సాక్షి, నగరి: నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. నగరి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ ఏడు వార్డులను కైవసం చేసుకోగా, పుత్తూరు మున్సిపాలిటీలో నాలుగు వార్డుల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. నగరిలో 3, 15, 18, 23, 26, 28, 38 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. పుత్తూరులో 4, 27, 29, 36 వార్డుల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.
ఈ సందర్భంగా విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మాజీ మంత్రి ఆర్కే రోజాను కలిశారు. వారిని రోజా అభినందించారు. అనంతరం ఆమె కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల నామినేషన్ల సమయంలో తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకున్నారని ఆరోపించారు. రౌడీయిజం, గూండాయిజంతో అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. మూడు పార్టీలు కలిసి వైఎస్సార్‌సీపీపై పోటీ చేశాయని వ్యాఖ్యానించారు.

అయినప్పటికీ తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన వార్డుల్లో భారీ మెజార్టీలు సాధించారని రోజా తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, నారా లోకేష్ తీరుపై విమర్శలు గుప్పించారు. పోలీసులను, అధికారులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం ఈ విజయాలు సాధించిందని రోజా ఆరోపించారు. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని ఆమె స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. రౌడీ రాజకీయాలకు ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలని రోజా పిలుపునిచ్చారు.


