సూపర్‌ ఎల్‌నినో.. వ‌ర్షాలు మాయం! | How Super El Nino Impact Winter Season in India | Sakshi
Sakshi News home page

Super El Nino: శీతాకాలం శీతకన్ను

Oct 14 2026 6:22 PM | Updated on Oct 14 2026 6:49 PM

How Super El Nino Impact Winter Season in India

ఇన్‌ బాక్స్‌

ప్రకృతి ప్రతిచర్య ప్రారంభమైంది అనడానికి ఈ ‘సూపర్‌ ఎల్‌నినో’, మాయమవుతున్న వర్షాలు నిదర్శనం. సాధారణంగా అక్టోబర్‌ చివరి నుండి పెరగాల్సిన చలి వాతావరణం, రాత్రిపూట కూడా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో శీతాకాలం రూపురేఖలే మారిపో తున్నాయి. పగటివేళ వేడితో పాటు రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం వల్ల రాత్రివేళల్లో భూమి సమర్థవంతంగా చల్లబడలేకపోతోంది. ఇది మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం, చలి వాతావరణం లేకపోవడం వల్ల రబీ పంటల (ప్రత్యేకించి గోధుమ, శనగ వంటి పంటల) దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది.  

చలికాలంలో సైతం అధిక ఉక్కపోత, ఎండ తీవ్రత ఉండటం వల్ల శరీరం త్వరగా నిర్జలీకరణానికి గురవుతుంది. దీనికి తోడు వడదెబ్బ లక్షణాలు కనిపించడం, శ్వాసకోస సంబంధిత సమస్యలు పెరగడం ప్రధాన ముప్పుగా మారింది. శీతాకాలంలో ఉత్తర భారతం నుండి వీచే పొడి, చల్లటి గాలులను ఎల్‌నినో తెచ్చే వేడి అణచివేస్తుండటంతో, పర్వత ప్రాంతాలలో కూడా మంచు కురిసే పరిమాణం గణనీయంగా పడిపోతుంది. ఇది నదుల నీటి ప్రవాహాలపై ప్రభావం చూపుతుంది.

ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హిమాలయాల్లో మంచు పరిమాణం తగ్గుతోంది. ఉన్న మంచు వేగంగా కరిగిపోవడం వల్ల గంగ, యమున, బ్రహ్మపుత్ర వంటి జీవనదుల్లో స్వల్పకాలంలో వరదలు, దీర్ఘకాలంలో తీవ్ర నీటి కొరత ఏర్పడే ప్రమాదం ముంచుకొస్తోంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, వర్షపాతం తగ్గడం వల్ల భూమిలో తేమ ఆవిరైపోతుంది. దీనివల్ల వేసవి ప్రారంభానికి ముందే బావులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. తాగునీరు, సేద్యపు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది.

ఇదీ చ‌ద‌వండి: ప్ర‌పంచ దేశాల‌ అప్పు ఎంతో తెలుసా?

శీతాకాలంలో ఫ్యాన్లు, ఏసీల వాడకం సాధారణంగా తగ్గుతుంది. కానీ ఈ వేడి వాతావరణం వల్ల విద్యుత్‌ వినియోగం గరిష్ట స్థాయికి చేరి గ్రిడ్‌లపై భారం పెరుగుతుంది. చలి వాతావరణం తగ్గినప్పుడు గోధుమ, ఆవాలు, రబీ పప్పు ధాన్యాల నాణ్యత ఉత్పత్తి తగ్గి, భవిష్యత్తులో ఆహార ధాన్యాల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. అంతర్జాతీయంగా ఉద్గారాలను తగ్గించడంతో పాటు, స్థానికంగా హరితహారాన్ని పెంచడం, పర్యావరణ అనుకూల జీవనశైలిని అలవర్చుకోవడం తక్షణ అవసరం. వాతావరణ అత్యవసర పరిస్థితిని మానవాళి ఒక హెచ్చరికగా భావించి, తక్షణమే క్రియాశీలక చర్యలు చేపట్టడమే మనందరి ప్రధాన కర్తవ్యం.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి, సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement