ఏపీలో విచ్చలవిడిగా మద్యం, గంజాయి | YS Jagan lashes out at Chandrababu Naidu government | Sakshi
Sakshi News home page

ఏపీలో విచ్చలవిడిగా మద్యం, గంజాయి

Nov 3 2026 5:17 AM | Updated on Nov 3 2026 5:19 AM

YS Jagan lashes out at Chandrababu Naidu government

బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో గోపిక కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న వైఎస్‌ జగన్‌

అందుకే రాప్తాడు తరహా ఘటనలు  

చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌ 

రాష్ట్రంలో దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలు 

స్కూల్‌లో చదివే పిల్లలకు భద్రత లేకపోతే ఎలా? 

గోపికపై దాడి ఘటన పూర్తిగా ప్రభుత్వం తప్పిదం 

బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ప్రకటించాలి.. లేదంటే మేం అధికారంలోకి వచ్చిన నెలలోనే ఇస్తాం

బాధిత బాలికకు 11 గంటల పాటు ఆపరేషన్‌ జరిగిందని వైద్యులు చెప్పారు 

ప్రమాదం నుంచి బయట పడుతుందనడం మనసును కుదుట పరిచే విషయం  

పూర్తిగా కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నా

పాఠశాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఏకంగా విద్యుత్‌ రంపం తీసుకుని హైస్కూల్‌లోకి ప్రవేశించి, బాలికలపై దాడి చేసిన పరిస్థితి చూస్తుంటే ఇక స్కూళ్లలో చదువుకునే పిల్లల భద్రత మాటేమిటి? రాష్ట్రంలో ఇలాంటి దారుణ పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వమే. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో విచ్చలవిడిగా గంజాయి, మద్యం అందుబాటులోకి రావడంతో యువత వ్యసనాలకు బానిసలవుతున్నారు. వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ పరిస్థితుల వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని నియంత్రించలేక పోతున్నందుకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి.  - వైఎస్‌ జగన్‌   

సాక్షి, బెంగళూరు: జెడ్పీ ఉన్నత పాఠశాలలోకి.. స్కూల్‌కు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఏకంగా ఒక ఎలక్ట్రిక్‌ రంపం తీసుకుని వచ్చి తనకు ఇష్టమొచ్చినట్లు ఆడపిల్లలపై దాడి చేస్తే స్కూళ్లలో చదివే పిల్లల పరిస్థితి ఏమిటని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం రా­ష్ట్రంలోని ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో విచ్చలవిడిగా బెల్టుషాపులు, గంజాయి అందుబాటులోకి రావడమేనని నిప్పులు చెరిగారు. విచ్చలవిడిగా బెల్టుషాపులు, గంజాయిని అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలను వాటికి బానిసలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా­రు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అరిష్టాల్లో ఇదొకటని తెలిపారు. 

గంజాయి, బెల్టుషాపులను అరికట్టే విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందుకు సిగ్గుతో తలవంచుకోవాలని హితవు పలికారు. అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హై­సూ్కల్‌లో ఉన్మాది హేమంత్‌ చేతిలో తీవ్ర గాయాలపాలై బెంగళూరు ఓల్డ్‌ హెచ్‌ఏఎల్‌ రోడ్డులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పదో తరగతి బాలిక గోపికను సోమవారం ఆయన పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడా­రు. గోపిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం మణిపాల్‌ ఆస్పత్రి ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..  

విద్యార్థిని గోపిక తల్లిదండ్రులను పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీసిన అనంతరం పార్టీ నేతలకు సూచనలు ఇస్తున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. ఆ తరువాత ఆస్పత్రి ముందు మీడియాతోమాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌  

ఒక్క రాప్తాడులోనే 9 దారుణ ఘటనలు  
ఇంత విచ్చలవిడిగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనే గత 15–16 నెలల్లో ఇలాంటి తరహా ఘటనలు జరగడం ఇది తొమ్మిదోసారి. వాటిలో ఆరు ఘటనలు మహిళలు, బాలికలకు సంబంధించినవే కావడం ఆందోళనకరం. ఇప్పుడు గోపిక అనే బాలికపై జరిగిన దాడితో పాటు అనూష, సావిత్రిబాయి, సావిత్రమ్మలకు సంబంధించిన ఘటనలు, అలాగే 14 ఏళ్ల ఎస్సీ మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం, కురువ లింగయ్య హత్య, బోయ నాగేశ్‌ హత్య, నారాయణ రెడ్డి హత్య, స్పందన అనే యువతి ఆత్మహత్య వంటి ఘటనలు రాప్తాడులో చోటుచేసుకున్నాయి. 

ప్రతి గ్రామంలో యథేచ్ఛగా గంజాయి, మద్యం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రెడ్‌బుక్‌ పాలన పేరుతో పోలీసు వ్యవస్థను రాజ­కీయ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడపడం వల్ల పోలీసులు కూడా శాంతిభద్రతలపై దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడటంతో ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలకు, ముఖ్యంగా మహిళలు, బాలికల భద్రతకు రక్షణ లేకుండా పోతోంది. 

కోలుకుంటున్న బాలిక  
దేవుడి దయ వల్ల పాప పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారు. 11 గంటల పాటు ఆపరేషన్‌ జరిగిందని.. మరో 48 గంటలు ఎంతో కీలకమని.. గోపిక త్వరగా కోలుకుంటుందని తెలిపారు. ఒకవైపు చిన్నారికి జరిగిన దారుణాన్ని తలచుకుంటే తీవ్ర ఆవేదన కలుగుతోంది. మరో వైపు బాలిక ప్రమాదం నుంచి బయట పడుతుందని వైద్యులు తెలుపడం మనసును కాస్తా కుదుట పరిచే విషయం. 

ఈ సమాచారం సంతోషాన్ని కలిగిస్తోంది. ఆ పాప పూర్తిగా కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నా. చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్న బాధిత బాలిక గోపిక చిన్నాన్న వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి, మాజీ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఇతర నాయకులు ఉన్నారు. 

పొరుగు రాష్ట్రంలోనూ అదే అభిమానం  
తమ అభిమాన నాయకుడు మణిపాల్‌ ఆస్పత్రికి వస్తున్నారని సమాచారం అందుకున్న వైఎస్‌ జగన్‌ అభిమానులు ఆస్పత్రి వద్దకు పోటెత్తారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా భారీగా తరలివచ్చారు. వైఎస్‌ జగన్‌ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. దూసుకొస్తున్న అభిమానులను కట్టడి చేసేందుకు బెంగళూరు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 

ఇది కచ్చితంగా ప్రభుత్వ తప్పిదమే 
‘ఆంధ్రప్రదేశ్‌లో దారుణంగా క్షీ­ణించిన శాంతి భద్రతలకు అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైసూ్కల్‌లో విద్యార్థినిపై జరిగిన దాడి ప్రత్యక్ష ఉదాహరణ. రాప్తాడు ఘటన ప్రభుత్వం తప్పిదం వల్లే జరిగింది. స్కూల్‌తో సంబంధం లేని, ఒక తెలియని వ్యక్తి ఏకంగా ఎలక్ట్రిక్‌ రంపం తీసుకొచ్చి బాలికలపై దాడి చేసే పరిస్థితి నెలకొంటే ఇక స్కూళ్లలో చదువుకునే పిల్లలకు ఎంత వరకు భద్రత ఉంటుంది? అసలు పాఠశాలలోకి ఒక వ్యక్తి విద్యుత్‌ రంపంతో వస్తుంటే అడ్డుకునే పరిస్థితి లేక పోవడం అత్యంత దారుణం. చివరకు స్కూళ్లలో కూడా పిల్లలకు రక్షణ లేకుండా పోయింది. 

రాష్ట్రంలో ఇలాంటి దారుణ పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం కూటమి పార్టీ వైఫల్యమే. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఒక అమాయక బాలిక నేడు చావు బతుకుల మధ్య పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు బాధితురాలి కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలి. వైద్యానికి  సంబంధించి పూర్తిగా అన్ని రకాలుగా తోడుగా నిలవాలి. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే వైద్య పరంగా, ఇంకా అన్ని రకాలుగా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం రాకపోతే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement