‘పుర’ భవితవ్యం తేలేది నేడే | All arrangements completed for the counting of votes in 13 city corporations and 79 municipalities | Sakshi
Sakshi News home page

‘పుర’ భవితవ్యం తేలేది నేడే

Nov 3 2026 5:28 AM | Updated on Nov 3 2026 5:28 AM

All arrangements completed for the counting of votes in 13 city corporations and 79 municipalities

13 నగర కార్పొరేషన్లు, 79 మునిసిపాలిటీల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి 

ఉదయం 8 గంటల నుంచి  ప్రారంభం 

రాత్రి 8 గంటలలోపే అన్ని చోట్లా ఫలితాలు 

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడి  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘పుర’పోరుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. 13 నగర కార్పొరేషన్లలో మేయర్, 804 డివిజన్లలో కార్పొరేటర్ల పదవులతో పాటు 79 మున్సిపాలిటీల్లో 2,382 వార్డు కౌన్సిలర్లు, 70 చైర్మన్‌ పదవులకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తెలిపింది. మంగళవారం రాత్రి 8 గంటలలోపే అన్ని చోట్లా లెక్కింపు పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొంది. మొత్తం 138 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుందని తెలిపింది. గ్రేటర్‌ విశాఖపట్నంలో మాత్రమే ఒక్క కార్పొరేషన్‌కు సంబంధించి పది లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

మిగిలిన 12 నగర కార్పొరేషన్లలో ఒక్కో లెక్కింపు కేంద్రం వంతున ఏర్పాటు చేశారు. ఈ మొత్తం 22 లెక్కింపు కేంద్రాల్లో 4,026 టేబుళ్లు ఏర్పాటు చేసినట్టు కమిషన్‌ తెలియజేసింది. 79 మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన 116 లెక్కింపు కేంద్రాల్లో 2,805 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియలో మొత్తం 47,817 మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటారని కమిషన్‌ వివరించింది. ఆయా కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు 1372 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.  

రీపోలింగ్‌లో 60.64 శాతం ఓట్లు నమోదు 
ఎన్నికల అధికారుల వెల్లడి 
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సి పాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని 13 పోలింగ్‌ బూత్‌లలో సోమవారం నిర్వహించిన రీపోలింగ్‌లో సాయంత్రం 5 గంటల సమయానికి 60.64 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 9,890 మంది ఓటర్లకు గాను 6,041 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. 

వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలోని 1వ వార్డు 1/1 పోలింగ్‌ బూత్‌లో 929 ఓట్లకు 608 పోలయ్యాయి. 3వ వార్డు 3/1 పోలింగ్‌ బూత్‌లో 638 ఓట్లకు 354, 7వ వార్డు 7/1 పోలింగ్‌ బూత్‌లో 750 ఓట్లకు 356 ఓట్లు,  8 వార్డు 8/1 పోలింగ్‌ బూత్‌లో 722 ఓట్లకు 411 పోలయ్యాయి. జమ్మలమడుగులో 3వ వార్డులోని 3/2 బూత్‌లో 599 ఓట్లకు గానూ 342 ఓట్లు పోలయ్యాయి. 17వ వార్డు 17/1 బూత్‌లో 588 ఓట్లకు 414 ఓట్లు పోలయ్యాయి. 29వ వార్డు 29/1 పోలింగ్‌ కేంద్రంలో 650 మంది ఓటర్లలో 491 మంది ఓటు వేశారు. కడప నగరం 15వ వార్డులో 15/2 పోలింగ్‌ కేంద్రంలో 996 మంది ఓటర్లలో 693 మంది ఓటు వేశారు. 

ప్రకాశం జిల్లా చీమకుర్తి 14వ వార్డు 14/1 పోలింగ్‌ కేంద్రంలో 900 మంది ఓటర్లకు గాను 661 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల 23వ వార్డు 23/1బూత్‌లో 607 ఓట్లకు 349, 23/2 పోలింగ్‌ బూత్‌లో 606 ఓట్లలో 378 ఓట్లు పోలయ్యాయి. అనంతపురం నగరం 30వ వార్డు 30/3 పోలింగ్‌ కేంద్రంలో 980 ఓట్లలో 518 ఓట్లు పోలయ్యాయి. తిరుపతి నగరం 36వ వార్డు 36/4 పోలింగ్‌ కేంద్రంలో 925 ఓట్లలో 466 పోలయినట్లు అధికారులు వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement