న్యూఢిల్లీ: ఢిల్లీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా 2002 ఓటర్ల జాబితాతో తల్లిదండ్రుల పేర్లు సరిపోలకపోవడం లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉండటాన్ని గుర్తించిన దాదాపు 33.12 లక్షల కేసుల్లో 80 శాతానికి పైగా సమస్యలను పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన, లేదా రికార్డులు సరిపోలని వారి వివరాలను ధృవీకరించేందుకు ఎన్నికల అధికారులు కృషి చేస్తున్నారు.
ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 33,12,919 కేసుల్లో దాదాపు 26 లక్షల కేసులను ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో), సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్వో) ఇప్పటికే పరిష్కరించారు. సంబంధిత ధృవీకరణ పత్రాలను సేకరించేందుకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్వో) నేరుగా ఓటర్ల ఇళ్లను సందర్శిస్తున్నారు.
ఆగస్టు 31న ప్రచురించిన ముసాయిదా జాబితా నుంచి 47 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను తొలగించడంపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ దిద్దుబాటు ప్రక్రియను వేగవంతం చేశారు. ఒకవేళ ఎవరి పేరైనా ముసాయిదా జాబితాలో లేకపోతే, వారు నిబంధనల ప్రకారం ఫారం-6 సమర్పించి తుది జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఓటర్ల సందేహాలు నివృత్తి చేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. నోటీసులకు సంబంధించిన అన్ని కేసులను అక్టోబర్ 30 నాటికి పరిష్కరించి, డిసెంబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.
ఇదీ చదవండి: తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత


