సాక్షి,నంద్యాల: జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటింది. ముఖ్యంగా నందికొట్కూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 32 వార్డులకు గాను, ఏకంగా 23కి పైగా వార్డులను కైవసం చేసుకుంది. ఈ భారీ విజయంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు జరుపుకున్నారు. పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఇక నంద్యాల జిల్లాలోని బేతంచర్ల నగర పంచాయతీ కౌంటింగ్‌లోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. మొదటి రౌండ్ ముగిసే సమయానికి మొత్తం 28 వార్డులకు గాను 18 వార్డులలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. బేతంచర్లలోనూ పార్టీ అభ్యర్థుల విజయం లాంఛనప్రాయమేననే సంకేతాలు వెలువడుతుండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది.
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వ్యూహాంతో
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార పర్వం మొదలుకొని ప్రతి అడుగులోనూ కేడర్‌ను ముందుండి నడిపిస్తూ స్థానిక రాజకీయాలను సమన్వయం చేసిన ఆయన వ్యూహం ఈ ఎన్నికల్లో మరోసారి సక్సెస్ అయింది. ఈ ఫలితాలతో నందికొట్కూరు గడ్డపై పార్టీ పట్టు నిరూపితమైందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి : కుప్పంలో టీడీపీకి ఎదురుగాలి


