వ్యక్తిగత దుఃఖంతో కొందరు తమ గమనాన్ని ఆపేస్తారు. ఆ శోఖంతో తల్లడిల్లిపోతుంటారు. మరికొందరు ఆ బాధనే ఆశయంగా మార్చుకుని సామజిక సేవకు నడుంబిగించి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ ఐఏఎస్ అధికారిణి.
ఆ మహిళా అధికారే త్రిపుర కేడర్కు చెందిన 2008 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారిణి సోనాల్ గోయల్. తండ్రిని కోల్పోయిన ఈ 43 ఏళ్ల ఐఏఎస్ అధికారిణి సోనాల్ గోయల్ ఆ శోకాన్ని పదిమందికి ఉపయోగపడేలా సామాజికి సేవగా మార్చుకుందామె. కన్నీళ్లతో కూర్చొంటే ఏం రాదు అనే సందేశాన్ని అందిస్తూ..ఓ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
కేన్సర్, మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడానికి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఆఫ్రికాలో ఎత్తైన ఈ పర్వతానికి ఉన్న మూడు అధికారిక శిఖరాగ్రాలలో ఒకటైన స్టెల్లా పాయింట్ దాదాపు 5,756 మీటర్ల ఎత్తును ఈ నెల ఆక్టోబర్ 2న చేరుకున్నారు. టాంజానియాలోని నిద్రాణమైన అగ్నిపర్వతమైన కిలిమంజారో పర్వత అధిరోహణ కోసం సుమారు ఎనిమిది రోజుల పాటు సవాలుతో కూడిన యాత్రను పూర్తి చేశారామె.
ప్రధానంగా భారతదేశం, అమెరికా, కెనడాకు చెందిన దాదాపు పది మంది సభ్యుల పర్వతారోహణ బృందంలో ఆమె ఒక్కరే మహిళ. గోయల్ ఆరోగ్యకరమైన జీవనంపై అవగాహన కల్పించేందుకు ఈ యాత్రను ఉపయోగించుకోవడం విశేషం. కేన్సర్ కారణంగా తండ్రిని కోల్పోవడంతోనే ఈ అవగాహన ప్రచారాన్ని చేపట్టినట్లు తెలిపారు. తన తండ్రిని అక్టోబర్ 24, 2023న కోల్పోయినట్లు తెలిపింది. అది తన జీవితంలో పూడ్చలేని బాధ అని ఆవేదనగా చెప్పారామె. అయితే తన వ్యక్తిగత దుఃఖం ఒక అర్థవంతమైన సామాజిక నిబద్ధతగా మార్చాలనే సంకల్పానికి నాంది పలికినట్లు పేర్కొంది.
ఆ నేపథ్యంలోనే ఈ సాహసానికి పూనుకున్నట్లు వెల్లడించారు. తనలా మరెవ్వరూ ఇలాంటి బాధను ఎదుర్కొనకుండా ముందస్తు గుర్తింపుతో బయటపడేలా చేసి.. సంతోషం నింపాలనే ఆశయంతో ముందుకు సాగినట్లు తెలిపారు. చాలామంది కుటుంబాలకు కేన్సర్పై అవగాహన కల్పించేలా ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి తెలియజేస్తే..ఈ బాధ బారినపడరనేది తన ఆశ అని గోయల్ అంటోంది. అందరూ ముందస్తు గుర్తింపుతో సకాలంలో వైద్య తీసుకుంటే చాలా కుటుంబాలకు ఈ బాధను నివారించినట్లేనని చెబుతోందామె.
కాగా, గోయల్ భారత త్రివర్ణ పతాకాన్ని స్టెల్లా పాయింట్ వద్ద ఆవిష్కరించి, కేన్సర్ అవగాహన సందేశాలు,"డ్రగ్స్ నహీ, డ్రీమ్స్ చునో" వంటి నినాదంతో కూడిన పోస్టర్లను ప్రదర్శించారామె. ఈ ఏడాది మే నెలలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర సందర్భంగా ఆమె ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. పర్వతారోహణపై తనకున్న అభిరుచిని ఒక సామాజిక కార్యక్రమంతో మేళవించి ఈ సాహస కృత్యాన్ని చేసింది గోయల్. అంతేగాదు భారత్లో ఈ ఘనత సాధించిన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి గోయల్నే కావడం విశేషం.
ఇదీ చదవండి: పీఎం సీట్లో ఉన్నా..తప్పని ఇంటిపనులు..! జపాన్ మహిళా ప్రధాని కష్టాలు..


