పోలింగ్ రోజున జరిగిన ఘటనలే ఇందుకు సాక్ష్యం
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు
పులివెందులలో 70 చోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా చేశారు.. బయటి ప్రాంతాల టీడీపీ గూండాలు స్వైర విహారం చేశారు
బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్, సైక్లింగ్
ఈ దారుణాలన్నీ పోలీసుల సహకారంతోనే జరిగాయి
అక్రమాలకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) చంద్రబాబుకు తొత్తుగా మారిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నికల అక్రమాలకు ఎస్‌ఈసీ ఎంతలా అండగా నిలుస్తోందో చెప్పడానికి.. పులివెందుల సహా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోలింగ్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ఎన్నికల్లో అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
కేవలం 4 బూత్‌ల్లో రీపోలింగ్ ఎంత వరకు న్యాయం?
పోలింగ్ రోజున పులివెందులలో 80 పోలింగ్ బూత్‌ల్లో 70 చోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను లేకుండా చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసుల అండదండలతో బయటి ప్రాంతాల నుంచి వచి్చన టీడీపీ గూండాలు స్వైర విహారం చేశారు. మా పార్టీ కి చెందిన ఏజెంట్లు బూత్‌ల లోకి పోకుండా దాడులు చేశారు. ఇంకొన్ని చోట్ల మా ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు లాగేశారు. ఇవన్నీ పోలీసుల సహకారంతోనే జరిగాయి. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్, సైక్లింగ్ చేశారు.
ఈ దారుణాలకు సంబంధించిన వీడియో ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ 70 బూత్‌లలో మా పార్టీ కి చెందిన ఏజెంట్లు నేరుగా నా సమక్షంలోనే అధికారులకు ఏజెంట్ల ఫారాలు చూపుతూ ఫిర్యాదు చేసి, నిరసన తెలిపారు. రాష్ట్రం మొత్తం దీన్ని చూసింది. అయినా ఎస్‌ఈసీ స్పందించిన తీరు అత్యంత దారుణం. 80 బూత్‌లకు గాను, 70 బూత్‌ల్లో అక్రమాలు జరిగితే.. దాడులు చేసి, అక్కడి నుంచి ఏజెంట్లనే తరిమేస్తే.. కేవలం 4 బూత్‌లలో మాత్రమే రీ పోలింగ్‌కు ఆదేశించి చేతులు దులుపుకోవడం ఎంత వరకు న్యాయం?
ఎన్నికల అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తాం
ఎస్‌ఈసీ చేసింది ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన కంటితుడుపు చర్య కాదా? వీటిని స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత
ఎన్నికలని అంటామా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే అధికార పార్టీ అక్రమాలపై కళ్లు మూసుకుంటే, ఇక ప్రజల ఓటు హక్కుకు రక్షణ ఎక్కడ? ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది? పులివెందులలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలే జరిగాయి.
కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలో.. మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, జమ్మలమడుగు, నంద్యాల, చీమకుర్తి, గిద్దలూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, సూళ్లూరుపేట, పలాస, డోన్, నాయుడుపేట, నందిగామ, జగ్గయ్యపేట, కుప్పం, పుత్తూరు, పార్వతీపురం సహా పలు మున్సిపాల్టీల్లోనూ యథేచ్ఛగా ఎన్నికల అక్రమాలు జరిగాయి. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఎన్నికల అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తాం. వీటికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. ఆలస్యం కావొచ్చేమోగానీ, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.


