గుండెలు తీసిన ‘పచ్చ’ బంట్లు! | Anarchy and violence during local body elections go viral on social media | Sakshi
Sakshi News home page

గుండెలు తీసిన ‘పచ్చ’ బంట్లు!

Nov 3 2026 6:12 AM | Updated on Nov 3 2026 6:12 AM

Anarchy and violence during local body elections go viral on social media

చంద్రబాబు, లోకేశ్‌ కళ్లలో ఆనందం కోసం పరితపిస్తూ పంచ‘తంత్రం’ 

ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ తెచ్చిన కడప జిల్లా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ చౌదరి 

అక్రమాలకు శక్తివంచన లేకుండా సహకరించిన కడప ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ 

దౌర్జన్యాలకు దిశా నిర్దేశం చేసిన కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ చౌదరి 

వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు సీఎంవో నుంచి కలెక్టర్లను అక్రమాల దిశగా నడిపించిన ప్రద్యుమ్న 

పక్కా టీడీపీ కార్యకర్తగా ఎప్పటికప్పుడు సూచనలతో పేట్రేగిన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ లడ్డా 

వీరి నిర్వాకంతో వైఎస్సార్‌ జిల్లా, పులివెందుల, రాష్ట్రంలో పలుచోట్ల అరాచకం, దాష్టీకం 

ఈ ఐదుగురి అరాచక వ్యూహానికి వెన్నుదన్నుగా నిలిచిన డీజీపీ, ఎస్‌ఈసీ

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి లోకేశ్‌ కళ్లల్లో ఆనందం చూడటం కోసం ముఖ్య స్థానాల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు తమ స్థాయిని దిగజార్చుకుని.. బరితెగించి.. నిస్సిగ్గుగా.. నిర్భీతిగా పని చేసిన తీరు రాష్ట్ర­ంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు, లోకేశ్‌లు కోరుకుంటున్న ఫలితాల కోసం ఏకంగా ప్రజాస్వా­మ్యాన్నే ఖూనీ చేసేందుకు వెనుకాడని వైనం విస్తుగొ­లుపుతోంది. ఏమీ తెలియనట్లు పైకి అమాయకంగా కనిపిస్తూ కొందరు ఐఏఎస్‌లు వెనుక నుంచి అక్రమాలకు పచ్చ జెండా ఊపగా.. ఖాకీ చొక్కా వేసుకున్న పెద్దలే ముందుండి ఆ అరాచకాలకు ఊతమివ్వడం విస్తుగొలుపుతోంది. 

ఈ క్రమంలో గూండాలు, రౌడీ­లు, గంజాయి బ్యాచ్‌లు విచ్చలవిడి­గా పేట్రేగిపోయి వైఎస్సార్‌ జిల్లాలో.. ప్రత్యేకించి పులివెందులలో అరాచకం సృష్టించడం కలకలం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా పైచేయి సాధించడానికి తాలిబన్లను మించిన దాష్టీకాలకు తెర లేపడం ప్రజలను, ప్రజాస్వామ్యవాదులను భయభ్రాంతుల­కు గురిచేస్తోంది. పచ్చ మూక అరాచకాలు, దౌర్జ­న్యాలకు సంబంధించి వేలాది వీడియోలు, ఫొటోలు సోష­ల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నా వీరంతా చోద్యం చూడటం విశ్లేషకులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.

అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు..
కడప కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ చౌదరి పైకి మాత్రం ఏమీ తెలియని అమాయక చక్రవర్తి అన్నట్లు వ్యవహరిస్తారు. లోపల మాత్రం పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తారు. మొన్న టీడీపీ గూండాలు నామినేషన్‌ పత్రాలను లాక్కొన్నా.. చింపేసినా.. ఏకంగా ఆర్వోల చేతుల్లోంచి సైతం ఆ పత్రాలు లాక్కొని చింపేసినా తనకేమీ తెలియనట్లు.. జిల్లాలో ఏమీ జరగనట్లు వ్యవహరించారు. పోలింగ్‌ రోజున పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన గూండాలు యథేచ్ఛగా బూత్‌లను ఆక్రమించడం.. రిగ్గింగ్‌ చేయడం కళ్లెదుటే కనిపిస్తున్నా.. ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదు చేసినా.. ఏమీ జరగనట్లు ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారు.

ఆదివారం పులివెందులలో చోటుచేసుకున్న పరిణామాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూసినా కలెక్టర్‌ మాత్రం మూడు నాలుగు చోట్ల మినహా అంతా ప్రశాంతం అంటూ క్లీన్‌చిట్‌ ఇస్తూ నివేదించడం దుర్మార్గానికి పరాకాష్టగా నిలిచింది. ఏకంగా 70 మంది వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా పోలింగ్‌ కేంద్రాల్లోంచి బయటకు గెంటేసినా కలెక్టర్‌ నుంచి ఏమాత్రం స్పందన లేకపోవడం నివ్వెర పరుస్తోంది. వైఎస్సార్‌సీపీ నేతలు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసినా, వాటిని బుట్ట దాఖలు చేయడం ఈయనకే చెల్లింది. ఇప్పటి దాకా ఏ కలెక్టర్‌ వ్యవహరించనంత దారుణంగా పనిచేసిన ఘనత సదరు కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ చౌదరికి మాత్రమే దక్కింది. 

‘పచ్చ’ బొట్టు పొడిపించుకున్నట్టు పోలీసు విధులు 
కడప జిల్లాలో, పులివెందులలో వైఎస్సార్‌సీపీని పూర్తి­గా దెబ్బతీయడానికి ‘పచ్చ’»ొట్టు పొడిపించుకున్నట్టు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ చెలరేగిపోయారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన స్థానంలో ఉన్న ఆయన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రక్రియలో తన వంతు పాత్ర పోషించారు. పోలింగ్‌ జరుగుతున్న రోజు ఆయా ప్రాంతాలకు ఇతర ప్రాంతాల వారు వస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి.. వారికి ఆశ్రయం కల్పించేలా పోలీసులకు దిశా నిర్దేశం చేయడం విస్తుగొలుపుతోంది. నామినేషన్ల ప్రక్రియలోనే మూడు రోజుల పాటు టీడీపీ మూకలు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు దిగుతూ నామినేషన్లను అడ్డుకున్నా ఎస్పీగా పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. 

బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమల్లో ఉన్నా గుంపులను చెదరగొట్టలేదు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు, హౌస్‌ అరెస్టులు.. దాడులకు దిగిన మూకలకు మాత్రం అడ్డుకట్ట లేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్తే దాడులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. వరుస ఘటనలు జరిగినా పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు జారీ చేసి హౌస్‌ అరెస్టులు చేయడంలో చురుగ్గా వ్యవహరించిన పోలీసులు, నామినేషన్లను అడ్డుకున్న మూకలను నియంత్రించడంలో మాత్రం విఫలమయ్యారు.

పులివెందులలో 70 మంది వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి వెళ్లగొట్టారనే విషయం తెలిసినా ఏమీ పట్టించుకోలేదు. పైగా తమకు ఫిర్యాదు రాలేదంటూ అమాయకంగా చెప్పడం కొసమెరుపు. ఎస్పీ ఆదేశాల మేరకే పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ వైఎస్సార్‌సీపీ నేతలను అడుగడుగునా అణచి వేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఓటు వేయడానికి వెళ్తున్న మహిళలను సైతం నిస్సిగ్గుగా అడ్డుకున్న పోలీసు ఎవరైనా ఉన్నారా.. అంటే అది డీఎస్పీ మురళీ నాయక్‌ అని రాష్ట్ర మంతా కోడై కూస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ మెప్పు పొందడం కోసం ఒక ఎస్పీగా దిగజారకూడనంతగా దిగజారి పని చేశారని పోలీసుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 

ఎస్పీలకు పచ్చ చొక్కాలేయించిన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌
ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేష్‌ చంద్ర లడ్డా చంద్రబాబు ఏజెంట్‌గా మారిపోయారు. రాష్ట్రంలో పచ్చ మూక దురాగతాల్లో తన వంతు పాత్ర పరోక్షంగా పోషించారు. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు జరిగే పరిణామాలను బట్టి.. ఏం చేస్తే టీడీపీకి ఉపకరిస్తోందో చంద్రబాబుకు, లోకేశ్‌కు వెనువెంటనే చెబుతూ అక్రమాల్లో భాగం పంచుకున్నారు. మరోవైపు ఆయా జిల్లాల ఎస్పీలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై తప్పుడు కేసులకు పురమాయించారు. వందలాదిగా టీడీపీ మూకలు నామినేషన్‌ కేంద్రాల వద్దకు వచ్చిన, పోలింగ్‌ కేంద్రాల వద్దకు వచ్చినా లడ్డా ఆదేశాల వల్లే జిల్లా ఎస్పీలు పట్టించుకోలేదు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఐదారు మంది వచ్చినా అడ్డుకున్నారు. పలుచోట్ల లాఠీలు సై­తం ఝు­ళి­పించారు. 

గంజాయి మూకలు యథేచ్ఛగా రెచ్చిపోయినా ఏమాత్రం పట్టించుకోలేదు. నామి­నేషన్‌ పత్రాలను పోలీసుల ఎదుటే చింపేసినా, మహిళ అభ్యర్థుల చేతుల్లోంచి పత్రాలను గూండాలు లాక్కెళ్తున్నా పోలీసులు కళ్లప్పగించి చూశా­రు తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయ లేదంటే ఈయన నుంచి ఎంత గట్టిగా ఆదేశాలు వెళ్లి ఉంటాయో అర్థమవుతోంది. ఎలాగైనా సరే టీడీపీ­కి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి పెట్టా­లనే లక్ష్య­ంతో పోలీసు యంత్రాంగంపై ఎంతగా విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు.

గూండా రాజ్‌లో కీలక పాత్రధారి
కర్నూలు రేంజ్‌ డీఐజీగా చంద్రబాబు, లోకేశ్‌లు ఉంటే కూడా టీడీపీ కోసం అంతగా చేయరేమో అన్నట్లు డీఐజీ కోయ ప్రవీణ్‌ చౌదరి రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ పేరు వింటేనే అంతెత్తున ఎగిరిపడే ఆయన ఆ పార్టీని అణచి వేయడానికి గంజాయి మూకలకు మించిన రీతిలో దౌర్జన్యాలకు దిశా నిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల వేళ ప్రత్యేకంగా కడప, పులివెందులలో పర్యటించి అక్కడ వైఎస్సార్‌సీపీని అడ్డుకోవడానికి పచ్చ పార్టీ గూండాలతో కలిసి మంతనాలు చేశారు. నామినేషన్లు మొదలు కౌంటింగ్‌ వరకు ఎప్పుడు, ఎక్కడ ఏం చేయాలో దశల వారీగా టీడీపీ గూండాలకు స్క్రిప్ట్‌ ఇచ్చారు.ఆపై ఆ స్క్రిప్ట్‌ పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షించారు. 

అందువల్లే ఎక్క­డా లేని విధంగా వైఎస్సార్‌ కడప జిల్లాలో దాడు­లు, దౌర్జన్యాలు, ప్రజాస్వామ్య హననం చోటు­చేసుకుంది. పులివెందులలో టీడీపీని గెలిపించి చంద్రబాబు, లోకేశ్‌ కళ్లల్లో ఆనందం చూడాలనే తాపత్రయంతో పని చేయడం అడుగడుగునా కనిపిస్తోంది. ఏఎస్పీ ప్రకాశ్‌బాబు ద్వారా తన వ్యూ­హాన్ని అమలు చేశారు. అరాచకాలకు పెద్దపీట వేయడం, అధికార పక్షానికి కొమ్ముకాస్తూ ప్రతిపక్షానికి నరకం చూపించడమే ఆయన లక్ష్యమైంది. ఈ క్రమంలోనే నామినేషన్‌ ప్రక్రియను రణరంగంగా మార్చేశారు. అర్హత ఉన్న ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా సమర్థవంతంగా అడ్డుకోగలిగారు. 

పచ్చ మూకలను తొలుతే రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోకి అనుమతించారు. కళ్ల ముందే దాడులు జరుగుతున్నా.. ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. పైగా ప్రశ్నించిన వారిపైనే తిరిగి కేసులు పెట్టేలా కింది సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ప్రతిపక్ష సభ్యులపై దాడి చేయడంలో టీడీపీ రౌడీలు వెనుకబడినప్పుడు పోలీసులే ఆ బాధ్యతను నిర్వర్తించేలా పకడ్బందీగా సీన్‌ను నడిపించారు. ప్రతిపక్ష సభ్యులెవరూ నామినేషన్‌ వేయకూడదు.. ఒక వేశ వేసినా పోలింగ్‌ సవ్యవంగా జరగకూడదు.. అదీ దాటు­కుని ముందుకు వెళ్లినా కౌంటింగ్‌ రోజు గొడవలు చేసేలా టీడీపీ మూకలకు దిశా నిర్దేశం చేశారు. ఇంత నిస్సిగ్గుగా పని చేసిన ఐపీఎస్‌ అధికారి భారతదేశ చరిత్రలోనే ఉండరని పోలీసులే బాహాటంగా మాట్లాడుకుంటున్నారు.

కలెక్టర్లకు కళ్లెం వేసిన సీఎంవో కార్యదర్శి 
2004 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి పీఎస్‌ ప్రద్యుమ్న సీఎంవో కార్యదర్శిగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ చెప్పింది చెప్పినట్లుగా పొల్లు పోకుండా చేసి వారి కళ్లల్లో ఆనందం చూశారు. స్థానిక ఎన్నికల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు ఎలాంటి అక్రమాలు చేయకూడదో.. వాటన్నింటినీ వారి ద్వారా చేయించారు. ఎన్నికలు సవ్యంగా జరిగేలా తీసుకోవాల్సిన చర్యల ముసుగులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు న్యాయం జరగకుండా చక్రం తిప్పారు. నామినేషన్లు వేయనివ్వలేదని, తమ నామినేషన్‌ పత్రాలను చింపేశారని.. ఫలానా పోలింగ్‌ బూత్‌లో రిగ్గింగ్‌ జరుగుతోందని.. ఫలానా చోట వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు తోసేశారని ఎన్ని ఫిర్యా­దులు వెళ్లినా జిల్లా కలెక్టర్లు స్పందించక పోవడానికి ప్రద్యుమ్న ఆదేశాలే కారణమని స్పష్టమవుతోంది. 

బాధిత అభ్యర్థులు చెప్పింది విని తలూపారే తప్ప.. కలెక్టర్లు ఎక్కడా ఉన్నది ఉన్నట్లు నివేదించక పోవడమే ఇందుకు నిదర్శనం. ఎస్‌ఈసీ ఏమో కలెక్టర్‌ ఇచ్చే నివేదికలపైనా తాము నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టంగా చెబు­తున్నా, ఆ పనిని నిస్వార్థంగా చేయ­డంలో కలెక్టర్లు విఫలమయ్యారని కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తోంది. వందల సంఖ్యలో అక్రమాలు, దౌర్జన్యాలు జరిగినా.. అంతా ప్రశాంతం అంటూ పైకి నివేదికలు పంపడంలో ప్రద్యుమ్న ఒత్తిడే కారణమని బ్యూరోక్రాట్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

పంచ‘తంత్రం’కు డీజీపీ, ఎస్‌ఈసీ సహకారం 
రాష్ట్రంలో టీడీపీకి స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిపెట్టడానిక కంకణం కట్టుకున్న ఈ ఐదుగురు అధికారులకు ఓ వైపు నుంచి డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా.. మరో వైపు నుంచి ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునేఠా తోడయ్యారు. వీరిద్దరూ పక్కా చంద్రబాబు మనుషులు కావడంతో రాష్ట్రంలో ఎంతటి దారుణాలు చోటుచేసుకున్నా మిన్నకుండిపోయారు. ఏం జరిగినా కింది నుంచి నివేదికలు వస్తే చర్యలు తీసుకుంటామంటూ పాడిన పాట పాడుతూ కాలం గడుపుతున్నారు. ఎన్నికల వేళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన కీలక బాధ్యతల్లో ఉన్న వీరు అడుగడుగునా పచ్చ బ్యాచ్‌కు అండగా నిలవడం రాష్ట్ర ప్రజలను నివ్వెర పరిచింది. వీరంతా చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేశారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతర్‌ చేస్తూ అరాచకాలకు ఆజ్యం పోశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement