మనం ఆకస్మిక ఆపదలో లేకపోవచ్చు. ఆర్థికవ్యవస్థల విపత్తు విముక్తి అవకాశం తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్–ఐఐఎఫ్) పర్యవేక్షణ ప్రకారం ప్రపంచ అప్పు 365 లక్షల కోట్ల డాలర్లు. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 311 శాతం. పరిణతి చెందిన మార్కెట్ల ప్రభుత్వాలు యాంత్రిక మేధ (ఎఐ), ఇంధనం, రక్షణలపై పెట్టుబడుల కంటే అప్పుల వడ్డీపై ఎక్కువ ఖర్చుపెడుతున్నాయి. వడ్డీ ఆర్థికాంశంగానే లేదు. రాజకీయ సమస్యగా మారింది. అప్పుతో వచ్చే కొద్ది ప్రయోజనం కూడా తగ్గింది. ఎన్నికలు, హ్రస్వకాల శీఘ్ర పరిష్కారాలు, దీర్ఘకాల అపాయాల విష చట్రం ఏర్పడింది. ఐఐఎఫ్ అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అధికాదాయ దేశాల ఆర్థికవ్యవస్థల గురించి ఎక్కువ ఆందోళనచెందుతోంది.
2018–2026 మధ్య ప్రపంచ అప్పు, ఉత్పత్తుల నిష్పత్తి 10 శాతం పెరిగింది. ఉత్పత్తి కంటే అప్పు విపరీతంగా పెరిగింది. ఈ రుణ మాయాజాల ఫలితం ద్రవ్యోల్బణం. ఈ రుణ రూప ద్రవ్యోల్బణం తొలిసారి కాదు. పలు సందర్భాల్లో విజృంభించింది. దేశాలు డబ్బు ముద్రించి తరచుగా అప్పు రద్దు చేసుకుంటాయి. ద్రవ్యోల్బణం పలు దుష్ప్రభావాలను కలిగిస్తుంది. కోవిడ్ ముందు కంటే వడ్డీ రేట్లు పెరగడం వాటిల్లో ఒకటి. పరిణతి చెందిన ఆర్థికవ్యవస్థల్లో ప్రభుత్వాల వడ్డీ మొత్తం విపరీతంగా పెరిగింది. 2021–2026 మధ్య వడ్డీ స్థూల జాతీయోత్పత్తిలో 1.5 శాతం పెరిగి 3.3 శాతానికి చేరింది. అమెరికా వడ్డీ ఖర్చు స్థూల జాతీయోత్పత్తిలో 1.6 శాతం పెరిగింది.
ఇటీవల యాంత్రిక మేధ అనుబంధ కార్పొరేట్ బాండ్ల జారీ బాగా పెరిగింది. మూడేళ్ల క్రితం ఈ బాండ్ల మొత్తం విలువ 9,000 కోట్ల డాలర్లు. 2026 చివరికి 54,100 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. పెట్టుబడుల వృద్ధి అధిక వడ్డీ రేట్లకు, ప్రభుత్వాల అధిక వడ్డీ ఖర్చులకు కారణం. అమెరికా, ఇతర అధికాదాయ ప్రభుత్వాల అప్పులు హ్రస్వకాల పరిమితులకు సరిపోయేవే.
ప్రభుత్వ అప్పు కంటే ప్రైవేటు అప్పు, అధికాదాయ దేశాల అప్పు కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల అప్పు సౌకర్యమని ఐఐఎఫ్ అభిప్రాయం. క్రితం కంటే అధిక వడ్డీ రేట్లతో, ఓటర్ల బుజ్జగింపు ధోరణులతో పరిణతి చెందినవిగా పరిగణించబడుతున్న దేశాల అప్పులు వేగంగా పెరుగుతున్నాయి. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మోసగింపు ముఖస్తుతి సాగుతోంది. రుణ ఖర్చుల నాటకీయ పరిణామాల్లో కప్పగంతులుంటాయి. కరెన్సీ విలువ మరింత తగ్గవచ్చు.
ఇదీ చదవండి: వరసగా 4 ఏళ్లు తెలంగాణలో చదవనందుకు..
విదేశీ రుణాలపై ఆధారపడిన దేశాలు సమస్యల పరిష్కారానికి విదేశీ సహకారాన్ని కోరుతాయి. స్వదేశీ అప్పుతో వృద్ధిచెందుతున్న దేశాల సమస్యలకు పరిష్కారం స్వదేశంలోనే ఉంటుంది. స్వదేశీ రుణాలు తక్కువ వడ్డీ రేట్లకు, తమ అనుకూలతలతో ప్రభుత్వాలకు లభిస్తాయి. అప్పులతో రాజకీయ ప్రమాదాలూ ఉన్నాయి. యుద్ధం, ఆకస్మిక ఇంధన కొరత, వాణిజ్య సంఘర్షణలు వాటిలో కొన్ని. అమెరికాలో అంతర్గత ఘర్షణలు మొదలు కావచ్చు. యూరోపియన్ యూనియన్ లో సహకారం నశించవచ్చు. శాశ్వతంగా కొనసాగలేనిది ఆగిపోతుందని అమెరికన్ ఆర్థికశాస్త్రవేత్త హెర్బర్ట్ స్టీన్ అన్నారు.
ఇదీ చదవండి: కడుపు నిండినా కండ బలమేదీ?!
పెద్ద మొత్తంలో ప్రభుత్వ (ప్రజల) అప్పులు ఎల్లప్పుడూ, ప్రత్యేకించి తీవ్ర సమస్యలు లేనప్పుడు, సమర్థనీయం కాదు. స్టీన్ సూత్రానికి జర్మన్ ఆర్థికశాస్త్రవేత్త రుడిగర్ డోర్న్ బుష్ అనుసూత్రం ఉంది. ‘ఉపద్రవాలు జరగడానికి ఊహించినదాని కంటే ఎక్కువ కాలం పట్టవచ్చు. అవి రాగానే ఊహించినదాని కంటే వేగంగా జరుగుతాయి’. అమెరికా, లాటిన్ అమెరికాల మధ్య సమస్యల సారూప్యత పెరుగుతోంది. అమెరికా విదేశీ రుణదాతలపై కూడా అధికారం చలాయిస్తుంది. ఇకపై ఈ జిమ్మిక్కులు సాగవు.
– సంగిరెడ్డి హనుమంతరెడ్డి
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి


