సాక్షి, పులివెందుల: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో వెన్నుపోటు పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పులివెందులలో బరి తెగించిందని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో యథేచ్ఛగా రిగ్గింగ్ చేసి జర్నలిస్టులపై కూడా దాడులు చేసిందన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ‘ఇండియా టుడే ఛానల్’ డిబేట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వెన్నుపోటు పార్టీ ముఖ్యంగా పులివెందులలో బరి తెగించింది. ఎన్నికల ప్రక్రియను కవర్ చేయడానికి వచ్చిన ఇండియా టుడే ప్రతినిధి అబ్దుల్ బషీర్, వీడియో జర్నలిస్ట్ ఎస్.విజయ్‌పై వెన్నుపోటు పార్టీ మూకలు అమానుషంగా దాడి చేశాయి. అలాగే, వీడియో కెమెరాను ధ్వంసం చేశాయి.
పులివెందులలో జర్నలిస్టులపై వెన్నుపోటు పార్టీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై దాడులకు ఏ మాత్రం తావు లేదు. తమ అరాచకాలు బట్టబయలవుతున్నాయన్న ఉక్రోషంతో వెన్నుపోటు పార్టీ మూకలు చివరకు జర్నలిస్టులపైనా దాడికి తెగబడుతున్నాయి. ఇది ఏ మాత్రం సరికాదని ఆయన అన్నారు.
పోలింగ్ రోజు అడుగుడుగునా అరాచకం..
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఎక్కడికక్కడ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై అత్యంత దారుణంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున మరింత బరి తెగించింది. పోలింగ్ బూత్‌ల నుంచి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను తరిమేసి యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అలాగే, పులివెందులలో 80 పోలింగ్ బూత్‌లు ఉంటే, 70 బూత్‌ల నుంచి వైఎస్సార్‌సీపీ పార్టీ ఏజెంట్లను తన్ని తరిమేశారంటే, ఏ స్థాయిలో ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం దుర్మార్గం చేసిందనేది స్పష్టమవుతుందని, అందుకే పులివెందులలో రీపోలింగ్ జరపాలని ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.
అంతా కుమ్మక్కయ్యారు..
వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యకర్తలను భయపెట్టేందుకు, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకునేందుకు ఏకంగా పోలీసులను ఉపయోగించారు. స్థానిక ఎన్నికల్లో అరాచకాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అంటే పోలీసులు, ఎస్‌ఈసీ ప్రభుత్వం అంతా ఒక్కటై, కుమ్మక్కై యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. పులివెందులకు 1000 మంది పోలీసులను రప్పించింది.. ఎన్నికలను సజావుగా జరపడం కోసం కాదు. తమకు అనుకూలంగా పని చేసేందుకే ప్రభుత్వం ఆ బలగాలు రప్పించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే వెన్నుపోటు పార్టీ కుట్ర..
కడప, రాయలసీమ ప్రాంతాలను హింసాత్మక ప్రాంతాలుగా చూపేందుకు వెన్నుపోటు పార్టీ ప్రయత్నిస్తోందని, ప్రాంతీయ, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే కుట్ర చేస్తోందని ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. మా పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలను.. చివరకు మాజీ సీఎం, మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను కూడా ఇబ్బంది పెట్టేందుకు, మమ్మల్ని లక్ష్యంగా చేసుకుని డబ్బు, అధికారంతో పాటు, పోలీసు బలాన్ని వినియోగిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది అత్యంత ప్రమాదకరం. ఇకనైనా ఇలాంటి కుట్రలకు వెన్నుపోటు పార్టీ స్వస్తి పలకాలని ఆయన విమర్శించారు.
అలాగే, ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలి. ప్రతి ఓటరుకు న్యాయమైన అవకాశం దక్కాలి. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి.. ఇవే మా వైఎస్సార్‌సీపీ లక్ష్యమని, ఆ దిశలోనే తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఆ డిబేట్‌లో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పులివెందుల రీపోలింగ్‌పై ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్


