టోర్లలో షాపింగ్
మార్కెట్ ట్రెండ్స్‌ను పూర్తిగా మార్చేస్తున్న జెన్–జీ
జెన్–జీ షాపింగ్ ట్రెండ్స్‌పై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: జెన్–జీ (1997– 2012 మధ్య జన్మించిన వారు) మార్కెట్ ట్రెండ్స్‌ను పూర్తిగా మార్చేస్తోంది. వారు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారని, లగ్జరీ జీవితానికి అలవాటు పడ్డారనే అపోహలను తాజా అధ్యయనాలు పటా పంచలు చేస్తున్నాయి. సగటు వినియోగదారుడితో పోలిస్తే జెన్–జీ యువత షాపింగ్‌పై పెట్టే బడ్జెట్ తక్కువే అయినప్పటికీ, వారు కొనుగోలు చేసే దుకాణాల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉందని తేలింది. ఇటీవల ప్రముఖ రీసెర్చ్, డిజిటల్ మీడియా సంస్థలు అటైన్, డెంట్సూ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో జెన్–జీ షాపింగ్ అలవాట్లకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
కీలక అంశాలివీ...
⇒ సాధారణ కస్టమర్లతో పోలిస్తే జెన్–జీ యువత ఏడాదికి 25% తక్కువ డబ్బును షాపింగ్‌కు ఖర్చు చేస్తోంది.
⇒ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, పరిమిత ఆదాయ వనరుల కారణంగా జెన్‌జీ బడ్జెట్‌కు ప్రాధాన్యత ఇస్తోంది.
⇒ బడ్జెట్ తక్కువ ఉన్నప్పటికీ, వీరు ఒకే దుకాణానికి పరిమితం కావడం లేదు.
⇒ సగటు వినియోగదారుడి కంటే 6% ఎక్కువ దుకాణాలను లేదా బ్రాండ్లను వీరు అన్వేíÙస్తున్నారు.
⇒ ఆఫర్లు, బెస్ట్ డీల్స్ ఎక్కడ ఉంటే అక్కడ వేర్వేరుగా కొనుగోలు చేయడం వీరి ప్రత్యేకత.
⇒ జెన్–జీ సాధారణ వస్తువుల కంటే బ్రాండెడ్ వస్తువులను ఇష్టపడటంలో 25% ముందున్నారు.
⇒ ఒకే బ్రాండ్‌కు కట్టుబడి ఉండే విషయంలో మాత్రం ఇతర తరాల కంటే 18% వెనుకబడి ఉన్నారు.
⇒ ఒకసారి ఒక బ్రాండ్ కొంటే, మరోసారి వేరే కొత్త బ్రాండ్‌ను ట్రై చేయడానికి వెనుకాడటం లేదు.
⇒ వస్తువులను పోగేసుకోవడం కంటే కూడా రెస్టారెంట్లు, గేమింగ్, ఫిట్నెస్, ప్రయాణాల వంటి వినోదభరిత అనుభవాలకే 66% నిధులు కేటాయిస్తున్నారు.
⇒ డిస్కౌంట్ల కోసం గంటల తరబడి వేచి చూడటం కంటే, 19% మంది సమయాన్ని ఆదా చేసే క్విక్ కామర్స్, వన్–స్టాప్ షాపింగ్ ఆప్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
⇒ వీరు కేవలం విలాసాలకే కాకుండా 70% పైగా ఆదాయాన్ని నిత్యావసరాలు, కిరాణా, బిల్లులు, ఫైనాన్షియల్ సర్వీసులకే వాడుతున్నారు.
సంప్రదాయ పద్ధతులు పారవు..
ఆన్లైన్ రీసెర్చ్ చేయడం, రీల్స్ లేదా సోషల్ మీడియాలో చూసి వివిధ స్టోర్లలో రేట్లను పోల్చి చూసి షాపింగ్ చేయడం మనదేశ యువతలోనూ పెరిగింది. సంప్రదాయ మార్కెటింగ్ పద్ధతులు జెన్–జీ దగ్గర పారవని అటైన్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ జిఫ్రానీ పేర్కొన్నారు. యువత ఒకే చోట స్థిరంగా కొనడం లేదు కాబట్టి, బ్రాండ్లు తమ కస్టమర్లను ఆకర్షించే వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.


