కర్ణాటక హైకోర్టులో 33 ఏళ్ల క్రితం నమోదైన భూ వివాద కేసులో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి అప్పటికే ఐదేళ్ల క్రితమే మృతి చెందినట్లు కోర్టు గుర్తించింది. 1993లో సి.మరియప్ప పేరుతో రిట్ పిటిషన్ దాఖలు కాగా.. 1988 ఆగస్టులోనే మరణించినట్లు విచారణలో వెల్లడైంది. వివరాలు ఇలా.. మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకా బెళవాడి గ్రామంలోని 4 ఎకరాల 21 గుంటల భూమికి సంబంధించిన వివాదం ఇది. 1981లో ల్యాండ్ ట్రిబ్యునల్ సి.నింగమ్మకు భూమిపై హక్కులు కల్పించింది.
ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 1993లో మరియప్ప పేరుతో కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. మరియప్పకు పవర్ ఆఫ్ అటార్నీ ఉన్న వ్యక్తి ద్వారా పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టు రికార్డుల్లో ఉంది. 2001లో హైకోర్టు ఆ పిటిషన్‌ను అంగీకరించి, విషయాన్ని పునఃపరిశీలించేందుకు ల్యాండ్ ట్రిబ్యునల్‌కు తిరిగి పంపింది. అనంతరం ల్యాండ్ ట్రిబ్యునల్ 2023లో ఇచ్చిన ఆదేశాలను మరియప్ప చట్టబద్ధ వారసుడు హైకోర్టులో సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతివాదుల తరఫు న్యాయవాది కీలక విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 1993లో పిటిషన్ దాఖలు చేసే సమయానికే మరియప్ప మరణించి ఉన్నారని తెలిపారు. దీనిపై పరిశీలన జరిపిన హైకోర్టు.. ఆ వాదనలో వాస్తవం ఉందని గుర్తించింది.
మరియప్ప కుమార్తె సుమలమ్మ గతంలో ల్యాండ్ ట్రిబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో కూడా తన తండ్రి చాలా ఏళ్ల క్రితమే మరణించినట్లు పేర్కొన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. అయితే ఆయన మరణించిన ఖచ్చితమైన తేదీని అఫిడవిట్‌లో వెల్లడించలేదని పేర్కొంది. మరణించిన వ్యక్తి పేరుతో 1993లో రిట్ పిటిషన్ దాఖలు చేయడం ఎలా సాధ్యమైందన్న దానిపై పిటిషనర్ తరఫు న్యాయవాది నుంచి సమర్థవంతమైన వివరణ రాలేదని న్యాయమూర్తి ఈ.ఎస్.ఇందరేశ్ అభిప్రాయపడ్డారు. మరణించిన వ్యక్తి పేరుతో అనంతరం పిటిషన్ దాఖలు చేయడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
చదవండి: మాట వినకపోతే కాల్చి పారేస్తా


