ఫోన్‌ కాల్స్‌పై కొత్త రూల్‌.. నవంబర్‌ 1 నుంచి అమల్లోకి | Caller Name Display to Be Mandatory from November 1 | Sakshi
Sakshi News home page

ఫోన్‌ కాల్స్‌పై కొత్త రూల్‌.. నవంబర్‌ 1 నుంచి అమల్లోకి

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:41 AM

Caller Name Display to Be Mandatory from November 1

ఫోన్‌ కాల్స్‌ విషయంలో త్వరలో కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇకపై మొబైల్‌కు గుర్తుతెలియని నంబర్‌ నుంచి కాల్‌ వచ్చినప్పుడు, కాలర్‌ పేరు తెలుసుకునే అవకాశం కలగనుంది. కాల్‌ చేస్తున్న వ్యక్తి పేరు, నంబర్‌ ఫోన్‌ తెరపై కనిపించేలా కాలింగ్‌ నేమ్‌ ప్రెజెంటేషన్‌ విధానాన్ని అమలు చేయాలని టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) టెలికాం సంస్థలను ఆదేశించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

కాలింగ్‌ నేమ్‌ ప్రెజెంటేషన్‌ విధానాన్ని(CNAP) నవంబర్‌ 1 నుంచి  అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విధానం ప్రకారం 4జీ, 5జీ వంటి ఆధునిక మొబైల్‌ నెట్‌వర్క్‌ల వినియోగదారులకు సీఎన్‌ఏపీ సేవలను డిఫాల్ట్‌గా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫోన్‌ వచ్చినప్పుడు తెరపై మొదట కాలర్‌ నంబర్‌, ఆ తర్వాత పేరు కనిపిస్తాయి. ఆ నంబర్‌ ఇప్పటికే మన ఫోన్‌లో సేవ్‌ చేసి ఉంటే, కాంటాక్ట్స్‌లో ఉన్న పేరే కనిపిస్తుంది. సేవ్‌ చేయని నంబర్‌ నుంచి కాల్‌ వస్తే, ఆ వ్యక్తి పేరును టెలికాం సంస్థ వద్ద నమోదైన చందాదారుల వివరాల ఆధారంగా చూపిస్తారు.

పేరు ఎక్కడి నుంచి వస్తుంది?
ప్రతి టెలికాం సంస్థ తన వినియోగదారుల పేర్లు, ఫోన్‌ నంబర్లను అనుసంధానిస్తూ ప్రత్యేక డేటాబేస్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. కాల్‌ వచ్చినప్పుడు స్వీకరించే వ్యక్తి నెట్‌వర్క్‌ ఈ డేటాబేస్‌ నుంచి కాలర్‌ వివరాలను సేకరించి ఫోన్‌ తెరపై చూపిస్తుంది. అయితే వ్యాపార, బల్క్‌ కనెక్షన్లకు నిర్దేశించిన నిబంధనల ప్రకారం ధ్రువీకరించిన వ్యాపార పేరును కూడా ప్రదర్శించే అవకాశం ఉంటుంది.

ఇంటర్నేషనల్‌ కాల్స్‌కు స్పెషల్‌
విదేశాల నుంచి వచ్చే కాల్స్‌ విషయంలో తెరపై కాలర్‌ పేరుకు బదులుగా “International Call” అని కనిపిస్తుంది. 2జీ, 3జీ నెట్‌వర్క్‌లతో పాటు ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లకు ఈ విధానాన్ని ఎప్పుడు అమలు చేయాలనే అంశాన్ని ప్రభుత్వం విడిగా పరిశీలించనుంది.

స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పడుతుందా?
ఈ విధానం వల్ల గుర్తుతెలియని నంబర్లను గుర్తించడం సులభమవుతుంది. అయితే ఫోన్‌లో పేరు కనిపించినంత మాత్రాన ఆ కాల్‌ సురక్షితమైనదని భావించకూడదు. మోసపూరిత కాల్స్‌, స్పామ్‌ కాల్స్‌ పూర్తిగా ఆగిపోతాయని కూడా చెప్పలేం. కాబట్టి బ్యాంకు వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్‌లో అడిగితే అప్రమత్తంగా ఉండాలి.

ఇదీ చదవండి: రైల్వే టికెట్లు.. తెరపైకి సరికొత్త డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement