ఆడపిల్ల పుట్టిందని అమ్మేశాడు!

Two months young children sold for Rs 15000 - Sakshi

రూ.15 వేలకు రెండు నెలల చిన్నారి విక్రయం 

పోలీసులను ఆశ్రయించిన తల్లి

షాద్‌నగర్‌ రూరల్‌: ఆడపిల్లల భవిష్యత్‌కు ప్రభుత్వాలు ఎంత భరోసా కల్పిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. కొందరు ఆడపిల్ల పుట్టిందని తెలియగానే అమ్మేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో ఆడపిల్ల పోషణ భారమవుతుందని భావించిన ఓ తండ్రి రెండు నెలల పసికందును ఇలానే అమ్మేశాడు. ఘటన రంగారెడ్డి జిల్లా చౌలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మేకంగుట్ట తండాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం గుడ్డి రుక్యాతండాకు చెందిన హస్లీబాయికి రెండేళ్ల క్రితం మేకంగుట్ట తండాకు చెందిన కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. మొదటి కాన్పులో హస్లీబాయి ఆడపిల్లకు జన్మనిచ్చింది. రెండు నెలల క్రితం మరో కాన్పులో మళ్లీ ఆడపిల్ల పుట్టింది. మొదటిసారి ఆడపిల్ల జన్మించినప్పటి నుంచి కుమార్‌ భార్యతో తరచూ గొడవపడుతూనే ఉన్నాడు. రెండవ కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో మరింత ఘర్షణ పడటం ప్రారంభించాడు. రెండో ఆడపిల్ల మనకు వద్దని, అమ్మేద్దామని భార్యను వేధించసాగాడు. రెండు నెలల పసికందును కుమార్‌ వదిలించుకునేందుకు యత్నించాడు. మానవత్వాన్ని మరిచి కన్నకూతురిని అంగట్లో అమ్మకానికి పెట్టాడు. హైదరాబాద్‌కు చెందిన వారికి రూ.15 వేలకు అమ్మేశాడు. పసిపాపను ఏం చేశావని హస్లీ ప్రశ్నిస్తే చంపుతానని బెదిరించాడు.  

పోలీసులను ఆశ్రయించడంతో.. 
కుమార్‌కు హస్లీ కంటే ముందే ఫరూఖ్‌ నగర్‌ మండలం వెలిజర్ల పరిధిలోని వెంకన్నగూడ తండాకు చెందిన బుజ్జితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. కుటుంబ కలహాల నేపథ్యంలో బుజ్జి కొన్నేళ్ల నుంచి కుమార్‌కు దూరంగా ఉంటోంది. తర్వాత హస్లీబాయిని రెండవ వివాహం చేసుకున్నాడు. కాగా తనను బెదిరించి రెండు నెలల పసికందును తన భర్త అమ్మేశాడని హస్లీబాయి షాద్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించింది. తన ప్రమేయం లేకుండా చిన్నారిని అమ్మేశాడని, తన బిడ్డను ఇప్పించాలని పోలీసులను వేడుకుంది. దీనిపై దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top