2జీ నుంచి ఏఐ వరకు జియోకు వృద్ధి అవకాశాలెన్నో.. | 5G, Broadband and AI could power its next growth phase in Jio Platforms IPO | Sakshi
Sakshi News home page

2జీ నుంచి ఏఐ వరకు జియోకు వృద్ధి అవకాశాలెన్నో..

Oct 19 2026 5:17 AM | Updated on Oct 19 2026 5:17 AM

5G, Broadband and AI could power its next growth phase in Jio Platforms IPO

ఈ నెల 21 నుంచి 23 వరకు ఐపీవో 

పెట్టుబడికి సదవకాశమంటున్న బ్రోకరేజీ సంస్ధలు

భవిష్యత్తు వృద్ధికి 5జీ, హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్, ఏఐ దన్ను

న్యూఢిల్లీ: ఈనెల 21 నుంచి ఐపీఓకు సిద్ధమవుతున్న జియో ప్లాట్‌ఫామ్స్‌ (జేపీఎల్‌) భవిష్యత్‌ వృద్ధికి 5జీ, హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్, కృత్రిమ మేధ (ఏఐ) కీలక చోదక శక్తులుగా నిలవనున్నాయి. మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థలు జీఈపీఎల్‌ క్యాపిటల్, వెంచురా సెక్యూరిటీస్, ఎస్‌ఎంసీ గ్లోబల్‌ నివేదికల ప్రకారం దేశంలో ఇంకా సుమారు 26 కోట్ల మంది 2జీ వినియోగదారులు ఆధునిక, హైస్పీడ్‌ నెట్‌వర్క్‌లకు మారాల్సి ఉంది. వీరిని 4జీ, 5జీ సేవల్లోకి తీసుకురావడం ద్వారా టెలికాం కంపెనీలకు ముఖ్యంగా జియోకు కొత్త వ్యాపార అవకాశాలు లభించనున్నాయి. 

మరోవైపు దేశంలో హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వ్యాప్తి ప్రస్తుత 21 శాతం నుంచి 2030 నాటికి 46 శాతానికి చేరవచ్చని అంచనా.దీంతో ఫైబర్‌ ఇంటర్‌నెట్, జియో ఎయిర్‌ ఫైబర్‌ వంటి సేవల విస్తరణకు అవకాశాలు పెరగనున్నాయి. జియో ఇప్పటికే భారీ వినియోగదారులను కలిగి ఉండడంతో పాటు, డిజిటల్‌ సేవలు, ఏఐ ఆధారిత ఉత్పత్తుల ద్వారా కొత్త ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. జియో అభివృద్ధిచేసిన దేశీయ ఏఐ ప్లాట్‌ ఫామ్‌ కూడా దీర్ఘకాల వృద్ధికి తోడ్పడవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. 

జియోను కేవలం టెలికాం సేవల సంస్థగా కాకుండా సొంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌గా కూడా బ్రోకరేజీ సంస్థలు విశ్లేషిస్తున్నాయి.జియో సొంతంగా ఎండ్‌ టు ఎండ్‌ 5జీ స్టాండలోన్‌ టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేసిందని వెంచురా సెక్యూరిటీస్‌ తెలిపింది. 4జీ, 5జీ,6జీ ఏఐ డిజిటల్‌ టెక్నాలజీలకు సంబంధించి 7,220 పేటెంట్‌ దరఖాస్తులను దాఖలు చేసిందని పేర్కొంది. జియో బ్రెయిన్‌ పేరుతో అభివృద్ధి చేసిన సొంత ఏఐ ప్లాట్‌ఫామ్‌ను నెట్‌వర్క్‌ కార్యకలాపాల్లో వినియోగిస్తున్నట్లు వివరించింది. భవిష్యత్తులో ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆదాయాన్ని ఆర్జించే వ్యూహంలో ఇది కీలక భాగమని అభిప్రాయపడింది.

 టెలికాం సేవలు, క్లౌడ్‌ కంప్యూటింగ్, ఏఐ సంస్థలకు అందించే డిజిటల్‌ పరిష్కారాలు ఒకదానితో మరొకటి అనుసంధానమవుతున్న నేపథ్యంలో జియో సొంత ప్లాట్‌ఫామ్‌లు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించగలవని ఎస్‌ఎంసీ గ్లోబల్‌ పేర్కొంది. ఆటోమేషన్‌ పెరగడం ద్వారా నిర్వహణ సామర్ధ్యం మెరుగుపడడంతో పాటు, వినియోగదారులను దీర్ఘకాలం కొనసాగించుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. జియో ఐపీఓకు సబ్‌స్రై్కబ్‌ రేటింగ్‌ ఇచి్చన వెంచురా సెక్యూరిటీస్‌ ఈ సాంకేతిక సామర్థ్యాన్ని కీలక అంశంగా పరిగణించింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement