హమ్మయ్యా... గండం గడిచింది! | Train crew averts major disaster amid massive OHE failure in West Bengal | Sakshi
Sakshi News home page

హమ్మయ్యా... గండం గడిచింది!

Nov 26 2026 6:36 AM | Updated on Nov 26 2026 6:36 AM

Train crew averts major disaster amid massive OHE failure in West Bengal

శబ్ధ భేదీ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

తెగిపడ్డ హై ఓల్టేజీ రైల్వే తీగ

సకాలంలో గుర్తించిన లోకో పైలట్‌

న్యూఢిల్లీ: కారుచీకటి.. కుండపోత వర్షం.. గంటకు 128 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న రైలు.. కళ్లముందే తెగిపడి వేలాడుతున్న హై ఓల్టేజ్‌ విద్యుత్‌ తీగలు! క్షణం ఆలస్యమైనా సరే వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ రైలు డ్రైవర్‌ అప్రమత్తత, సిబ్బంది చాకచక్యం పుణ్యమా అని ఓ ఘోర విపత్తును అడ్డుకున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా – బర్ధమాన్‌ లైన్‌లో ‘శబ్ద భేది ఎక్స్‌ప్రెస్‌’ నవంబర్‌ 19న ఇదే పరిస్థితిని ఎదుర్కొందని, తృటిలో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు బుధవారం వెల్లడించారు.

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా చిత్‌పూర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ సిటీ మధ్య నడిచే వీక్లీ రైలు ‘శబ్ద భేది ఎక్స్‌ప్రెస్‌’. భారీ వర్షాల మధ్య నవంబర్‌ 19న హౌరా – బర్ధమాన్‌ మధ్య వెళుతోంది. రైల్వేలైన్‌ వెంబడి మొత్తం చిమ్మచీకటి. అలాంటి పరిస్థితుల్లోనూ రైలు గంటకు సుమారు 128 కి.మీ. వేగంతో వెళుతోంది. రాత్రి పదకొండు గంటల సమయంలో రైలు లోకో పైలట్, అసిస్టెంట్‌ లోకో పైలట్లకు పట్టాలపై ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించింది.

 ఇంజిన్‌కు విద్యుత్‌ సరఫరా చేసే ఓవర్‌హెడ్‌ ఎక్విప్‌మెంట్‌ కుప్పకూలి, వేల ఓల్టుల విద్యుత్తు కలిగి ఉండే కాంటాక్ట్‌ వైర్‌ ఊగిపోతూన్నట్లు వీరు గుర్తించారు. ఆ కాంటాక్ట్‌ తీగా రైలును తాకితే అంతే సంగతులు. రైలు మొత్తం షాక్‌కు గురయ్యే అవకాశముంది. ముంచుకొస్తున్న పెను ప్రమాదాన్ని గుర్తించిన లోకో పైలట్‌ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. ఫలితంగా గంటకు 128 కి.మీ. వేగంతో దూసుకెళ్తున్న రైలు కీచు శబ్ధాలతో వేలాడుతున్న కరెంటు తీగకు కిలోమీటర్‌ దూరంలోనే ఆగిపోయింది.

రెండు కిలోమీటర్ల విధ్వంసం 
రైలు పూర్తిగా నిలిచిపోయే సమయానికి ఆ ప్రాంతంలో దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకూ ఓవర్‌హెడ్‌ ఎక్విప్‌మెంట్‌ ధ్వంసమై ఉందని రైల్వే అధికారులు తెలిపారు. కాంటాక్ట్‌ వైర్‌కు ఆధారంగా ఉండే క్యాటనరీ వైర్‌ తెగిపడి  రైలు చక్రాలు, బోగీలకు చుట్టుకుపోయిందని, తీగలను మోసుకొచ్చే ‘వీ’ ఆకారపు టూ–ట్రాక్‌ క్యాంటిలివర్‌ నిర్మాణం, ఇతర వ్యవస్థలన్నీ వేలాడుతూ కనిపించాయని వారు వివరించారు. ఓహెచ్‌ఈ తీగలు సుమారు 2 కిలోమీటర్ల మేర ధ్వంసమైనట్లు చెప్పారు. సకాలంలో బ్రేకులు వేయకపోయి ఉంటే ఇంజన్, బోగీలు, రైల్వే మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లడంతో పాటు ప్రాణనష్టం జరిగేదని అధికారులు తెలిపారు. సిబ్బంది అప్రమత్తత కారణంగా ఇంజిన్‌ నేరుగా ఓహెచ్‌ఈ తీగలలో చిక్కుకోలేదని చెప్పారు. ఈ ఘటనలో కొన్ని బోగీల అద్దాలు మాత్రమే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రతికూల వాతావరణంలోనూ సమయస్ఫూర్తితో వ్యవహరించి పెను ప్రమాదాన్ని నివారించిన లోకో పైలట్లను ఇప్పుడు అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement