పండుగకు ఊరెళ్తున్నారా? బస్సు చార్జీలు చూస్తే షాకే! | Hyderabad Dasara Bathukamma Travel Rush Fares | Sakshi
Sakshi News home page

పండుగకు ఊరెళ్తున్నారా? బస్సు చార్జీలు చూస్తే షాకే!

Oct 18 2026 9:35 AM | Updated on Oct 18 2026 9:35 AM

Hyderabad Dasara Bathukamma Travel Rush Fares

సొంతూళ్లకు భారీగా నగర వాసులు

అదనంగా 1,100 ఆర్టీసీ బస్సులు

ప్రత్యేక బస్సుల్లో 50% చార్జీల మోత

ప్రైవేట్‌లో ప్రయాణికులపై నిలువుదోపిడీ

సాక్షి, హైదరాబాద్‌: నగరం పల్లెబాట పట్టింది. సద్దుల బతుకమ్మ, దసరా పండగ రద్దీ పోటెత్తింది. వారం రోజులుగా కొనసాగుతున్న పండుగ రద్దీ శనివారం భారీగా పెరిగింది. ఆదివారం సద్దుల బతుకమ్మ కావడంతో ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేట్‌ వాహనాల్లో జనం సొంత ఊరు బాట పట్టారు. మహాత్మాగాం«దీ, జూబ్లీ బస్‌స్టేషన్‌లతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే బస్సులతో పాటు 50 శాతం అదనపు చార్జీలతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

శనివారం ఒక్కరోజే సుమారు 1,100కు పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు  అధికారులు తెలిపారు. ఆదివారం కూడా ప్రయాణికుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలతో పాటు  సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే  రైళ్లు సైతం ప్రయాణికుల రద్దీతో కిక్కిరిశాయి. మరోవైపు సొంత వాహనాల్లో బయలుదేరారు. కార్లు, బైక్‌లు తదితర వాహనాలు నగర ప్రధాన రహదారులపై బారులు తీరాయి.

కిక్కిరిసిన జనరల్‌ బోగీలు.. 
దసరా, దీపావళి పండుగల రద్దీ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే సుమారు 600 రైళ్లను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. తెలంగాణ మీదుగా  వివిధ ప్రాంతాలకు బయలుదేరే  అన్ని రైళ్లలో సాధారణ బోగీలు  ప్రయాణికులతో కిటకిటలాడాయి. చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ, మల్కాజిగిరి, హైటెక్‌సిటీ, లింగంపల్లి, తదితర స్టేషన్‌ల నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.

భారీగా పెరిగిన చార్జీలు.. 
పండుగలు, ప్రత్యేక వేడుకలు, తదితర  సందర్భాలను  దృష్టిలో ఉంచుకొని ప్రతిసారి ప్రయాణికులపై భారం మోపుతున్న ఆర్టీసీ.. ఈసారి సాధారణ చార్జీలపై 50 శాతం అదనపు వసూళ్లకు దిగింది. ఉప్పల్, ఎల్‌బీనగర్, జూబ్లీబస్‌స్టేషన్, తదితర ప్రాంతాల నుంచి  తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే  ట్రావెల్స్‌ వాహనాలు సైతం  చార్జీలను అడ్డగోలుగా పెంచాయి. ఎక్కువ చార్జీలు తీసుకొనే ప్రైవేట్‌ బస్సులపై కేసులు నమోదు చేయనున్నట్లు  రవాణాశాఖ అధికారులు హెచ్చరించారు. ప్రైవేట్‌ వాహనాల అక్రమ రవాణాను అరికట్టనున్నట్లు చెబుతున్నా.. ఆచరణలో ఎక్కడా నియంత్రణ చర్యలు కనిపించలేదు. దీంతో ప్రైవేట్‌ వాహనాల దారిదోపిడీ యథావిధిగా కొనసాగింది.

ఇదీ చదవండి: బడ్జెట్‌ తక్కువ.. బ్రాండ్లు ఎక్కువ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement