ఈ నెల 27వ తేదీ నుంచే అమలు చేయాలి
రైల్వే బోర్డుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
నవంబర్ 16న చైర్మన్, సభ్యులు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద నేరుగా కొనుగోలు చేసే టికెట్లకు కూడా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులతో సమానంగా బీమా సదుపాయం కల్పించాలని ఆదేశించింది. ఈ సదుపాయాన్ని అక్టోబర్ 27 నుంచే అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. అన్ని రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో విక్రయించే టికెట్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. అమల్లో విఫలమైతే రైల్వే బోర్డుదే బాధ్యత అని హెచ్చరించింది. సాధారణ ప్రజల భద్రత, రైలు ప్రయాణాల సమయంలో జరిగే అవాంఛనీయ ఘటనల నివారణకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహదేవన్ల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
హామీలను ఎందుకు అమలు చేయడం లేదు?
ప్రస్తుతం ఆన్లైన్లో రైల్వే టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు నామమాత్రపు అదనపు మొత్తాన్ని చెల్లించి ప్రయాణ బీమా పొందే అవకాశం ఉంది. అయితే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు ఇదే తరహా సదుపాయం అందుబాటులో లేకపోవడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అనేక మంది ప్రయాణికులు ఇప్పటికీ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల నుంచే టికెట్లు కొనుగోలు చేస్తున్నారని గుర్తు చేసింది. అలాంటి వారికి కూడా ఆన్లైన్ టికెట్ కొనుగోలుదారులతో సమానంగా బీమా రక్షణ కల్పించాల్సిందేనని తెలిపింది.
‘ఈ అంశంపై గత విచారణల్లోనే రైల్వే అధికారులకు తగిన వ్యవస్థను రూపొందించేందుకు సుప్రీంకోర్టు సమయం ఇచి్చంది. అయినప్పటికీ, ఎలాంటి పురోగతి కనిపించలేదు’అని అక్టోబర్ 6న జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రైల్వే బోర్డు చైర్మన్తో పాటు బోర్డు సభ్యులందరూ నవంబర్ 16న మధ్యాహ్నం 3 గంటలకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హామీల అమలులో చిత్తశుద్ది చూపకుంటే రైల్వే బోర్డు చైర్మన్, సభ్యులను వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తామని హెచ్చరించింది.
నిధులున్నా నిర్లక్ష్యం
రైల్వే భద్రతకు సంబంధించిన లక్ష్యాల కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులను సైతం పూర్తిస్థాయిలో వినియోగించలేదని ధర్మాసనం ఎత్తి చూపింది. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ప్రాథమిక అవసరాలను సైతం తగిన స్థాయిలో అమలు చేయకపోవడం ఆందోళనకరమని ధర్మాసనం పేర్కొంది. ప్రమాద నివారణ చర్యలు, భద్రతా వ్యవస్థల అమలు, నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలను సమర్పించాలని రైల్వే శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రైల్వే భద్రతా వ్యవస్థకు సంబంధించిన వివరాలను చీఫ్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ జనక్ కుమార్ గార్గ్ స్వయంగా కోర్టుకు అందజేశారు. అయితే, భద్రతా చర్యల అమలుకు వెచి్చస్తున్న బడ్జెట్ సమాచారం స్పష్టంగా లేకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.


