డ్రైవింగ్‌ లైసెన్స్‌ రూల్స్‌లో మార్పులు! | Learner Driving Licence Test To Get Tougher Under New Government Proposal | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్‌ లైసెన్స్‌ రూల్స్‌లో మార్పులు!

Oct 25 2026 9:08 PM | Updated on Oct 25 2026 9:18 PM

Learner Driving Licence Test To Get Tougher Under New Government Proposal

భారతదేశంలో డ్రైవింగ్‌ లెర్నర్స్‌ లైసెన్స్‌ తీసుకోవాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, డ్రైవింగ్‌ చేసేవారికి ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా కొన్ని కీలక మార్పులను ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కొత్త ప్రతిపాదనల ప్రకారం..  డ్రైవింగ్‌ ట్యుటోరియల్‌ టెస్టులో ఉత్తీర్ణత మార్కులను 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని నిర్ణయించింది. అంతే కాకుండా.. ట్యుటోరియల్‌ను పూర్తి చేయడానికి కనీసం 30 నిమిషాల సమయం కేటాయించాలని ప్రతిపాదించింది. అయితే.. ఇవన్నీ ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి.

లెర్నర్స్‌ లైసెన్స్‌ పరీక్షలో మార్పులు
కేంద్ర మోటారు వాహన నియమాల ప్రకారం.. డ్రైవింగ్‌ ట్యుటోరియల్‌ను పూర్తి చేయడానికి ఏడు రోజుల గడువు ఉండగా, దాన్ని 15 రోజులకు పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. దీంతో దరఖాస్తుదారులకు ట్యుటోరియల్‌ పూర్తి చేసేందుకు మరింత సమయం లభిస్తుంది.

గతంలో లెర్నర్స్‌ లైసెన్స్‌ పొందినవారు లేదా డ్రైవింగ్‌ స్కూల్‌ నుంచి సర్టిఫికెట్‌ ఉన్నవారికి ఇచ్చే మినహాయింపులను తొలగించాలని కూడా ప్రతిపాదించారు. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, సంబంధిత దరఖాస్తుదారులు కూడా నిర్దేశించిన ట్యుటోరియల్‌, పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఆధార్‌తో ఉచిత సేవలు
డ్రైవింగ్‌ లైసెన్స్‌కు సంబంధించిన కొన్ని సేవలను ఆధార్‌ ఆధారిత ఆన్‌లైన్‌ ధ్రువీకరణ ద్వారా ఉచితంగా అందించాలని కేంద్రం భావిస్తోంది. లైసెన్స్‌లో పేరు లేదా ఇతర వ్యక్తిగత వివరాలను మార్చుకోవడం, చిరునామా, మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీని అప్‌డేట్‌ చేసుకోవడం వంటి సేవలకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే లైసెన్స్‌ వివరాలను సవరించుకునే సమయంలో వాహనదారులకు కొంత ఖర్చు తగ్గుతుంది.

కావలసిన డాక్యుమెంట్స్
లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ చిరునామా, వయస్సు, గుర్తింపుకు సంబంధించిన డాక్యుమెంట్స్ జాబితాలోనూ మార్పులు ప్రతిపాదించారు. ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌, ఈ-రేషన్‌ కార్డు, పాన్‌ కార్డు, నిర్దిష్ట ప్రభుత్వ ఉద్యోగ లేదా పెన్షన్‌ పత్రాలను సంబంధిత అవసరాలకు అనుగుణంగా అంగీకరించనున్నారు.

కరెంట్ బిల్లు, ఇంటి గ్యాస్‌ బిల్లు వంటి పత్రాలను చిరునామా ధ్రువీకరణ కోసం సమర్పించవచ్చు. అయితే.. అవి మూడు నెలలకు మించకుండా జారీ చేసినవై ఉండాలి. వయస్సు నిర్ధారణకు పాస్‌పోర్ట్‌, బర్త్ సర్టిఫికెట్, గుర్తింపు పొందిన విద్యాసంస్థ జారీ చేసిన మార్కుల జాబితా లేదా సర్టిఫికెట్‌ వంటి పత్రాలను కూడా ప్రతిపాదిత జాబితాలో చేర్చారు.

లైసెన్స్‌ కార్డులలోనూ మార్పులు
డ్రైవింగ్‌ లైసెన్స్‌లను లామినేట్‌ చేసిన కార్డులు లేదా పీవీసీ కార్డుల రూపంలో అందించేలా కొత్త ఫార్మాట్‌ను ప్రతిపాదించారు. అయితే భారతీయులకు ఒక విధంగా.. విదేశీ పౌరుల కోసం వేర్వేరు ఫార్మాట్లు ఉండనున్నట్లు సమాచారం.

లైసెన్స్‌లో వివరాలను మార్చుకోవాలనుకునేవారు అవసరమైన ఆధారాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు 15 రోజుల్లో దరఖాస్తును ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. తిరస్కరిస్తే.. అందుకు కారణాలను కూడా నమోదు చేయాలి. చిరునామా మార్చుకోవడం కోసం అప్లై చేసుకుంటే.. దానిపై సంబంధిత అధికారులు 30 రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే, అది ఆమోదం పొందినట్లుగా పరిగణించేలా ప్రతిపాదించారు.

కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి?
ప్రస్తుతం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలు మాత్రమే. వీటిపై ప్రజలు, సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి 30 రోజుల సమయం ఇవ్వనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని అధికారిక గెజిట్‌లో ప్రచురించినప్పుడు నిబంధనలు అమల్లోకి వస్తాయి. కాబట్టి లెర్నర్స్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ప్రస్తుత నిబంధనలనే పాటించాలి. కొత్త మార్పులు ఖరారైన తర్వాత పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు, అవసరమైన పత్రాలు, ఇతర సేవలకు సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత రానుంది.

ఇదీ చదవండి: వెండి ధరల్లో కలకలం.. కొనేవారికి బిగ్‌ అప్‌డేట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement