సందర్భం
భారత్ ఆహార భద్రత నుండి పోషక భద్రత దిశగా ముందుకు సాగుతున్నదా అనే ప్రశ్నలో, ఆహారం అందుబాటులో ఉండటం మాత్రమే సరిపోతుందా లేదా పోషక విలువలతో కూడిన వైవిధ్యమైన ఆహారం అవసరమా అనే రెండు ఉప ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. 1966 నాటి అధిక దిగుబడినిచ్చే వంగడాల కార్యక్రమం... హరిత విప్లవానికి దారితీయడం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచింది.
1966–67 నాటి 7.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి 2025–26 నాటికి 37.66 కోట్ల టన్నులకు చేరుకోగా, ఇదే కాలంలో ముతక ధాన్యాల ఉత్పత్తి 2.4 కోట్ల టన్నుల నుండి 7.5 కోట్ల టన్నులకు; పప్పు ధాన్యాలు 82 లక్షల టన్నుల నుండి 2.74 కోట్ల టన్నులకు; నూనెగింజల ఉత్పత్తి 64 లక్షల టన్నుల నుండి 4.3 కోట్ల టన్నులకు పెరిగింది. గడిచిన 15 సంవత్సరాల కాలంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఐదు రెట్లకు పైగా, నూనె గింజల ఉత్పత్తిలో 8 రెట్లు కంటే ఎక్కువగా పెరుగుదల నమోదైంది. తద్వారా ఆహార కొరత నుండి ఆహార సమృద్ధి దిశగా భారత్ పయనించింది.
సమృద్ధిగా ధాన్యాలు... చాలని పోషకాలు
భారత్ ఆహార భద్రత సాధించినప్పటికీ ఆరోగ్య భద్రత, మానవ మూలధన అభివృద్ధి (విద్య, ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ) పూర్తిగా సాధ్యం కాకపోవడానికి పోషక భద్రత లేకపోవడం కారణమయింది. ఆహార భద్రత సాధన విషయంలో కేవలం ఆహార లభ్యత మాత్రమే కాకుండా పోషక సమృద్ధి దిశగా, కేలరీల నుండి పోషకాలపైనా భారత్ దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. భారత్ ఆహార భద్రతా విధానం కేలరీలు, ముఖ్యంగా తృణ ధాన్యాలపై కేంద్రీకృతమయింది.
దేశంలో ఆహార కొరత, ఆకలితో అలమటించే ప్రజలు అధికంగా ఉన్నప్పుడు ఈ విధానం సరైనదే కానీ, భారత్ ప్రస్తుతం ఆహార సమృద్ధితో ఉన్నందు వల్ల కేలరీల లోపం నుండి, నిరంతరంగా కొనసాగుతున్న బాలల పోషకాహార లోపం, పెరుగుతున్న అధిక బరువు వంటి సవాళ్లపై దృష్టి సారించాలి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–1 నుండి, సర్వే–6 వరకు పోషక భద్రతకు సంబంధించిన కొన్ని సూచీలు మెరుగుపడినప్పటికీ.. ఇప్పటికీ రక్తహీనత, పోషకాహార లోపం, పిల్లల్లో తక్కువ బరువు; ఎదుగుదల, సూక్ష్మ పోషకాల లోపాలు తీవ్ర స్థాయిలో ఉండటాన్ని గమనించాలి.
సర్వే–5 (2019–21) ప్రకారం 5 సంవత్సరాల లోపు పిల్లలలో వయస్సుకు తగ్గ ఎత్తు లేనివారు 35.5 శాతం ఉండగా; సర్వే–6 (2023–24)లో ఎత్తుకు తగ్గ బరువు చాలా తక్కువగా ఉండటం అన్నది 7.7 శాతం నుండి 5.2 శాతానికి తగ్గింది. ఇదే కాలంలో 15–49 ఏళ్ల మధ్య వయసులోని మహిళలలో అధిక బరువు కలిగినవారు 24 శాతం నుండి 30.7 శాతానికి, పురుషులలో 22.9 నుండి 27.3 శాతానికి పెరగటం నమోదైంది. 6–59 నెలల మధ్య వయసులోని చిన్నారులకు సర్వే–4 లో 58.6 శాతం మందిలో రక్తహీనత ఉండగా, సర్వే–5 లో అది 67.1 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో 15–19 సంవత్సరాల వయో పరిమితిలోని కౌమార బాలికలలో రక్తహీనత కలిగినవారి శాతం 59 శాతానికి పెరిగింది.
మెరుగైన సూచికలు... తొలగని సవాళ్లు
సర్వే–1 నుండి సర్వే–6 వరకు మొత్తం సంతానోత్పత్తి రేటు, ఆసుపత్రి ప్రసవాలు, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సమక్షంలోని పురుళ్లలో మెరుగుదల కనిపించింది. అలాగే 5 సంవత్సరాల లోపు పిల్లలలో తక్కువ బరువు సూచికలకు సంబంధించి ప్రగతి సాధ్యమయింది. పట్టణీకరణ, మహిళల విద్య, కుటుంబ నియంత్రణపై అవగాహన , వివాహ వయస్సు పెరగడం కారణంగా మొత్తం సంతానోత్పత్తి రేటు సర్వే–1 లోని 3.4 శాతం నుండి సర్వే–6 లో 2.0కు తగ్గింది.
ఇదే కాలంలో ఆసుపత్రి ప్రసవాలు 26.1 శాతం నుండి 90.6 శాతానికి పెరగడానికి ఆసుపత్రి ప్రసవాల ప్రోత్సాహకాలు, అత్యవసర సేవల అందుబాటు కారణాలుగా నిలిచాయి. శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సమక్షంలో ప్రసవాలు 91.2 శాతానికి పెరగడానికి తగిన వైద్య సహాయం అందించే సామర్థ్యం పెరగడం కారణం కాగా, 5 సంవత్సరాల వయోవర్గంలోపు పిల్లలలో తక్కువ బరువు కలిగిన వారి శాతం 53.4 శాతం నుండి 31.8 శాతానికి తగ్గడానికి పిల్లలకు పోషకాహారం అందుబాటులో రావటం కారణం అయింది. అయితే పోషక భద్రతకు సంబంధించిన సూచికలలో పురోగతి ఉన్నప్పటికీ, పోషకాహార సమస్య మాత్రం పూర్తిగా తొలగిపోలేదు.
ప్రపంచ ఆహార భద్రత, పోషకాహార స్థితి నివేదిక ప్రకారం, భారత్ సమతుల్యమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్న జనాభా 2023–25 నాటికి 14.25 కోట్లుగా ఉంది. ప్రతి వ్యక్తికి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని పొందడానికి అయ్యే వ్యయం ప్రతి రోజుకు సుమారు 350 రూపాయలుగా ఉంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేసే స్థోమత లేని వారు దేశ జనాభాలో 35.5 శాతంగా ఉన్నారని నివేదిక పేర్కొంది.
కాగా, ఆహార భద్రతా చట్టం క్రింద ప్రజా పంపిణీ వ్యవస్థ దేశవ్యాప్తంగా 5.4 లక్షలకు పైగా చౌక ధరల దుకాణాల ద్వారా 80.67 కోట్ల మందికి ఆహార ధాన్యాలను అందిస్తోంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి సూక్ష్మ పోషకాలను అందించే లక్ష్యంగా పోషక విలువలతో కూడిన బియ్యం, వంటనూనె, గోధుమ పిండిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్య్ర రేఖ దిగువన ఉన్నవారికి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
పోషక వైవిధ్య ఆహారం అత్యవసరం
ప్రజా పంపిణీ వ్యవస్థతో పాటు ‘మధ్యాహ్న భోజన పథకం’, ‘పోషణ్ ట్రాకర్’ వ్యవస్థ, ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’, ‘సక్షం అంగన్వాడీ’, ‘సక్షం అంగన్వాడీ పోషణ్ 2.0’ వంటి అనేక ప్రభుత్వ పథకాలు పౌష్టికాహార భద్రత సాధనలో నిమగ్నమయినప్పటికీ, ఆహార భద్రత నుండి పోషక భద్రతకు మార్పు నెమ్మదిగా ఉంది. వ్యవసాయ ఉత్పత్తి విధానంలో మార్పు వేగంగా లేకపోవటం ఆహార వైవిధ్యం లోపించడం, ఆహార భద్రతా విధానంలో ఇప్పటికీ ధాన్యాల పాత్ర ప్రాథమికంగా ఉండటం, పోషకాల లోపం, బయో ఫోర్టిఫైడ్ వంగడాల వినియోగం తక్కువగా ఉండటం, సామాజిక అసమానతలు వంటివన్నీ ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఒకే పంట ఆధారిత ఆహారం నుండి వైవిధ్యమైన ఆహారం వైపు మరలడం పోషకాహార భద్రతకు అవసరం. ఈ క్రమంలో మార్కెట్ ధరలలో అనిశ్చితి తొలగించడం, నీటి వినియోగం, నిల్వ సౌకర్యాలు, కోల్డ్ చైన్‌ల ఏర్పాటు, చిన్న సన్నకారు రైతులకు సంస్థాగత పరపతి లభ్యత, నూతన పంటలకు తగిన ఉత్పాదకాలను, ప్రాంతాలకు అనుగుణంగా వ్యవసాయ విధానాన్ని రూపొందించడం వంటి చర్యలు వైవిధ్యమైన ఆహార ఉత్పత్తులకు దోహదపడతాయి. 
– డా. తమ్మా కోటిరెడ్డి, వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు
ఇదీ చదవండి: ఆచి తూచి ‘రిజర్వ్’ అడుగు!


