అనంతపురం ఎడ్యుకేషన్: అదో విద్యాలయం.. ఉదయం పది గంటల సమయం.. తరగతి గది అంతా నిశ్శబ్దం.. ఉపాధ్యాయిని పాఠం బోధిస్తోంది.. విద్యార్థులంతా చక్కగా వింటుంటే.. అంతలోనే నిశ్శబ్దంగా ఉన్న గదిలో ఒక్కసారిగా అలజడి... అందరూ ఉలిక్కి పడి వెనక్కి చూశారు.. కరెంటు రంపంతో తలుపును కోస్తున్నట్లు కనిపించింది.. విషయాన్ని తేలికగా తీసుకున్న విద్యార్థులు..యధావిధిగా పాఠంలో పడిపోయారు.. ఉన్నపళంగా ఒక్క ఉదుటన ఉన్మాది బాలికల వైపు దూసుకొచ్చాడు.. ఓ విద్యార్థినిపై దాడికి తెగబడ్డాడు.. ఏమైందో..ఏం జరుగుతోందో.. తేరుకునేలోపే రక్తం ధారల్లా చిమ్ముతోంది.. గది అంతా హాహాకారాలు.. ఆర్తనాదాలు.. అంతలోనే సాహసలక్ష్మిగా వీరోచితంగా తిరగబడింది.. తోటి స్నేహితురాలిపై ఉన్మాది దాడిని ప్రతిఘటించింది.. అడ్డుకోయిన ఆమెపైనా దాడికి తెగబడ్డాడు.. రక్తపుమడుగులో నిస్సహాయంగా పడి ఉన్న బాలికను చూసి.. ఉన్మాది అక్కడి నుంచి ఉడాయించాడు.. ప్రశాంతంగా ఉన్న పాఠశాలలో జరిగిన ఈ ఘాతుకం.. దావానంలా వ్యాపించింది.. భయానికి తలవంచని బాలిక తెగువ.. మానవత్వం, ఆమె సాహసాన్ని ఎందరో ప్రశంసిస్తున్నారు. చదువుల తల్లి..భీతిల్లేలా జరిగిన భయానక ఘటన నేటికీ వెంటాడుతోంది.
ఇద్దరిదీ విడదీయలేని స్నేహం
రాప్తాడు మండలం అయ్యవారిపల్లికి చెందిన వెంకటరాముడు, నరసమ్మ దంపతుల కుమార్తె గోపిక, రాప్తాడు నాగరాజు, రమాదేవి దంపతుల కుమార్తె లక్ష్మి ఇద్దరూ ఆరోతరగతి నుంచి స్నేహంగా మెలుగుతున్నారు. పాఠశాలలోనూ పక్కపక్కనే కూర్చునేవారు. ప్రతి విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకునేవారు. ఇద్దరి మధ్య ఎంతో ఆత్మీయత ఉంది. అందుకే కళ్ల ముందే ప్రాణస్నేహితురాలిపై దాడి జరుగుతుంటే లక్ష్మీ తట్టుకోలేకపోయింది.
ప్రాణభయంతో పరుగులు..
ఉన్మాది తరగతి గదిలోకి ఎలక్ట్రిక్ రంపంతో చొరబడి తలుపును కట్ చేసిన అనంతరం నేరుగా గోపిక వద్దకు వెళ్లి ఆమె మెడపై దాడి చేశాడు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో తరగతి గదిలోని విద్యార్థులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయిని కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ, స్నేహితురాలు లక్ష్మి మాత్రం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఉన్మాది దాడిని అడ్డుకుంది. స్నేహితురాలి ప్రాణాలను కాపాడాలన్న ఆరాటంతో దుండగుడి దాడిని అడ్డుకునేందుకు వీరోచితంగా యత్నించింది.
స్నేహితురాలిని కాపాడబోయి..
తన దాడిని అడ్డుకునేందుకు యత్నించిన లక్ష్మిపై కూడా ఆగ్రహంతో ఉన్మాది రంపంతో దాడి చేశాడు. దీంతో ఆమె కూడా గాయపడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాణభయంతో ఎవరూ సాహసం చేసి ముందుకు వెళ్లలేని ఘటన.. అయినా ఆ బాలిక వెనక్కి తగ్గకుండా తన స్నేహితురాలి ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎదురొడ్డి నిలవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తనకేమవుతుందోనన్న ఆలోచన కంటే స్నేహితురాలి ప్రాణాలను కాపాడాలన్న తపనే ఆ సమయంలో లక్ష్మిలో కనిపించింది.
స్నేహానికి నిదర్శనం.. సమాజానికి స్ఫూర్తి
సాధారణంగా ప్రమాదం ఎదురైనప్పుడు ప్రాణభయంతో మనుషులు తమను తాము కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాంటిది ఓ పాఠశాలలో కళ్ల ముందే స్నేహితురాలిపై రంపంతో దాడి జరుగుతుంటే అందరూ భయంతో పరుగులు తీసిన వేళ.. లక్ష్మీ మాత్రం తన ప్రాణాలను పణంగా పెట్టి అడ్డుకునేందుకు యత్నించింది. ఆమె చేసింది సాహసం మాత్రమే కాదు.. స్నేహానికి, ఆత్మీయతకు, తోటి బాలిక పట్ల బాధ్యతకు నిలువెత్తు నిదర్శనం.
జీజీహెచ్‌లో లక్ష్మీ శస్త్రచికిత్స విజయవంతం
అనంతపురం సిటీ: రాప్తాడులో ఉన్మాది హేమంత్ రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీకి అనంతపురం జీజీహెచ్ ఆర్థో విభాగం వైద్యులు సోమవారం శస్త్రచికిత్స చేశారు. రాప్తాడు పాఠశాల విద్యార్థిని గోపికపై హేమంత్ దాడి చేస్తున్న సమయంలో లక్ష్మీ ధైర్యంగా ఎదుర్కొన్న విషయం విదితమే. హేమంత్ దాడిని అడ్డుకునే క్రమంలో ఎలక్ట్రిక్ రంపం తగిలి లక్ష్మీ కాళ్లకు లోతైన గాయాలయ్యాయి. ఘటన అనంతరం జీజీహెచ్‌లో అడ్మిషన్‌లో ఉన్న లక్ష్మీకి సోమ వారం ఉదయం ఆర్థో విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ బీఎండీ గౌస్ నేతృత్వంలో అనస్థీషియా డాక్టర్ మధుసూదన్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు నాయక్, డాక్టర్ సౌజన్య, ఆర్థో, అనస్థీషియా విభాగం పీజీలు, ఓటీ సిబ్బంది దాదాపు రెండు గంటలకు పైగా శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. బాలిక పాదంలో తెగిన నరాలు, బొటనవేలి సమీపంలో జాయింట్‌ను శస్త్రచికిత్సలో సరిచేశారు. ఆర్థో విభాగం వైద్యులను జీజీహెచ్ ఉన్నతాధికారులు అభినందించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.


