అనకాపల్లి: నాడు అత్త జెడ్పీటీసీగా ఈ ప్రాంత ప్రజలకు సేవలందించగా, ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన కోడలు జెడ్పీటీసీగా బరిలో నిలిచారు. మునగపాక గ్రామానికి చెందిన ఆడారి సరోజిని 2001లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి జెడ్పీటీసీగా విజయం సాధించారు. సరోజిని గెలిచిన తరువాత ఐదేళ్ల కాలంలో మండల ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ అందరి మన్ననలు అందుకున్నారు. నేడు అదే కుటుంబం నుంచి పెద్ద కోడలైన ఆడారి కమల ప్రియ మునగపాక మండల జెడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీలో ఉన్నారు.
గత కొద్ది రోజులుగా కమల ప్రియతో పాటు భర్త శ్రీకాంత్, అత్తమామలు సరోజిని, సత్యనారాయణలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. కమల ప్రియ కుటుంబ సభ్యులు కూడా తమకున్న పరిచయాలతో పాటు వైఎస్సార్‌సీపీకి చెందిన పెద్దలను కలుపుకొంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ జెడ్పీటీసీ అభ్యర్థి కమలప్రియ విజయానికి కృషి చేస్తున్నారు. గతంలో తన అత్త సరోజిని విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరూ తన విజయంలో కూడా భాగస్వాములు కావాలంటూ కమలప్రియ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మొత్తం మీద నాడు అత్త జెడ్పీటీసీగా పనిచేయగా, నేడు కోడలు జెడ్పీటీసీగా విజయం సాధించేందుకు కృషి చేస్తున్నారు.
ఇదీ చదవండి: కూటమికి షాకిచ్చిన ఉద్యోగులు


