ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠకు వినతిపత్రం ఇస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
రిగ్గింగ్, దాడులపై ఫిర్యాదు చేసినా ఎస్‌ఈసీ ఎందుకు చర్యలు తీసుకోదు?
కళ్లముందు కనిపించే వాస్తవాలు పట్టవా?.. కలెక్టర్ల నివేదికలే ముఖ్యమా?
వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం
ఎన్నికల్లో అక్రమాలపై ఎస్‌ఈసీకి మరోసారి వైఎస్సార్‌సీపీ వినతిపత్రం
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో రిగ్గింగ్, దొంగ ఓట్లు, పోలింగ్ కేంద్రాల్లో దాడులు జరిగినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని వైఎస్సార్‌సీపీ నేతలు నిలదీశారు. రిగ్గింగ్ నిజమని, దానిని పట్టించుకోకుండా కంటితుడుపు చర్యగా కొన్ని చోట్లే రీపోలింగ్ నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని అన్నారు. కళ్ల ముందే వాస్తవాలు కనిపిస్తున్నా వాటిని పట్టించుకోకుండా కలెక్టర్లు ఇచ్చే నివేదికలే ముఖ్యమని ఎస్‌ఈసీ చెప్పడం దారుణమని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ నేతలు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)ని కలిసి మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ అక్రమాలు, దౌర్జన్యాలపై మరోమారు వినతిపత్రం సమర్పించారు. అనంతరం పార్టీ నేతలు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పులివెందులలో 80 పోలింగ్ బూత్‌లకు గాను 70 బూత్‌ల నుంచి ఏజెంట్లను బయటకు నెట్టేసి రిగ్గింగ్ చేయడం, కడప, కర్నూలు, జమ్మలమడుగు, తిరుపతి, మాచర్ల, చిలకలూరిపేట సహా పలు ప్రాంతాల్లో జరిగిన అక్రమాలపై ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని చెప్పారు.
ఎన్నికలను నిష్పక్షపాతంతో నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే వాతావరణాన్ని కల్పించే బాధ్యతను కూడా విస్మరించిందన్నారు. కేవలం కలెక్టర్ల నివేదికలపైనే ఆధారపడుతూ ఫిర్యాదులను పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. జమ్మలమడుగులో ఉదయం 11 గంటలకే 60 శాతం పోలింగ్ ఎలా నమోదైందో ఎస్‌ఈసీ చెప్పాలని అన్నారు.
5న జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని, ఎక్కడైనా అక్రమాలు జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌ఈసీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ నాయకులు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, ఎ.నారాయణమూర్తి, నత్తా యోనారాజు, నరేంద్రసింగ్ తదితరులు కూడా ఉన్నారు.


