పూజించడం కాదు, అనుసరించాలి! | Indian Constitution Preamble Democracy Equality | Sakshi
Sakshi News home page

పూజించడం కాదు, అనుసరించాలి!

Nov 26 2026 7:43 AM | Updated on Nov 26 2026 7:43 AM

Indian Constitution Preamble Democracy Equality

సందర్భం

రాజ్యాంగ పీఠికను మంత్రంలా వల్లించడం కాదు, అందులోని ‘మౌలిక స్వరూ పాన్ని’ ఆచరణలో నిలబెట్టుకోవడమే నేటి తక్షణ అవసరం. రాజ్యాంగం అంటే కేవలం గౌరవించి పక్కన పెట్టి, పట్టు కాషాయ వస్త్రంతో అలంకరణం చేసి అటక మీద పెట్టే పవిత్ర గ్రంథం కాదు; అది ప్రతి సామాన్యుడి ఆత్మగౌరవానికి, హక్కులకు రక్షణ కవచం.

ఒక భవనానికి నాలుగు గోడలు, స్తంభాలు ఎలా పునాదిగా నిలుస్తాయో, భారత ప్రజాస్వా మ్యానికి రాజ్యాంగపు ‘మౌలిక స్వరూపం’ అటువంటిది. ఆ మౌలిక స్వరూపం ఎక్కడో లేదు, రాజ్యాంగ పీఠికలోని ప్రతి అక్షరంలోనూ సజీవంగా ఉంది. రాజ్యాంగం ‘భారత ప్రజలమైన మేము’ అని ప్రారంభమవుతుంది. ‘భారత ప్రజలమైన’ అంటే ఏ ఒక్క మతం, కులం, వర్గానికి చెందినవారు అని కాకుండా దేశంలో ఉన్న సమస్త జనమూ అని అర్థం.

ప్రజలు అంటే కేవలం పౌరసత్వం పొందిన మనుషులే కాదు. ఆర్టికల్‌ 21 ప్రకారం మానవులకు అనే మాట వర్తిస్తుంది. ఆర్టికల్‌ 19(1)ఎ కింద పౌరులకు మాత్రమే హక్కులని రాసుకున్నారు. ఇదో పెద్ద లోపం. పీఠికలో ‘టు సెక్యూర్‌ టు ఆల్‌ ఇట్స్‌ సిటిజన్స్‌’ అన్నప్పుడు ఏ ఒక్కరినీ మినహాయించకుండా అందరికీ న్యాయం అందించడం అని అర్థం. ప్రతి ఒక్కరికీ ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ ఉంటాయి. మరొక కీలకమైన అంశం రెండు రకాల సమానత్వం గురించి ప్రస్తావిస్తున్నది పీఠిక: హోదాల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వం ఉండాలి. అలాగే గౌరవంలో కూడా.

నా నుంచి మనం
రాజ్యాంగ పీఠికను లోతుగా పరిశీలిస్తే అందులో కీలక సూత్రాలు మనకు దిశానిర్దేశం చేస్తాయి. సోదరత్వమే మన రాజ్యాంగపు అసలైన బలం. మనమందరం ఒకే కుటుంబ సభ్యులమనే స్నేహభావం, సోదరత్వమే అసలైన పునాది. వరంగల్లులో ‘జనధర్మ’ వారపత్రిక సంపాదకులు ఎమ్‌.ఎస్‌. ఆచార్య షష్టిపూర్తి సందర్భంగా ప్రజాకవి కాళోజీ అభినందన సంచికను ప్రచురించారు.

ఈ రచయిత ఆ సభానిర్వహణలో పాలుపంచుకున్నాడు. అందరి ఉపన్యాసాలు విన్న తరువాత, చివరి సమగ్రమైన ప్రసంగం చేసిన కాళోజీ... ‘‘నేను ఇంకా ‘నా’ నుంచి ‘మా’ దాకా రాలేదు... ‘మనం’ అన్నప్పుడు కదా అసలైన ప్రజాస్వామ్యం!’’ అని అన్న మాట పీఠిక ఆశించే సమష్టి తత్వానికి అసలైన నిర్వచనం.

రాజ్యాంగ పీఠికలో ఎక్కడా ‘లీగల్‌ జస్టిస్‌’ అని రాయలేదు; కేవలం ‘జస్టిస్‌’ (న్యాయం) అని మాత్రమే రాశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు చట్టంలోని సాంకేతిక పద జాలానికే పరిమితమైతే సామాన్యుడికి నిజమైన న్యాయం అందదు. ఆర్టికల్‌ 16 వంటి సమాన అవకాశాల హామీలు కేవలం కాగితపు వాగ్దానాలుగా మిగిలిపోకుండా, అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపినప్పుడే రాజ్యాంగ లక్ష్యం నెరవేరుతుంది.

ఆర్టికల్‌ 19(1)ఎ లోని భావప్రకటనా స్వేచ్ఛ పౌరులకు వర్తిస్తే, ఆర్టికల్‌ 21 ప్రసాదించే జీవించే హక్కు పౌరసత్వంతో సంబంధం లేకుండా ఈ నేలపై ఊపిరి పీల్చుకునే ప్రతి మనిషికీ వర్తిస్తుంది. మన రాజ్యాంగ నిర్ణాయక సభలో 1949 నవంబర్‌ 26న ఈ రాజ్యాంగాన్ని ‘స్వీకరించి, శాసనీకరించి, ఆమోదించి’ మనకు మనము సమర్పించుకున్నాము. ఇది భారత గీతం, భారత కావ్యం, భగవద్గీత.

- ప్రొ. మాడభూషి శ్రీధర్‌, వ్యాసకర్త, కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement