‘రణబాలి’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Ranabaali Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Ranabaali Review: ‘రణబాలి’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Oct 16 2026 12:25 PM | Updated on Oct 16 2026 2:03 PM

Ranabaali Movie Review And Rating In Telugu

టైటిల్‌: రణబాలి 
నటీనటులు: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా, ఆర్నాల్డ్‌ వోస్లూ, ఈశ్వరీరావు తదితరులు
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
దర్శకుడు: రాహుల్ సంకృత్యాన్
సంగీతం: అజయ్–అతుల్
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ ఆర్
విడుదల తేది: అక్టోబర్‌  16, 2026

Vijay Deverakonda Ranabaali HD Movie Stills 21

కథేంటంటే.. 
1876–78 మధ్యకాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో వచ్చిన భయంకరమైన కరువు నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. మద్రాసుకు కొత్తగా వచ్చిన కమిషనర్‌(ఆర్నాల్డ్‌ వోస్లూ)..అధికారులకు కొత్త కండీషన్‌ పెడతారు. ఇక్కడ పండించిన ప్రతి గింజా బ్రిటన్‌కు వెళ్లాల్సిందేనని ఆదేశిస్తాడు. ఎదురు తిరిగిన వాళ్లను దారుణంగా చంపేస్తాడు. ధాన్యాన్ని దేశం దాటించడానికి రైల్వే పనులు ప్రారంభిస్తాడు. కరువు సృష్టించి.. అక్కడ ప్రజలను పనికి వచ్చేలా చేస్తాడు. ఈ విషయం రాయలసీమ ప్రాంతానికి చెందిన పాలెగాడు సింగనమల బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ) దృష్టికి వెళ్తుంది.  భద్రమల్లన్న స్వామి ఆయుష్షుతో పెరిగిన రణబాలి.. బ్రిటీష్‌ పాలకులకు ఎలా ఎదురుదిరిగాడు? తినడానికి తిండిలేక అతి భయంకరమైన కరువుతో బాధపడుతున్న ప్రజలకు ఎలా అండగా నిలిచాడు? కరువుకు కారణమైన మద్రాసు కమిషనర్‌ని ఎలా అంతం చేశాడు? ఈ కథలో జయమ్మ(రష్మిక) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Vijay Deverakonda Ranabaali HD Movie Stills 20

ఎలా ఉందంటే.. 
బ్రిటిష్ పాలనలో దేశ ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు.వాళ్లు చేసిన అరచకాలు అంతా ఇంత కాదు. అందులో కొన్ని మాత్రమే బయటి ప్రపంచానికి తెలిశాయి. చాలా వరకు చరిత్రలో లేకుండా  చేశారు. అలా చరిత్రలో లేకుండా చేసిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ఈ రణబాలి. 1876–78 మధ్యకాలంలో మద్రాసు ప్రాంతంలో అతిపెద్ద కరువు వచ్చిందన్న విషయం మాత్రమే చరిత్రలో ఉంది. అయితే ఆ కరువుకు గల కారణం.. చావుల సంఖ్య విషయంలో సృష్టత లేదు. ఈ సినిమాలో ఆ కరువు కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూనే దానికి గల కారణాన్ని వివరించారు. 

స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన పోరాటాల నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. అయితే వాటిల్లో ఎక్కువగా హీరో వీరత్వాన్ని మాత్రమే చూపించారు. కానీ రణబాలిలో మాత్రం ప్రజలు ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? వాళ్లకు జరిగిన అన్యాయం ఏంటి? అనేది ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చూపించారు. అయితే నేరేష‌న్ అనేది పూర్తిగా ఇబ్బంది పెట్టింది. ప్ర‌తీ విష‌యాన్నీ డీటైల్డ్ గా చెప్పాల‌న్న ఉద్దేశంతో నిడివి పెంచుకొంటూ పోయాడు.

దర్శకుడు ఎంచుకున్న కథలో విషయం ఉంది. బాగానే రిసెర్చ్‌  చేసి స్టోరీ రాసుకున్నాడు.  డాక్యూమెంటరీ అనే ఫీలింగ్‌ రాకుండా సినిమాటిక్‌ లిబర్టీ తీసుకొని సన్నివేశాలను పేర్చాడు.  ఈ విషయంలో ఆయనను అభినందించొచ్చు. అయితే కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. టీజర్‌, ట్రైలర్‌ చూస్తే.. సినిమా ఎలా సాగుతుందో అర్థమైపోతుంది. దాదాపు సినిమా మొత్తం ఊహకందేలా సాగుతుంది. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. కొన్నీ సీన్లు చూస్తే.. బ్రిటీష్‌ పాలకులు ఇంతదారణంగా వ్యవహరించారా? అని తిట్టుకుంటాం. మరికొన్ని చోట్ల బాధపడతాం. అయితే స్లో నెరేషన్‌తో పాటు నిడివి ఎక్కువగా ఉండడంతో కొంత సాగదీతగా అనిపిస్తుంది. 
 

బుర్రకథ రూపంలో రణబాలి నేపథ్యాన్ని వివరిస్తూ చాలా ఎమోషనల్‌గా సినిమా ప్రారంభం అవుతుంది. ఈశ్వరీరావు పురిటి నొప్పులతో బిడ్డకు జన్మనివ్వడం.. ఆ చిన్నారికి భద్రమల్లన్న తాత నామకరణం పెట్టి.. ఓ షాకింగ్‌ విషయాన్ని చెప్పడం.. ఇలా మొదటి పావుగంట స్లోగా సాగుతుంది. రణబాలిగా విజయ్‌ దేవరకొండ ఎంట్రీ సీన్‌, యాక్షన్‌ సన్నివేశం కథలో వేగం పుంజుకుంటుంది. ఆ తర్వాత కరువు రాక్షసుడు అంటూ ఆర్నాల్డ్‌ వోస్లూ పాత్రను పరిచయం చేసి.. అసలు కథను ప్రారంభించాడు. ఒకవైపు బ్రిటీష్‌ అరచకాలను చూపిస్తూనే మరోవైపు జయమ్మ పాత్రని పరిచయం చేసి.. కొంత ఫన్‌ క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నించాడు.  మొదటి రాత్రి రోజు రణబాలి చేసే పనులు.. జయమ్మ రియాక్షన్‌ నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుంది.  

విరామం తర్వాత 20 నిమిషాల వరకు కథనం వేగంగా సాగుతుంది.  కానీ ఆ తర్వాత కథనం నెమ్మదిస్తుంది. కరువు కష్టాలను పదే పదే చూపించడంతో చూసిన సీన్లను మళ్లీ చూసినట్లుగా అనిపిస్తుంది. గుహలో వచ్చే యాక్షన్ సీన్‌ మాత్రం అదిరిపోతుంది. ఇలా కొన్ని గూస్‌బంప్స్‌ వచ్చే సీన్లు ఉన్నాయి కానీ.. కథనం నెమ్మదిగా సాగడంతో అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేవు. ఇక క్లైమాక్స్‌లో భద్రమల్లన్న చుట్టూ సాగే సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌ని ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి..నిడివి తగ్గిస్తే ఫలితం ఇంకాస్త మెరుగ్గా ఉండేది. 

Vijay Deverakonda Ranabaali HD Movie Stills 2

ఎవరెలా చేశారంటే..
రణబాలి పాత్రలో విజయ్‌ దేవరకొండ పరకాయ ప్రవేశం చేశాడు. తన ఇమేజ్‌కి దూరంగా ఉన్న పాత్ర ఇది. ఆ పాత్ర కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపించింది. యాక్షన్‌ సీన్లు మాత్రమే కాదు ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. నటుడిగా ఈ సినిమాతో విజయ్‌ ఓ మెట్టు ఎక్కేశాడని చెప్పొచ్చు. ఇక జయమ్మ పాత్రకు రష్మిక పూర్తి న్యాయం చేసింది. నిడివి తక్కువగా ఉన్నప్పటికీ.. ఒకటి రెండు బలమైన సీన్లు పడ్డాయి. విజయ్‌తో ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్‌ అయింది. మద్రాసు కమిషనర్‌గా ఆర్నాల్డ్‌  విలనిజం బాగానే పండించాడు. ఈశ్వరీరావుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.

సాంకేతికంగా సినిమా బాగుంది. జిష్ను భట్టాచార్జీ, నీరవ్ షా సినిమాటోగ్రఫి ఈ సినిమాకు మరో ప్రధాన బలం. అప్పటి పరిస్థితులను తెరపై చాలా సహజంగా కనిపించేలా చిత్రీకరించారు.  అజయ్–అతుల్ నేపథ్య సంగీతం జస్ట్‌ ఓకే. సరైన బీజీఎం లేకపోవడం వల్లే కొన్ని సీన్లు ఎలివేట్‌ కాలేకపోయాయి. పాటలు బాగున్నాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.  సెకండాఫ్‌లో కొన్ని సీన్లను కట్‌ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేదేమో. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement