జైళ్ల శాఖ నుంచి.. పౌరసరఫరాల పీఠంపైకి..! | Deep dissatisfaction within official circles regarding the Babu governments approach | Sakshi
Sakshi News home page

జైళ్ల శాఖ నుంచి.. పౌరసరఫరాల పీఠంపైకి..!

Oct 14 2026 5:22 AM | Updated on Oct 14 2026 5:22 AM

Deep dissatisfaction within official circles regarding the Babu governments approach

బాబు మెప్పుతో ‘వరం’.. ప్రసాద్‌కు కీలక బాధ్యతలు! 

ఐఏఎస్‌ గా పదోన్నతి.. సివిల్‌ సప్లయిస్‌ ఎండీగా పోస్టింగ్‌ 

జేసీ, కలెక్టర్‌ స్థాయిలో సుదీర్ఘంగా పనిచేసిన వారికిచ్చే పోస్టింగ్‌ ఇది 

కానీ జైలులో చంద్రబాబు మన్ననలు అందుకున్నందుకు నజరానా

చినబాబు కనుసన్నల్లోనే ఐఏఎస్‌ పోస్టింగులు.. పునర్నియామకాలు.. 

సీనియర్‌ ఐఏఎస్‌లను పక్కన పెట్టి అడుగులకు మడుగులోత్తే వారికి పోస్టింగ్‌లు 

రిటైర్డ్‌ అధికారులకు పునరావాసం.. క్యాడర్‌ అధికారులకు నిరాశ! 

బాబు సర్కార్‌ తీరుపై అధికారవర్గాల్లో తీవ్ర అసంతృప్తి.. 

సాక్షి, అమరావతి: జైళ్ల శాఖ నుంచి.. ఏకంగా పౌరసరఫరాల సంస్థ పీఠంపైకి! ఐఏఎస్‌గా పదోన్నతి.. వెంటనే కీలక పోస్టింగ్‌! ఇదీ చంద్రబాబు మార్కు పాలనలో అధికారుల నియామకాల తీరు అంటూ అధికారవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా జేసీ, కలెక్టర్‌ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారులకు అప్పగించే రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండీ బాధ్యతలను.. జైళ్ల శాఖలో పనిచేసిన ఎం.వరప్రసాద్‌కు కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది. గతంలో చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సమయంలో వరప్రసాద్‌ ఆయన మన్ననలు పొందారనే ఆరోపణలు, ఆ తర్వాత ఆయనకు ఐఏఎస్‌ పదోన్నతి, కీలక పోస్టింగ్‌ దక్కడంతో ఈ నియామకంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

మరోవైపు చినబాబు కనుసన్నల్లోనే ఐఏఎస్‌ పదోన్నతులు, పోస్టింగులు, పదవీ విరమణ చేసిన అధికారుల పునర్నియామకాలు సాగుతున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సీనియర్‌ క్యాడర్‌ అధికారులను పక్కనపెట్టి, ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా వ్యవహరించే వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారన్న అసంతృప్తి అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. అర్హతలు, అనుభవం, సీనియారిటీకి ప్రాధాన్యమివ్వాల్సిన చోట రాజకీయ ప్రాపకమే ప్రమాణంగా మారుతోందా? అన్న ప్రశ్న ఇప్పుడు పరిపాలనా వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. 

నాడు బాబుకు సపర్యలు.. నేడు కీలక పోస్టింగ్‌లు 
ఏపీక్యాడర్‌ ఐఏఎస్‌ పోస్టుల్లో 33 శాతం పదోన్నతుల ద్వారా వస్తారు. వాటిలో 85 శాతం రెవెన్యూ డిపార్టుమెంట్‌ నుంచి, 15 శాతం నాన్‌ రెవెన్యూ డిపార్టుమెంట్‌ నుంచి పదోన్నతి కల్పి స్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తమ అడుగులకు మడుగులొత్తే వారు ఏ డిపార్టుమెంట్‌లో ఉన్నా సరే, కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌ జాబితాలో చేర్చి కేంద్రం వద్ద తమకున్న పలుకుబడితో వారికి ఐఏఎస్‌ క్యాడర్‌ వచ్చేలా చేస్తున్నారు. అయితే ఇక్కడ వరప్రసాద్‌ నియామకంలో కూడా ఇదే జరిగిందన్న వాదన విన్పిస్తోంది. 

యూపీపీఎస్సీ నిబంధనల ప్రకారం రాష్ట్ర పరిధిలో నాన్‌ రెవెన్యూ కేడర్‌లో గ్రూప్‌ వన్‌ సర్వీస్‌లో కనీసం 8 ఏళ్లకు తక్కువ కాకుండా పనిచేసిన వారికి ఐఏఎస్‌కు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. నాన్‌ రెవెన్యూ కోటాలో వాణిజ్యపన్నులు, మున్సిపల్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ వంటి ఇతర శాఖలకు చెందిన వారికి మాత్రమే కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తారు. హోంశాఖ పరిధిలో ఉండే జైళ్ల శాఖ నుంచి ఇప్పటి వరకు కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌గా ఏ ఒక్కరికీ పదోన్నతి కల్పించిన దాఖలాలులేవు.  జైళ్ల శాఖలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన వరప్రసాద్‌కు చంద్రబాబు ప్రభుత్వం కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌గా పదోన్నతి కల్పించడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా పదోన్నతి జాతీయ స్థాయిలో కూడా ఇదే తొలిసారని చెబుతున్నారు.

 కాగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో జైళ్ల శాఖ గుంటూరు రేంజ్‌ డీఐజీగా పనిచేస్తున్న వరప్రసాద్‌ అనుకూలంగా వ్యవహరించారని, అందుకే కూటమి ప్రభుత్వం రాగానే ఆయన పేరు కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌ జాబితాలో చేర్చారన్న వాదన విన్పిస్తోంది. ఇప్పటికే ఆ సమయంలో రాజమహేంద్రవరం జైలర్‌గా పనిచేసిన కోవెల దుర్గారమేష్‌ను ఏపీఎక్సైజ్‌ సర్వీస్‌ రూల్స్‌ను సడలించి మరీ ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా నియమించిన విషయం తెలిసిందే.

పునర్నియామకాలపై క్యాడర్‌ అధికారుల్లో తీవ్ర అసంతృప్తి  
మరోవైపు పదవీ విరమణ చేసిన అధికారులను పునర్నియామకాల పేరిట కీలకమైన పోస్టింగ్‌లు కట్టబెడుతూ పునరావాసం కల్పిస్తుండడం పట్ల అధికార వర్గాల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)హోదాలో పనిచేసిన విజయానంద్‌ను పదవీ విరమణ తర్వాత పునర్నియామకం పేరిట ఎనర్జీ సెక్రటరీగా కొనసాగిస్తున్నారు. 2017లో రిటైర్‌ అయిన రామశంకర్‌ నాయక్‌ను మత్స్యశాఖ కమిషనర్‌గా పునర్నియమించి రెండేళ్లుగా కొనసాగిస్తున్నారు. 

ఇక తెలంగాణాకు చెందిన శరత్‌ను కూడా ఇదే రీతిలో రిటైర్‌ అయిన తర్వాత జేఈవోగా తిరిగి నియమించారు. వీరితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో 75 మందికిపైగా రిటైరైన అధికారులు వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు. సీనియర్లను పక్కన పెట్టి రిటైరైన వారికి కీలక బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ కారణంగానే గడిచిన రెండేళ్లుగా ఏపీ క్యాడర్‌ అధికారులకు కేంద్రంలో విలువ లేకుండా పోయిందని వాపోతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement