శరీరంపై తీవ్రంగా రంపపు కోతలు
కుట్లు వేయడానికి 110 బాక్స్‌లకు పైగా సూచర్ మెటీరియల్ వినియోగం
బాలిక హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యశాఖ
సాక్షి, అమరావతి/సాక్షి, బెంగళూరు: అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని గోపిక క్రమంగా కోలుకుంటోంది. బాలిక శరీరంపై పెద్దఎత్తున రంపపు కోతలున్నట్లు సమాచారం. సుమారు 11 గంటల సుదీర్ఘ క్లిష్టమైన ఆపరేషన్‌ను వైద్యులు నిర్వహించారు. వీటికి కుట్లు వేయడానికి ఏకంగా 110 బాక్స్‌లకు పైగా సూచర్ మెటీరియల్‌ను వైద్యులు వినియోగించారని తెలుస్తోంది. చెట్లు కోసే ఎలక్ట్రిక్ రంపం యంత్రంతో నిందితుడు హేమంత్ శనివారం అత్యంత క్రూరంగా గోపికపై దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గోపికకు బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. బాలిక హెల్త్ బులిటెన్‌ను వైద్యశాఖ సోమవారం విడుదల చేసింది.
అదుపులోకి రక్తపోటు.. మూత్రపిండాలు సాధారణ స్థితికి..
గోపిక రక్తపోటు క్రమంగా అదుపులోకి వచ్చిందని వైద్యశాఖ తెలిపింది. ఆదివారం వరకు రక్తపోటు నియంత్రణకు రెండు రకాల మందులు ఇవ్వగా, బాలిక స్పందించడంతో రాత్రికి ఒక మందును నిలిపివేశారు. మూత్ర విసర్జన వ్యవస్థ మెరుగుపడటంతో పాటు, రక్త పరీక్షల్లో మూత్రపిండాల పనితీరు సాధారణ స్థాయిలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. రానున్న 48 గంటలు ఎంతో కీలకమని వారు చెబుతున్నారు.
గోపిక క్రమంగా కోలుకుంటోందని, ప్రాణాపాయం నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. గోపిక ఆరోగ్యం యథాస్థితికి చేరుకున్న తర్వాత శరీరంపై ఉన్న గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ అవసరం పడుతుందని ప్లాస్టిక్ సర్జన్స్ అభిప్రాయపడుతున్నారు. దాడి అనంతరం బాలికకు అత్యవసర చికిత్స అందించడంలో వేగంగా స్పందించిన అనంత జీజీహెచ్ వైద్యులు హరికృష్ణ, మహేశ్, సాంకేతిక నిపుణుడు గౌస్‌కు డీఎంఈ డాక్టర్ విష్ణువర్థన్ ప్రశంసాపత్రాలు ఇచ్చారు.


