వస్త్ర దుకాణాలు, జ్యువెలరీ షాపుల్లో కొనుగోళ్ల జోరు
వాహనాలు, ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలపై భారీ ఆఫర్లు
ఈ సీజన్ వ్యాపారం రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా
సాక్షి, హైదరాబాద్: నగరంలో పండుగ సందడి జోరుగా సాగుతోంది. ఆదివారం సద్దుల బతుకమ్మ కోసం మహిళలు పెద్ద ఎత్తున పూలు, ఇతర సామాగ్రి కొనుగోలు చేశారు. ఇక మంగళవారం దసరా పండుగ నేపథ్యంలో షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలు కిటకిటలాడుతున్నాయ. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు అన్ని ప్రధాన వీధులు వినియోగదారులతో కిక్కిరిస్తున్నాయి.
సాధారణంగా దసరా సీజన్లో పండుగకు అవసరమైన కొత్త దుస్తులు, గృహోపకరణాలు, కొత్త కార్లు, బైకులు, బంగారు నగలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారు. చార్మినార్, అబిడ్స్, సుల్తాన్ బజార్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, అమీర్పేట, బేగంబజార్, కోఠి తదితర ముఖ్య ప్రాంతాల్లో ఈ సందడి ఎక్కువగా ఉంది. గృహిణులు పిండి వంటల కోసం నిత్యావసరాలను అధికంగా కొనుగోలు చేస్తున్నారు.
అంచనా రూ.3 వేల కోట్లు
వ్యాపార వర్గాల అంచనా ప్రకారం ఈ దసరా సీజన్లో నగరంలో సుమారు రూ.2,500 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఇది గతేడాది కంటే 30 శాతం అధికం. అందులో వస్త్ర వ్యాపారం రూ.800 కోట్లు, ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు రూ.600 కోట్లు, బంగారం, నిత్యవసరాలు, ఇతర వస్తువులు కలిపి మరో రూ.1,200 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఆఫర్లే ఆఫర్లు..
పండుగను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటించారు. అన్ని రకాల దుస్తులపై 30 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్, ఉచిత గిఫ్ట్ హ్యాంపర్లు, లక్కీ డ్రా కూపన్లు తదితర ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీలపైనా భారీ తగ్గింపు రేట్లు ప్రకటిస్తున్నారు. ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్ ఆఫర్లు ఇస్తున్నారు. బంగారు నగల తరుగు, మేకింగ్ చార్జీలపై 25 నుంచి 50 శాతం వరకు తగ్గింపు, ప్రతి కొనుగోలుపై బంగారు నాణెం లేదా వెండి వస్తువులు ఉచితంగా ఇస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇక పండుగ రద్దీ దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని మార్కెట్లు తెరిచే ఉంచుతున్నట్లు వ్యాపారులు తెలిపారు.
ఇదీ చదవండి: పండుగకు ఊరెళ్తున్నారా? బస్సు చార్జీలు చూస్తే షాకే!


